కొత్త అవతారంలో రాజా సింగ్ ?

By KTV Telugu On 12 December, 2022
image

రాజాసింగ్ కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారా ? తెలంగాణ బీజేపీ నేతలతో తగవు వద్దనుకుని ఢిల్లీ వెళ్లిపోవాలనుకున్నారా ? సస్పెన్షన్ ఎత్తేసే వరకు మౌనం వహించి తర్వాత అధిష్టానం దగ్గరకు వెళ్లాలనుకుంటున్నారా ? ప్రస్తుతం ఆయన తీరు ఎలా ఉంది ?

ఎమ్మెల్యే బరిలో నిలిచేందుకు రాజా సింగ్ విముఖం
రాష్ట్ర బీజేపీలో కొందరు కుట్ర చేస్తున్నారని అనుమానం
సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత క్రియాశీలమయ్యే వ్యూహం
లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్న రాజాసింగ్
చేవెళ్ల లేదా జహీరాబాద్ పై దృష్టి
జహీరాబాద్ నియోజకవర్గంపై దృష్టి
బీజేపీకి కేడర్ బలమున్న జహీరాబాద్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు లో ప్రొఫైల్ పాటిస్తున్నారు. కోర్టు పీడీ యాక్ట్ ఎత్తివేయడంతో బెయిల్ పొందిన ఆయన ఇప్పుడు దాదాపుగా మౌనం వత్రం వహిస్తున్నారు. ఇటీవల ఒక స్టేట్ మెంట్ ఇచ్చిన నోటీసు పొందినప్పటికీ అది పొరబాటున జరిగిన పనిగా రాజా సింగ్ అనుచరులు చెబుతున్నారు. మూడు నెలల పాటు ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వకూడదన్న నిబంధనను రాజా సింగ్ తూచ తప్పకుండా పాటిస్తున్నారు. ఇంటికి వచ్చిన అనుచరులను కలవడం, పెళ్లిళ్లకు, శుభకార్యాలకు వెళ్లడం తప్పితే పార్టీ కార్యక్రమాలకు ఆయన హాజరు కావడం లేదు..

రాజాసింగ్ పై పార్టీ సస్పెన్షన్ నడుస్తోంది. ఆయన వివరణ ఇచ్చిన నేపథ్యంలో సస్పెన్షన్ ఎత్తివేస్తారని భావించారు. అధిష్టానం కూడా ఇందుకు సుముఖంగా ఉందని వార్తలు వచ్చాయి. రాజాసింగ్ వ్యవహారాన్ని తొందరగా తేల్చేయాలని లేనిపక్షంలో హైదారాబాద్ లో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని అమిత్ షా స్వయంగా తెలంగాణ నేతలను ఆదేశించారు. బండి సంజయ్ కూడా అందుకు రెడీ అవుతున్న వేళ ఒక కీలక నేత తీరు కారణంగా సస్పెన్షన్ ఎత్తివేత జాప్యమవుతోందని చెబుతున్నారు. కొన్ని రోజులు ఆగాలని ఆ నేత చెప్పారట

తెలంగాణ బీజేపీలో విభేదాల కారణంగా రాష్ట్రశాఖలో తాను ఇమడలేకపోతున్నానని రాజాసింగ్ నిర్ణయానికి వచ్చారు. హైదరాబాద్ లో కొందరు వెన్నుపోటుదారులున్నారని వాళ్లు కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని రాజాసింగ్ ఆవేదన చెందుతున్నారు. తనకు రాష్ట్ర రాజకీయాలు అవసరం లేదని ఢిల్లీ వెళ్లిపోవాలని రాజాసింగ్ తీర్మానించుకున్నట్లు ఆయన హార్డ్ కోర్ అభిమానులు అంటున్నారు. ఇక ఎమ్మెల్యే పదవికి పోటీ చేయకుండా లోక్ సభకు బరిలోకి దిగాలని రాజాసింగ్ నిర్ణయించుకున్నట్లు కొత్త వాదన తెరపైకి వచ్చింది. జహీరాబాద్ లేదా చేవెళ్ళ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నారు. తన సన్నిహితుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.

కర్ణాటక సరిహద్దు నియోజకవర్గం జహీరాబాద్ అయితే గెలుపు ఖాయమని రాజా సింగ్ భావిస్తున్నారు. అక్కడ బీజేపీకి గట్టి బలముందని ఆయన నమ్మకం. అక్కడి పార్టీ కేడర్ కూడా తనకు సహకరిస్తుందని ఆయన అంటున్నారు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత రాజాసింగ్ ఢిల్లీ వెళ్లి తన వాదనను పార్టీ పెద్దలకు వినిపించే అవకాశం ఉంది. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే తను కోరుకున్న లోక్ సభా నియోజకవర్గంలో పార్టీ నేతలు, శ్రేణులను కలిసే పని ప్రారంభిస్తారు. గ్రూపు తగాదాలతో సంబంధం లేకుండా తన పని చేసుకుపోవాలని రాజాసింగ్ అనుకుంటున్నారు. అయితే అందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ అవసరం.