సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కల చెదిరింది. కన్నీరే మిగిలింది. క్వార్టర్ ఫైనల్లో ఓటమితో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన వేళ పట్టరాని దుఖంతో మైదానం వీడాడు. కోట్లాది మంది అభిమానుల్ని కంటతడి పెట్టించాడు. ఎన్నో రికార్డులు లిఖించుకున్నా కెరీర్లో ఒక్క ప్రపంచ కప్ కూడా గెలవలేదనే ఆవేదనతో అతడు వెనుదిరిగిన తీరు ప్రతీ ఒక్కరి హృదయాలను ద్రవింపజేసింది. మొరాకోతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 1-0 తేడాతో పోర్చుగల్ ఓటిమిపాలై ఇంటిబాట పట్టింది. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన రొనాల్డో మైదానంలో చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. కన్నీళ్లను తుడుచుకొంటూ అతడు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న దృశ్యాలు ప్రతీ ఒక్కరినీ కదిలించాయి.
ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాడిగా పేరు గడించారు రొనాల్డో. పోర్చుగల్ తరఫున 195 మ్యాచ్‌లు ఆడిన క్రిస్టియానో 118 గోల్స్ చేశాడు. అయితే కెరీర్లో వరల్డ్‌కప్ సాధించాలన్న కల కలగానే మిగిలిపోయింది. 37 ఏళ్ల రొనాల్డో మరో ప్రపంచకప్ ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్లే. పొర్చుగల్ నాకౌట్ రౌండ్ మ్యాచ్‌ల్లో రొనాల్డోను జట్టు మేనేజర్ ఫెర్నాండో శాంటోస్ బెంచ్‌కే పరిమితం చేయడం వివాదాస్పదంగా మారింది. ఛాంపియన్ ఆటగాడైన రోనాల్డోను మ్యాచ్ చివరలో సబ్ స్టిట్యూట్‌గా బరిలో దింపడంతో ప్రభావం చూపలేకపోయాడు. కోచ్ మతిలేని నిర్ణయం కారణంగానే పోర్చుగల్ ఓడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వరల్డ్ కప్‌నుంచి నిష్క్రమించినప్పటికీ రోనాల్డో ఆటతీరును మెచ్చుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఆటలో మీరు సాధించిన ఘనతను, అభిమానులకు అందించిన స్ఫూర్తిని ఏ ట్రోఫీగానీ లేదా టైటిల్‌గానీ దూరం చేయలేదంటూ కింగ్ కోహ్లీ సందేశం పంపాడు. క్రిస్టియానో రోనాల్డోకు వీడ్కోలు పలుకుతూ పిఫా ట్విటర్లో థాంక్యూ చెప్పింది. ఓటమి భారంతో ఉన్న ఈ ఫుట్ బాల్ దిగ్గజం రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.