పోకిరి విలన్ కు బీఆర్ఎస్ కీలక పదవి

By KTV Telugu On 13 December, 2022
image

విలన్ గా, కొన్ని సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ నటుడిగా ప్రకాశ్ రాజ్ అందరికీ తెలుసు. పోకిరిలో ఆయన విలనీయం చిరస్థాయిగా నిలిచిపోతుంది. చిన్నతనంలో అభ్యుదయ భావాలతో పెరిగిన ప్రకాశ్ రాజ్.. వ్యవస్థలను ప్రశ్నించే భావజాలం ఉన్న వ్యక్తి. ప్రకాశ్ రాజ్ కు మోదీ అంటే గిట్టదు. మోదీ విధానాలను బహిరంగంగా విమర్శిస్తుంటారు. గౌరీ లంకేష్ దారుణ హత్య తర్వాత ప్రభుత్వాల తీరుపై ప్రకాశ్ రాజ్ విరుచుకుపడిన సంగతి అందరికీ గుర్తే ఉంటుంది. జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ టాగ్ తో ఆయన అనేక ప్రశ్నలు సంధించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవకర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. కేవలం 28 వేల ఓట్లు సాధించారు. అయినా తన రాజకీయ ఆలోచనలను మాత్రం కొనసాగించారు. బీజేపీ తీరును ప్రశ్నిస్తూనే ఉన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రకాశ్ రాజ్ అంటే అభిమానం. తరచూ ఆయన్ను తన కార్యక్రమాలకు ఆహ్వానిస్తుంటారు. ఒక దశలో ప్రకాశ్ రాజ్ కు టీఆర్ఎస్ రాజ్యసభ సీటు ఇస్తారన్న చర్చ జరిగింది. అది ఎందుకో ఆగిపోయింది. కేసీఆర్ మళ్లీ ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ను తన వద్దకు పిలిపించుకుంటున్నారు. డిసెంబరు 9న టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా మారిపోయిన నేపధ్యంలో 14న ఢిల్లీలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి ఆహ్వానాలు అందిన ప్రముఖుల్లో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు. ప్రకాశ్ రాజ్ ను ఆహ్వానించడం వెనుక దీర్ఘకాలిక ప్రణాళిక కూడా ఉందని భావిస్తున్నారు.

బీఆర్ఎస్ ను అమిత వేగంగా దేశమంతా విస్తరించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అందులో ప్రకాశ్ రాజ్ భూమికను ఆయన డిసైడ్ చేయబోతున్నారు. ప్రకాశ్‌రాజ్‌ను కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఏదో ఒక రాష్ట్రానికి ప్రతినిధిగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కర్ణాటక రాష్ట్రానికే ప్రకాశ్ రాజ్ ను పంపే వీలుందని చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లీఎన్నికల్లో జేడీఎస్ ను గెలిపించి కుమారస్వామిని మళ్లీ సీఎం చేయాలన్నది కేసీఆర్ కలగా చెబుతున్నారు. అందుకు ప్రకాశ్ రాజ్ సేవలను వినియోగించుకోవాలని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ కర్ణాటక ఇంఛార్జ్ గా ప్రకాశ్ రాజ్ ను నియమిస్తే హైదరాబాద్ -బెంగళూరు మధ్య సమన్వయం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

పార్టీ కోసం క్రియాశీలంగా పనిచేయబోతున్న ప్రకాశ్ రాజ్ కు సముచిత స్థానం ఇచ్చి గౌరవించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈసారి జరగబోయే ద్వైవార్షిక ఎన్నికల్లో ఆయన్ను రాజ్యసభకు పంపే ఛాన్సుంది. దానితో పాటు కర్ణాటక యూనిట్ నిర్వహణకు అవసరమైన నిధులు మొత్తం కేసీఆర్ సమకూరుస్తారు. మరి గులాబీ దళపతి విశ్వాసాన్ని ప్రకాశ్ రాజ్ ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి.