ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిపై దృష్టిపెట్టింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోంది. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమనుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ప్రగతి ఫలాలు రాష్ట్రవ్యాప్తంగా అందాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఏపీలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహకమండలి రూ.23,985 కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటిలో కడప స్టీల్‌ప్లాంట్‌తో పాటు ఇంకొన్ని కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే వేలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
వైఎస్సార్ కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడింది. కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో రెండు విడతల్లో రూ.8,800 కోట్ల పెట్టుబడితో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పెట్టబోతోంది. మొదటి విడతలో జేఎస్‌డబ్ల్యూ రూ.3,300 కోట్ల పెట్టుబడి పెడ్తోంది. మొదటి దశలో ఏడాదికి మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు, రెండో విడతలో ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వెనుకబడ్డ రాయలసీమలో ఈ ప్రాజెక్ట్‌తో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతుందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో 1600 మెగావాట్ల సామర్ధ్యంతో పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు కూడా ఎస్ఐపీబీ పచ్చజెండా ఊపేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ ప్రాజెక్టులకు రూ.6,330 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వీటిద్వారా ప్రత్యక్షంగా 4వేలమందికి ఉపాధి కలుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వేయి మెగావాట్లు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ దగ్గర 600 మెగావాట్ల ప్రాజెక్ట్ ఏర్పాటవుతాయి. 2024 డిసెంబరులో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టులను నాలుగేళ్లలో పూర్తిచేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో మరో రూ.8,855 కోట్లతో నిర్మించే హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టులకు కూడా ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో ప్రత్యక్షంగా 2100 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
మరోవైపు దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఒకేసారి నాలుగుపోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. వచ్చే ఏడాది విశాఖపట్టణంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో పోర్టు ఆధారిత విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రత్యేక ప్రణాళికను సిద్ధంచేసింది. అదే సమయంలో యూఏఈ, జపాన్ తదితర దేశాల్లో రోడ్‌షోలు నిర్వహించాలనే ఆలోచనతో ఉంది ఏపీ మారిటైమ్ బోర్డు. ఆర్థికలోటు తీరాలంటే అభివృద్ధి ఒక్కటే మార్గం. అందుకే ఎవరో ఇస్తారని చూడకుండా ఏపీ ప్రభుత్వం సంకల్పబలంతో ముందుకెళ్తోంది.