తగ్గేదేలే అంటోన్న లేడీ లీడర్స్

By KTV Telugu On 13 December, 2022
image

తెలంగాణలో ఆ లేడీ పొలిటికల్ లీడర్స్ ఫుల్ స్ట్రాంగ్ అవుతున్నారు. ఆ ఇద్దరి చుట్టే ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. తండ్రి వారసత్వాని పుణికిపుచ్చుకున్న ఆ మహిళలు ఇద్దరూ తగ్గేదేలే అంటున్నారు. ఎవరి పోరాటం వారిదే. కానీ ఇద్దరి పంథా ఒకటే. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. అరెస్ట్‌లకు, బెదిరింపులకు తలొగ్గేది లేదని తేల్చిచెబుతున్నారు. వారెవరో కాదు ఒకరు దివంగత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అయితే మరొకరు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత . కేంద్రంపై పోరాటంలో వెనక్కు తగ్గేది లేదని కేసీఆర్ బిడ్డ కవిత చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంలో తాను వెనకడుగు వేయనని వైయస్ షర్మిల తేల్చి చెబుతున్నారు.

లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కవిత బీజేపీతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ముందుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న తమను మోడీ ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తుందని భయపడే ప్రసక్తే లేదని కవిత అంటున్నారు. సీబీఐ, ఈడీ దాడులు తమనేమీ చేయలేవన్నారు. అరెస్ట్‌లు చేసుకుంటారా చేసుకోండి, జైలుకు పంపుతారా పంపుకోండి. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ బీజేపీపై తనదైన శైలిలో దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాదు కేంద్రంపై యుద్ధానికి తన జాగృతిని సిద్ధం చేస్తున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ యాస, భాష పండుగలపై వివక్షను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో తెలంగాణ జాగృతిని స్థాపించింది కవిత. బోనాలు-బతుకమ్మ ఉత్సవాల్లో జాగృతి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సైలెంట్ అయిన జాగృతి మళ్లీ యాక్టీవ్ అవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యమవుతున్న తరుణంలో దేశాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత తెలంగాణ జాగృతిపై ఉందని కవిత అన్నారు. తెలంగాణ తరహాలో దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో షర్మిల పాదయాత్రను టీఆర్ఎస్ ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నంలో ఉంది. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ పాదయాత్రకు పర్మిషన్ నిరాకరిస్తోంది. ఎక్కడికక్కడ వైఎస్సార్టీపీ నేతలపై కేసులు పెట్టి నిర్బంధకాండ కొనసాగిస్తుంది. ఈ క్రమంలో టిఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించిన వైఎస్ఆర్ బిడ్డ పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదని తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆమరణ నిరాహార దీక్షకు సైతం దిగారు. ఆరోగ్యం విషమించడంతో ఆమె దీక్ష భగ్నం అయ్యింది. షర్మిల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ ఏకంగా ప్రధాని ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తనను ఎంత తొక్కేసే ప్రయత్నం చేసినా తగ్గేది లేదని తన పోరాటాన్ని ఆపేది లేదని షర్మిల తేల్చి చెబుతున్నారు. కెసిఆర్‌పై పోరాటంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై పోరులో ఇద్దరు మహిళా నాయకురాళ్లు ఎవరికి వారు వాయిస్ రెయిజ్ చేస్తుండడంతో రాజకీయం సెగలు కక్కుతోంది.