కమింగ్‌ సూన్‌.. విశాఖ నుంచే ఇక పాలన

By KTV Telugu On 13 December, 2022
image

విశాఖపట్టణమే పాలనా రాజధాని. అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని పదేపదే చెబుతోంది వైసీపీ. అమరావతి వాదన వీగిపోయేలా పోటీ ఉద్యమాలకు మద్దతిస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సభలు, ర్యాలీలతో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు కూడగట్టుకుంటోంది. ఈమధ్య ఏపీ హైకోర్టు ఆదేశాలను తప్పుపడుతూ సుప్రీం కీలక తీర్పు ఇవ్వటంతో విశాఖరాజధాని విషయంలో వైసీపీ ఫుల్‌ జోష్‌లో ఉంది. ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అయితే రేపోమాపో అంటూ అందరినీ తెగ ఊరించేస్తున్నారు.

కొత్త రాజధానిలో కార్యకలాపాలంటే రాత్రికి రాత్రి సామాను సర్దేసుకుని ఇల్లు మారినంత ఈజీ కాదు. ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలి. ఆరేడు నెలలనుంచీ విశాఖనుంచే ఇక పాలన అన్న మాట ప్రభుత్వ పెద్దలనుంచి వస్తున్నా ఓ ముహూర్తం మాత్రం పెట్టుకోలేదు. కానీ రెండేళ్లుగా అదిగో ఇదిగో అంటూనే ఉన్నారు. అందుకే మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తాజా ప్రకటనకు పెద్దగా స్పందనేమీ లేదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విశాఖనుంచే ఏపీ ప్రభుత్వ పాలన సాగుతుందంటున్నారు మంత్రివర్యులు. అంటే నాలుగునెలలేనన్నమాట. కానీ 2019నుంచి మాటలు తప్ప అది కార్యరూపం దాల్చింది లేదు. అందుకే మంత్రి మాటమీద ఎవరికీ నమ్మకం కుదరడం లేదు. అమరావతి ఏకైక రాజధాని అంటూ ఏపీ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది.

దాన్ని సుప్రీం తప్పుపట్టినా అత్యున్నత న్యాయస్థానంలో రాజధాని కేసు ప్రస్తుతం ఇంకా విచారణ దశలోనే ఉంది. 2023 జనవరి 31కి ఈ విచారణ జరగనుంది. కేసు పూర్వపరాలన్నీ సమగ్రంగా వింటామంటోంది సుప్రీం. దీంతో ఆ విచారణ ఎప్పటికి కొలిక్కి వస్తుందో చెప్పలేం. ఈలోపే విశాఖకు రాజధాని సాధ్యమేనా అన్నదే ప్రశ్న. ప్రభుత్వం సీరియస్‌గానే ఉందికానీ పరిస్థితులు అనుకూలించాలి కదా? జీ 20 సదస్సుకు విశాఖ వేదికవుతోంది. విశాఖపట్టణంలో 2023 మార్చిలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. కీలక వేదికలతో విశాఖకు సర్కారు మరింత హైప్‌ ఇస్తున్నా నెక్ట్స్‌ అకడమిక్‌ ఇయర్‌ అన్న మంత్రి గుడివాడ మాటలు మాత్రం నమ్మబుద్ధిగా లేవు!