సోదరికి సునీత పరామర్శ..ఏం జరగబోతోంది?
ఫాంహౌస్ కేసు పులిలా గాండ్రిస్తుందనకుంటే పిల్లిలా చడీచప్పుడు చేయడంలేదు. బీఆర్ఎస్ బోణీ ఎలా ఉంటుందో తెలీదు. మరోవైపు లిక్కర్ స్కామ్లో సీబీఐ ఎంక్వయిరీ కూతురి ఇంటిదాకా వచ్చింది. వీటన్నిటినీ డైవర్ట్ చేయడానికి షర్మిల మీద ఫోకస్ పెట్టారా లేకపోతే నిజంగానే వైఎస్ కూతురి ఆరోపణలు భయపెడుతున్నాయో తెలీదుగానీ ఇంటిదగ్గర కూడా దీక్ష చేయనివ్వలేదు. పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఇంటి దగ్గరే ఆమరణదీక్షకు దిగారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఆ దీక్షను భగ్నం చేసి షర్మిలను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
24గంటలు దీక్షలో కూర్చున్నా తెలంగాణ ప్రభుత్వం భరించలేకపోయింది. ప్రభుత్వం భగ్నం చేసినా వైఎస్ షర్మిల దీక్ష అందరి దృష్టిలో పడింది. ప్రభుత్వం ఎందుకు ఆమెను వెంటాడుతోందన్న చర్చ మొదలైంది. షర్మిల దీక్షకి స్వయానా సోదరి వచ్చి మద్దతు పలకడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. షర్మిలని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత పరామర్శించారు. ఈ సందర్భంగా కాసేపు మాట్లాడుకున్నారు. తండ్రి హత్యపై సీబీఐ ఎంక్వయిరీ కోసం సునీత పెద్ద పోరాటమే చేశారు. కేసు విచారణ పక్క రాష్ట్రానికి బదిలీ అయ్యేలా న్యాయపోరాటం చేశారు. బాబాయ్ హత్యపై వైఎస్ జగన్మోహన్రెడ్డి నోరు మెదపడం లేదని విపక్షాలు విమర్శలు చేశాయి. సునీత ప్రత్యక్ష విమర్శలేమీ చేయకపోయినా జగన్పై ఆమె అసంతృప్తితోనే ఉన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి కూతురి న్యాయపోరాటానికి వైఎస్ షర్మిల నైతిక మద్దతిచ్చారు. ఇప్పుడామె షర్మిలకు సంఘీభావం తెలిపారు. వైఎస్ కుటుంబంలో అంతర్గత పోరు నడుస్తోందని అన్నాచెల్లెళ్ల మధ్య అంతరాలు పెరిగాయన్న ప్రచారం కొన్నాళ్లుగా ఉంది. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీతో ఆమె కార్యాచరణతో తనకేం సంబంధంలేదని వైసీపీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. ఈ సమయంలో వైఎస్ షర్మిలను సునీత పరామర్శించడం ఊహించని పరిణామం. సునీత పోరాటానికి షర్మిల మద్దతుందనే ప్రచారానికి ఈ కలయిక బలం చేకూర్చింది. అన్నతో విభేదిస్తున్న అక్కాచెల్లెళ్లు ఒకరికొకరు సహకరించుకునేలా ఉన్నాయ్ ఈ పరిణామాలు.