ఆదిలోనే హంసపాదు అన్నట్లయింది. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు సీఎం కేసీఆర్‌కు షాక్ ఇచ్చారు ఢిల్లీ మున్సిపల్ అధికారులు. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలనుకుంటున్న కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో సిద్ధమైన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయానికి రేపు ప్రారంభోత్సవం చేయనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా హస్తనకు చేరుకున్నారు. ఈరోజు, రేపు పార్టీ కార్యాలయంలో రాజశ్యామల నవచండీ యాగం నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యాలయం ముందర బీఆర్ఎస్ నాయకులు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలపై ముద్రించారు. ఈ ఫ్లెక్సీలను న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు తొలగించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని అందుకే వాటిని తొలగించామని అధికారులు వెల్లడించారు. రాజశ్యామల యాగం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఫ్లెక్సీలో అధికారులు తొలగించడం చూసి బీఆర్ఎస్ నాయకులు షాక్ అయ్యారు. అంతే మరి తెలంగాణలో అధికారం వారిది కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని వేరే రాష్ట్రానికి వెళ్లి ఓవరాక్షన్ చేస్తే ఇలాగే జరుగుతుంది అనంటున్నారు బీజేపీ నాయకులు.