బీఆర్ఎస్ ఆషామాషీ కాదు – కేసీఆర్ లెక్క వేరు !

By KTV Telugu On 12 December, 2022
image

తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మారి భారత రాష్ట్ర సమితి అయింది. అయితే సీఎం కేసీఆర్ ఇదేదో ఆషామాషీగా మార్చి ఉండరు. ఆయన ప్రణాళికలు ఆయనకు ఉంటాయి. కానీ ఎక్కువ మంది ఆయనను చాలా తేలికగా తీసుకుంటున్నారు. కామెడీ చేస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు. రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్న కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అంత తేలిపోయిందా ? బీఆర్ఎస్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది ? అసలు ఇక్కడెందుకు ఇంత నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు ?

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు భారత రాష్ట్ర సమితి పెట్టారంటే అదేదో బిల్డింగ్ రెగ్యూలరైజేషన్ స్కీమ్ లా ఉందని సెటైర్లు వేసేవారు కొందరైతే బార్ అండ్ రెస్టారంట్ పార్టీ అని ఎగతాళి చేసేవాళ్లు కొందరున్నారు. బీఆర్ఎస్‌తో ఇక కేసీఆర్‌కు వీఆర్ఎస్ ఇచ్చినట్లేనని కొంత మంది జోస్యం చెబుతున్నారు. అనే వాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు కానీ కేసీఆర్ ప్రయత్నాలను మాత్రం తేలిగ్గా తీసుకోరు. తీసుకోవడం లేదు కూడా. ఎందుకంటే కేసీఆర్ హిస్టరీ అంత కామెడీగా లేదు. ఆయన మాటలు చాలా వరకూ నవ్వు తెప్పించవచ్చు కానీ ఆ మాటల మంత్రాలతోనే అనుకున్నది సాధించిన రాజకీయ నేత.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవుతుందని ఒక్కరంటే ఒక్కరూ ఊహించలేదు. అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అంటేనే నేరుగా తెలియని తరానికి ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వారిలో తెలిసేలా చేసి ఉద్యమాన్ని విస్తృత స్థాయికి తీసుకెళ్లి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వెరవేర్చారు. ఒకటికి రెండు సార్లు తాను తెచ్చిన రాష్ట్రానికి పాలకుడయ్యారు. కేసీఆర్ ఇప్పుడు తనదైన రాజకీయంతో బీజేపీని ఎదుర్కోవడానికి జాతీయ స్థాయికి వెళ్తున్నారు. అందుకోసం ఆయన తెలంగాణ ఉద్యమం తరహా సాహసం చేస్తున్నారు.

ఇప్పటి వరకూ ఆయన విజయానికి కారణం అయిన తెలంగాణ సెంటిమెంట్‌ను వదిలేస్తున్నారు. అంటే ఆయుధాలను వదిలేసి యుద్ధం చేయడానికి వెళ్తున్నారన్నమాట. తెలంగాణ సెంటిమెంట్ ఇప్పటి వరకూ ఆయనపై ఎవరెన్ని విధాలుగా దండయాత్రలు చేసినా కాచుకుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ దేశంలో రాజకీయాలు చేయడానికి తన సెంటిమెంట్‌ను వదిలేసుకుంటున్నారు. ఇది ఎంత క్లిష్టమైన నిర్ణయం అంటే తేడా వస్తే రెంటికి చెడ్డ రేవడి అవుతుంది. ఇంత కాలం సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు, రాజకీయ ఉన్నతి అంతా కరిగిపోతుంది. తానో సాధారణ నాయకుడిగా నిలబడిపోతారు. తెలంగాణ సాధించారన్న పేరు కూడా ఇవ్వడానికి అప్పుడు ఉద్యమకారులు సిద్ధపడకపోవచ్చు. అంటే సర్వం కోల్పోతారు. ఈ విషయం కేసీఆర్‌కు తెలియనిదేం కాదు.

తెలంగాణను లక్ష్యంగా పెట్టుకుని యుద్ధానికి బయలుదేరినప్పుడు కూడా అంతే. కేసీఆర్ తరచూ చెప్పినట్లు పిడికెడు మందే ఆయనతో ఉండవారు. కానీ ముందుకు సాగే కొద్దీ రాజకీయ ఆయుధాలు రెడీచేసుకున్నారు. ఇప్పుడు అంతకు మించి ఆయుధాలు రెడీ చేసుకుంటానన్నే నమ్మకం కేసీఆర్‌లో ఉండి ఉండవచ్చు. రైతుల సెంటిమెంట్, జై జవాన్- జై కిసాన్ నినాదం వంటి వాటితోనే చరిత్ర సృష్టిస్తానని ఆయన నమ్మకం కావొచ్చు. తెలంగాణలో తాను అద్భుతమైన అభివృద్ధి చేశానని ఆ అభివృద్ధిని దేశం అంతటా విస్తరిస్తానని కేసీఆర్ చెబుతున్నారు. దానికి తెలంగాణ మోడల్ అని పేరు పెట్టారు. తెలంగాణ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

దక్షిణ భారత రాజకీయాలు, ఉత్తర భారత రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకం. ఉద్యోగ పరీక్షలు రాయడానికే మనోళ్లను ఉత్తదారిలో రానివ్వరు. ఇక రాజకీయ పార్టీ పెట్టి పెత్తనం చేస్తానంటే రానిస్తారా ? చాన్సే లేదు. అలాంటి ఉత్తరాదిలో కేసీఆర్ పార్టీకి కనీసం పునాదులు వేయాలంటే చాలా కష్టపడాలి. అంత కష్టపడటానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. దక్షిణ భారత రాజకీయం మరింత భిన్నం. అక్కడ ప్రాంతీయ పార్టీలన్నీ బలంగా ఉన్నాయి. ఓ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో అడుగు పెట్టడానికి ఎవరూ అంగీకరించరు. అన్ని రాష్ట్రాలు తమ సొంత వ్యక్తిత్వాన్ని కోరుకుంటాయి. బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీ కదా అనే డౌట్ రావొచ్చు కానీ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్‌ను పొరుగు రాష్ట్రాలు, దక్షిణాది వారు జాతీయ పార్టీగా అసలు అంగీకరించరు. ఎవరో కొంత మంది ఓట్లు వేయవచ్చు కానీ ప్రభావ శీలంగా పార్టీ మారే అవకాశం ఉండదు.

కానీ కేసీఆర్ చెప్పినట్లు రాజకీయాలు కొంత మందికి క్రీడ అయితే తనకు మాత్రం టాస్క్ అని మనం కూడా అంగీకరించాలి. కేసీఆర్ చాలా అంటే చాలా కలసి రాని పరిస్థితుల్లో పార్టీని పెట్టాడనికి తాను ఈ పార్టీని టాస్క్‌గా తీసుకోవడమే కారణం అనుకోవచ్చు.  తెలంగాణ ఉద్యమం ఓ సందర్భంలో పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. కానీ ఒకే ఒక్క ఘటనతో అందిపుచ్చుకున్నారు. ఉద్యమం కేసీఆర్ చేతుల్లోకి వచ్చింది అనుకున్నది సాధించారు. నమ్మకమే ఏ విజయానికైనా పునాది. ఈ విషయంలో కేసీఆర్ సరైన నిర్ణయమే తీసుకున్నారని అనుకోవచ్చు. గెలుపా ఓటమా అన్న సంగతి పక్కన పెడితే  ఓ దిగ్గజ రాజకీయ నాయకుడిగా నిలబడిపోతారు.