రూట్‌మార్చిన బీజేపీ..హస్తంపార్టీపై ఆపరేషన్

By KTV Telugu On 13 December, 2022
image

మునుగోడులో టీఆర్ఎస్ విజయం తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. సీఎం కేసీఆర్ తమ నేతలపై గట్టి నిఘా పెట్టడంతో బీజేపీలోకి వలసలు ఆగిపోయాయి. అసంతృప్తవాదులంతా గప్ చుప్ అయిపోయారు. దీంతో బీజేపీ రూట్ మార్చింది. కాంగ్రెస్ నేతలపై ఆపరేషన్ మొదలుపెడుతోంది. ఇప్పటికే సీనియర్ నేత అయిన మర్రి శశిధర్ రెడ్డి హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. అదే బాటలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ లో కొత్త కమిటీల నియామకం అగ్గిరాజేసింది. కొండా సురేఖ ఏకంగా తనకు ఇచ్చిన పదవిని తిరస్కరిస్తూ రాజీనామా చేసారు. అటు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అధిష్టానంపై గుస్సా అవుతున్నారు. తమ లాంటి లయలిస్టులను పక్కనబెట్టి, గాంధీభవన్ మెట్లు ఎక్కని వారికి పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భట్టి కూడా తనకు తెలియకుండానే డెసిషన్‌లు తీసుకున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌లో అర్గత కుమ్ములాటాలు పార్టీని ఒంటి చేతితో నడిపించే నేతలు లేకపోవడంతో చాలా మంది నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. గ్రౌండ్ లెవల్ లో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ పై స్థాయిలో నేతల్లో సఖ్యత లేకపోవడం ఆ పార్టీని ఇబ్బంది పెడుతుంది. పదవులు రాలేదని కొందరు, తమను పట్టించుకోవడం లేదని కొందరు పీసీసీ చీఫ్ రేవంత్ తీరుపై బహిరంగంగానే నిప్పులు చెరుగుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగుతోంది. కాంగ్రెస్‌లో కల్లోలాన్ని తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అలకబూనిన నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు టచ్‌లోకి వెళ్తోంది. హైదరాబాద్ కు చెందిన కాంగ్రెస్ కీలక నేత ఒకరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా రేవంత్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరడుగట్టిన తమ లాంటి కాంగ్రెస్ వాదులకు పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని ఫైర్ అవుతున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కమల దళంలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. విష్ణువర్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ లో బలం పెరుగుతుందని బీజేపీ అంచనా వేస్తుంది. అయితే విష్ణు మాత్రం పార్టీ మారే ఉద్దేశం లేదని చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం పీజేఆర్ కుమార్తె విజయ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆమె వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో కొంత మంది ఎమ్మెల్యేలు, నేతలు అసంతృప్తిగా ఉన్నా వారిపై నిఘా ఉండడంతో బీజేపీ టచ్ చేయలేకపోతోంది. ఎన్నికల నాటికి గులాబీ పార్టీ నుంచి వీలైనంత మందిని లాగాలనే భావనతో ఉన్నట్లు తెలుస్తోంది.