వరంగల్ రైతు సంఘర్షణ సభ సక్సెస్ కావడంతో తెలంగాణ కాంగ్రెస్ ఫుల్ జోష్ మీదుంది. సభకు ప్రజాభిమానం పెల్లుబికిన నేపథ్యంలో వరంగల్ సభ ఇచ్చిన కొత్త ఊపిరితో తక్షణమే జనంలోకి వెళ్లాలని వ్యూహరచన చేస్తోంది. ఉదయ్ పూర్ చింతన్ శివిర్ లో అధిష్టానం చేసే దిశానిర్దేశం ఆధారంగా కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి టీమ్ భావిస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు చేయబోయే మేలును వివరిస్తూ విడుదల చేసిన వరంగల్ డిక్లరేషన్ పేద రైతులను బాగానే ఆకట్టుకుంది. దానితో తమ విజయవకాశాలను పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంది. వరంగల్ రైతు
డిక్లరేషన్ ను ప్రతీ పల్లెకు తీసుకు వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించుకుంది. డిక్లరేషన్ లోని అంశాలను ప్రతీ రైతుకు వివరించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అందులో భాగంగా పల్లెపల్లెకు కాంగ్రెస్ పేరుతో నెలరోజుల పాటు క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో పర్యటిస్తూ వరంగల్ డిక్లరేషన్ ప్రదర్శనతో వినూత్న ప్రచారం చేస్తారు..
తెలంగాణలో ఈసారి అధికారానికి రాకపోతే.. భవిష్యత్తులో పుట్టగతులుండవని రాష్ట్ర నేతలకు బాగానే అర్థమైంది. తెలంగాణ ఇచ్చి కూడా పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్న బాధ, ఆందోళన కాంగ్రెస్ లో రోజురోజుకు పెరిగిపోతోంది. దానితో రాష్ట్రంలో పూర్వవైభవం సాధించేందుకు ఇప్పటి నుంచే వ్యూహ త్మకంగ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఇక వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభతో ఏడాది ముందే ఎన్నికల శంఖారావం పూరించారు. టీఆర్ఎస్ పాలనలో అసంతృప్తి గా ఉన్న వర్గాలను ఆకర్షించేలా హామీల వర్షం కురిపించారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ కు అండగా నిలిచిన రైతులను తమ వైపుకు ఆకర్షించేలా తొమ్మిది అంశాలతో రైతు డిక్లరేషన్ ప్రకటించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణమాఫీ ఫెయిల్ అయిందన్న ఆరోపణలున్నాయి. రుణమాఫీ ప్రయోజనం కూడా అందరూ రైతులు పొందడం లేదని చెబుతున్నారు. ఇక పంటలకు గిట్టుబాటు ధర లభించక ప్రతీ ఏటా రైతులు నష్టపోతున్నారు. దరలేక నష్టపోవడమే రైతుల ఆత్మ హత్యల కు ప్రధాన కారణం అని చెబుతున్నా రు. ఇక రైతు బంధు ఇస్తున్నా కౌలు రైతులకు ఆ సహాయం రావడం లేదు. ఇలాంటి సమస్యలన్నీటికి పరిష్కారం చూపేలా.. అసంతృప్తితో ఉన్న ఆ వర్గాలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించింది. వరంగల్ డిక్లరేషన్ పై చర్చ జరుగుతుండగా… రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. గాంధీభవన్ లో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు.
రైతు డిక్లరేషన్ పై ప్రజల్లో ఎంత ప్రచారం జరిగితే పార్టీకి అంత మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకు ప్రతీ ఇంట్లో డిక్లరేషన్ పై అవగహాన కల్పించేలా ప్రత్యేకంగా కమిటీలు వేసి నేతలకు భాద్యతలు అప్పగించే ఆలోచనతో ఉన్నారు. పల్లె పల్లె కు కాంగ్రేస్ పేరుతో 300 మంది పార్టీ కీలక నేతలతో ప్రతీ గ్రామంలో రైతు డిక్లరేషన్ ను చర్చకు పెట్టాలని టీ కాంగ్రేస్ నేతలు నిర్ణయానికి వచ్చారు. ఒక్కో నేతకు కనీసం 30 గ్రామాలలో ప్రచారం చేసే బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. గ్రామాలలో రచ్చ బండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వరంగల్ రైతు డిక్లరేషన్ పై విస్తృత ప్రచారం చేయాలని టీ కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు.