ఉరవకొండలో అన్నదమ్ముల సవాల్

By KTV Telugu On 11 December, 2022
image

అన్నపై కాలు దువ్వుతున్న తమ్ముడు
విశ్వేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి మధ్య విభేదాలు
మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే వాగ్వాదం

సీఎం జగన్ వై నాట్ 175 అంటున్నారు. నియోజకవర్గాల్లో పరిస్థితి చూస్తే అక్కడక్కడ వర్గవిభేదాలతో నేతలు రచ్చకెక్కుతున్నారు. ఈ అంతర్గత పోరు ఎన్నికల్లో ఎక్కడ కొంపముంచుతుందోననే టెన్షన్ కేడర్‌లో కనిపిస్తోంది. ఉరవకొండలో అన్నదమ్ముల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. అన్న విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వాన్ని తప్పుబడుతున్న తమ్ముడు మధుసూదన్ రెడ్డి పార్టీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వేశ్వర్ రెడ్డి ఒంటెత్తు పోకడల కారణంగానే నియోజకవర్గంలో పార్టీ ఓడిపోయిందని మధు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఆగ్రహానికి గురైన అన్న తమ్ముడి ప్రసంగానికి అడ్డు తగిలారు. ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే జరిగింది. సీరియస్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నదమ్ములిద్దరినీ మందలించారు. అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని వైసీపీ రాష్ట్రకార్యదర్శిగా ఉన్న మధు విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవాలంటే ఉరవకొండలో సరైన అభ్యర్ధిని నిలబెట్టాలని సమావేశంలో తేల్చి చెప్పారు. మధు ఉరవకొండ నుంచి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం అన్నను గెలిపించుకొని రావాలని ఖరాఖండిగా చెప్పేసిందట. దాంతో కొంతకాలంగా పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా వుంటున్నారు మధు సూదన్ రెడ్డి. అయితే పార్టీలోని కొందరు నేతల అండతో అప్పుడ‌ప్పుడూ అన్న‌పై కాలు దువ్వేందుకు యత్నిస్తున్నారని తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి సాక్షిగా మధు మరోసారి రెచ్చిపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది.

2014ఎన్నికల్లో ఉరవకొండ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీచినప్పటికీ విశ్వేశ్వర్ రెడ్డి ఓడిపోయారు. అక్కడ టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ గెలుపొందారు. వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ అన్ని స్థానాలను గెలవాలనే కసితో ఉన్నారు. 2019లో ఓడిపోయినప్పటికీ ఉరవకొండ నుంచి మళ్లీ విశ్వేశ్వర్ రెడ్డినే బరిలో దింపాలని డిసైడ్ అయ్యారు. అయితే మధు తీరుతో అక్కడ పార్టీ డ్యామేజ్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో మ‌ధు వ్య‌తిరేకంగా ప‌ని చేయ‌డం వ‌ల్లే పార్టీ ఓడిపోయిందని విశ్వేశ్వర్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. అన్నపై తమ్ముడి తిరుగుబాటు ఎటుదారితీస్తుంది..? ఉరవకొండలో పార్టీ పరిస్థితులపై అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.