గిదేంది “బండి” భాయ్ ! ప్లీజ్.. ప్లీజ్ అంటే చాన్సిచ్చేస్తారా ?

By KTV Telugu On 16 May, 2022
image

దమ్ముంటే రండి పిసికేస్తాం.. నలిపేస్తాం అని భీకర వార్నింగ్‌లు ఇచ్చేసి.. చివరికి .. ప్లీజ్ .. ప్లీజ్.. ప్లీజ్ ఒక్క చాన్సివ్వండి అని బతిమాలుకుంటే ఎం బావుంటుంది? చెప్పడానికే చాలా తేడాగా ఉంది, కానీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మాత్రం అలా అనిపించలేదు. స్వయంగా అమిత్ షా స్టేజీ మీద ఉన్న సమయంలోనే చాలా భీకరమైన డైలాగుల్ని కొట్టి ప్లీజ్ .. ప్లీజ్ .. ప్లీజ్ అంటూ ఒక్క చాన్స్ కోసం బతిమాలుకోవడంతో సభ మొత్తం
ఒక్క సారిగా ఘొల్లుమనే పరిస్థితి వచ్చింది.

బండి సంజయ్‌లో అమిత్ షా చూసింది ఈ “ప్లీజ్ “వీరత్వాన్నేనా !?

కేసీఆర్‌ను ఓడించడానికి అమిత్ షా రానక్కర లేదు.. బండి సంజయ్ చాలు అంటూ తుక్కుగూడ సభలో అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. అదే సభలో బండి సంజయ్ బతిమాలుకుంటూ ప్రజలకు కనిపించారు. దీంతో అమిత్ షా పెట్టుకున్న నమ్మకం అంతా ఈ బతిమాలుడు మీదేనా అన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో బలపడిపోయింది. ఒక్క చాన్స్ ఇవ్వాలని బతిమాలుకుంటే జనం ఇవ్వరు. ఎవరో అలా అడిగితే చాన్సిచ్చారని తాము కూడా అలా చేస్తే ఎలా ? అవతల వారు సానుభూతి కోసం ఎన్నెన్ని ప్రయత్నాలు చేశారో తెలుసుకోకపోతే ఎలా ? ఇలా బతిమాలుకోవడం వల్ల మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడింది. పైగా బండి సంజయ్ ఇచ్చిన పెట్రోల్ రేట్ తగ్గిస్తాం.. అందరికీ ఇళ్లు ఇస్తాం లాంటి హామీలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.

బండి సంజయ్ ఇమేజ్ అంతా ఖల్లాసే !

నిజానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడుగా బండి సంజయ్ పదవి చేపట్టినుండి పరిస్థితులు ఆయనకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. తనపైన ప్రకటనలతో బండి సంజయ్ పాపులారిటీ పెంచుకున్నారు. పాదయాత్రతో మరింతగా ప్రజల్లోకి వెళ్లారు. ఈ కారణంగా బండి సంజయ్ శ్రమ అమిత్ షా దృష్టిలో పడిందని ప్రచారం జరిగింది. బండి సంజయ్ ప్రాబల్యం తెలంగాణ బీజేపీలో పెరిగిందని అనుకున్నారు. నిజానికి బండి సంజయ్‌కు వ్యతిరేక వర్గం బలంగానే ఉంది. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా పలువురు సీనియర్ నేతలు బండి సంజయ్ ఇంత వేగంగా దూసుకు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు వారికి బండి సంజయ్‌ది మొత్తం వీరత్వం కాదని.. బతిమాలుకోవడం అని.. ఇలా చేయడం వల్ల ఓట్లు రావని బండిని వెనక్కి తోసే అవకాశం ఉంది.

ఆ హామీలు నెరవేర్చేవేనా ?

అధికారం కోసం అన్నీ ఫ్రీ అని ఆవేశంగా బండి సంజయ్ ప్రకటిస్తున్నారు. కనీస ఆలోచన కూడా చేయడం లేదు. ప్రజలు ఎలా నమ్ముతారన్న విశ్లేషణ కూడా చేసుకోవడం లేదు. ఇళ్లిస్తాం.. పెట్రోల్ ధరలు తగ్గిస్తాం …నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామంటూ కబుర్లు చెబితే ప్రజలు నమ్మేస్తారా ? ఓ కార్యచరణ ఉండక్కర్లేదా ? అలాంటిదేమీ లేకుండా నోటి మాట ద్వారా ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ అంటే ప్రజలు పరుగెత్తుకుంటూ వచ్చి ఓట్లు వేస్తారు. బండి సంజయ్‌లో ఆశ తప్ప… దాన్ని ఎలా సాధించాలన్న లక్ష్యం పై మాత్రం స్పష్టత లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

పార్టీలో ఇప్పటికే ఒంటరి !

తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ ఒంటరి. ఆయనకు ఎమ్మెల్యేలతో కానీ తోటి ఎంపీలతో కానీ సరి పడదు. తెలంగాణ బీజేపీ పార్టీ సీనియర్లు ఎవరూ ఆయన పాదయాత్రకు మనస్ఫూర్తిగా సహకారం అందించలేదు. ఆయనపై సీనియర్లు అసంతృప్తిలో ఉన్నారు. తమ ప్రాధాన్యతను తగ్గించి కేవలం బండి సంజయ్ మాత్రమే తెర ముందు ఉండాలనుకుంటున్నారని వారు కినుకతో ఉన్నారు. రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌తో ఆయనకు సరిపడటం లేదు. తోటి ఎంపీలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అయినా … ప్లీజ్ .. ప్లీజ్ అని అధికారం దక్కించుకుంటామని బండి సంజయ్ ఆశపడుతున్నట్లుగా కనిపిస్తోంది.