భారత రాష్ట్ర సమితి. బీఆర్ఎస్ ను లాంఛనంగా ప్రారంభించిన తర్వాత కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో విస్తరణపై దృష్టి పెడుతున్నారు. తన అనుచరులు, నమ్మకస్తులుగా భావించిన వారికి వేర్వేరు రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తారు. ఈ దిశగానే ఏపీలో బీఆర్ఎస్ ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే చర్చ పార్టీ వర్గాల్లో నెలకొంది. ప్రయత్నించే అక్కడ విస్తరించే ఛాన్సుందని కేసీఆర్ సహా కొందరి విశ్వాసం.
కేసీఆర్ వేర్పాటువాద ఉద్యమంతోనే ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కష్టాలతో అధోగతి పాలైంది. హైదరాబాద్ రాజధానిగా పొందిన తెలంగాణ దుసుకుపోతుంటే, తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా ఉంటే ఏపీ పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. పంటలు లేవు, పరిశ్రమలు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, రాజధాని లేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. వీటన్నింటికీ మూలం కేసీఆర్ తెలంగాణ ఉద్యమమేనని ఏపీ రాజకీయ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అయినా సరే ఏపీలో తమకు అడ్వాంటేజ్ ఉంటుందని కేసీఆర్ విశ్వసిస్తున్నారు.
ఏపీ ప్రజల కష్టాలే తమకు శ్రీరామరక్ష అని అవే తమను రాజకీయంగా ముందుకు తీసుకెళ్తాయని కేసీఆర్ విశ్వాసం. అక్కడి ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై విసిగిపోయారు. అలాగని ప్రస్తుతమున్న విపక్షాలను విశ్వసించే అవకాశమూ లేదు. టీడీపీ, జనసేన, బీజేపీలో ఎవరిని నమ్మాలో, ఎవరికి ఓటెయ్యాలో తెలియక ఏపీ జనం అయోమయ స్థితిలో ఉన్నారు. చంద్రబాబు సభలకు భారీగా జనం వచ్చినంత మాత్రాన వాళ్లంతా ఓటేస్తారని చెప్పలేం. మళ్లీ జగన్ కు ఓటెయ్యాల్సిన అనివార్యత వస్తుందా అని జనం భయపడుతున్నారు. సరిగ్గా ఏపీలో రాజకీయ శూన్యత ఏర్పడుతున్న తరుణంలోనే బీఆర్ఎస్ శాఖను అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడకు వెళ్లి కార్యాలయ ఏర్పాట్లు చూస్తారు. ఒక కార్యాలయం అద్దెకు తీసుకుని, ముహుర్తం ఖరారైన తర్వాత కేసీఆర్ స్వయంగా వెళ్లి లాంఛనంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ఏపీలో అడుగు పెట్టడం కూడా ఇదీ మొదటిసారి కాదు. అమరావతికి శంకుస్థాపనా కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆయన హాజరయ్యారు. ఒకటి రెండు సార్లు దుర్గగుడికి వెళ్లివచ్చారు. ఈ సారి మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయాల కోసం కేసీఆర్ వెళ్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఏపీలో కూడా అడుగు పెడుతుందని తెలిసిన తర్వాత అధికార వైసీపీ తీరు మారిపోయింది. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చన్నట్లుగా సకల శాఖామంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. కేసీఆర్ అడిగితే మద్దతిచ్చే విషయం వైసీపీ అధినేత జగన్ పరిశీలిస్తారని చెప్పారు. అయినా తమకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదని చెప్పుకొచ్చారు. దీనితో తన వ్యాఖ్యలను ఆయనే ఖండించినట్లయ్యింది. గాలికిపోయే పేలపిండికి కృష్ణార్పణం అన్నట్లుగా వేసీపీ తీరు ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ ఐడియా మాత్రం ఒక్కటే. ఏపీలో మెజార్టీ వర్గం ఇంకా తనను వ్యతిరేకిస్తూనే ఉందని ఆయన గుర్తించారు. అయినా కొందరు మాత్రం తెలంగాణ అభివృద్ధిని చూసి అదీ టీఆర్ఎస్ ప్రభుత్వ గొప్పదనమేనని నమ్ముతున్నారని ఆయనకు తెలుసు. అలాంటి వారిలో కొందరు తనకు అనుకూలంగా ఫ్లెక్సీలు వేస్తున్నారని ఆయన గ్రహించారు. వారిని ఆకట్టుకోగలిగితే ప్రయోజనం ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు. కేసీఆర్ కు ఆంధ్రలో అధికారం అవసరం లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీఆర్ఎస్ కు జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు పొందాలి. ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటిగా ఉండే అవకాశాలు వెదుక్కోవడమే ఆయన ఐడియా. ఉత్తర ప్రదేశ్, బిహార్లో అదృష్టాన్ని పరీక్షించుకునే కంటే ఏపీలో ఆరు శాతం ఓటర్లను టార్గెట్ గా చేసుకుని వారికి గాలం వేయడం సులభమని భావిస్తున్నారు. ఒక్క సారి ఏపీలో ఆరు శాతం ఓట్లు దాటి బీఆర్ఎస్ కు జాతీయ హోదా వస్తే తర్వాత క్రమంగా అక్కడే పార్టీని అభివృద్ధి చేసుకునే అవకాశాలు పరిశీలించే వీలుంటుందన్నది దీర్ఘకాలిక ప్రణాళిక. నిజంగా కేసీఆర్ గేమ్ ప్లాన్ అమోఘం.