బడాబాబులకు రూ. 10 లక్షల కోట్ల రుణ మాఫీ

By KTV Telugu On 14 December, 2022
image

బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకుని ఆ డబ్బులను తిరిగి రుణాలు ఇచ్చి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి. అలా లాభాలు గడిస్తాయి. మరి రుణాలు తీసుకున్న వారు ఎగ్గొడితే ఆ సొమ్ము ఎవరిదవుతుంది ? ఖచ్చితంగా ప్రజలదే. ఈ ప్రజల సొమ్మును బ్యాంకురు పది లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసేశాయి. ఇదేదో రైతుల రుణమాఫీ పథకం కిందో మరొకటో కాదు. కేవలం బడా బాబులు వేల కోట్లు అప్పులు తీసుకుని కట్టకుండా ఎగ్గొట్టిన రుణాలు. ఎమీ చేయలేక మాఫీ చేస్తున్నాయి. అలా ఐదేళ్లలో మాఫీ చేసిన రుణాల మొత్తం పది లక్షల కోట్లు దాటిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా లెక్కలు చెప్పారు.

2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ దేశంలోని బ్యాంకులు 14.38 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలను రైటాఫ్‌ చేశాయి. ఇందులో దాదాపు 70 శాతం రైటాఫ్‌లు ప్రభుత్వరంగ బ్యాంకులు చేసినవే. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మొండి బకాయిలను కేటాయింపులు జరిపిన నిరర్థక రుణాలను నాలుగేండ్ల తర్వాత బ్యాంకులు వాటి ఖాతాపుస్తకాల్లోంచి రైటాఫ్‌ చేస్తాయి. ఈ మొండి బకాయిలే భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద గుదిబండగా మారాయి. మొండి బాకీలు అంటే నాన్ పెర్మార్మింగ్ అసెట్స్. నిరర్థక ఆస్తులు. వసూలు కావని బ్యాంకులు లెక్కలేసుకున్నవి. ఇలా మొండి బాకీల లెక్కల్లో బ్యాంకులు రాసుకున్న వాటిల్లో కనీసం పది శాతం కూడా వసూలు కావని బ్యాంకుల రికార్డులు చెబుతున్నాయి. 10 లక్షల కోట్ల మొండిబాకీలు అంటే బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో 12 శాతం పైనే. అంటే బ్యాంకులు అప్పు ఇచ్చే ప్రతి వంద రూపాయాల్లో 12 రూపాయలు తిరిగి రావడం లేదు. నిజానికి కేంద్రం ప్రకటించిన దాని కన్నా ఎక్కువ రుణాలు రైటాఫ్ చేసి ఉంటారని అయితే బ్యాంకులు తమ లాభాలతో వాటిని సరిచేయడంతో తక్కువ మొత్తం కనిపిస్తోందన్న వాదన మొదటి నుంచి ఉంది.

రైతులు, పేదవారు, మధ్యతరగతి జీవులు ఎవరైనా రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాయి. ఆస్తులను వేలం వేసేస్తాయి. కానీ లక్షల కోట్ల అప్పులు తీసుకున్న పెద్దల విషయంలో మాత్రం ఈ కఠినత్వం చూపించవు. పెద్దలు తీసుకున్న అప్పులు చెల్లించకపోతే ముందుగా వాటికి నిరర్థక ఆస్తి అని పేరు పెడతారు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఆస్తులు వేలం వేస్తారు. కానీ ఆ పెద్దల ఆస్తులు మొత్తం వేలం వేయరు. ఎందుకంటే రుణాలు తీసుకున్న వారు ఆస్తులను ఇతరుల పేర్లపైకి మార్చుకోవడం విదేశాలకు తరలించుకోవడం చేస్తారు. ఇంకా తప్పించుకు పోవాలంటే మాల్యా, నిరవ్ మోదీలాగా విదేశాలకు పారిపోతారు. ఒక వేళ దేశంలోనే పెద్ద మనిషిగా చెలామణి అవ్వాలనుకున్నా అనేక మార్గాలున్నాయి. రైతులు రుణాలు తీసుకుని చెల్లించలేకపోతే రుణాలు రీషెడ్యూల్ చేయరు. ఇలా చేస్తూ పోతే బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోతుందని చెబుతూ ఉంటారు. కానీ పెద్దలు కార్పొరేట్ సంస్థలు రుణాలు చెల్లించకపోతే రీ షెడ్యూల్ చేస్తారు. దీనికి కార్పొరేట్ డెట్ రీ స్ట్రక్చరింగ్ అని పేరు పెట్టుకున్నారు. యూపీఏ ప్రభుత్వ దేశ వ్యాప్తంగా రైతుల రుణాలు మాఫీ చేయడం వల్ల బ్యాంకులపై పడిన భారం.. రూ. 72వేల కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు బ్యాంకుల మొండి బకాయిలు లక్షల కోట్లలో ఉంటున్నాయి. అదే ఆందోళనకరం.

బ్యాంకులకు పేరుకు పోతున్న మొండి బకాయిలన్నింటినీ కేంద్రం ఇవ్వదు. అవన్నీ సామాన్యల డిపాజిట్లే. సామాన్యులు రూపాయి రూపాయి బ్యాంకుల్లో దాచుకుంటే ఆ సొమ్మును బ్యాంకులు కార్పొరేట్లకు రుణాలుగా ఇస్తున్నాయి. ఇప్పుడు రైటాఫ్ చేసిన 10 లక్షల కోట్లు కార్పొరేట్లే తీసుకున్నాయి. బ్యాంకులకు ఉన్న మొండి బాకీల్లో 89 శాతం 5కోట్లకు మించిన రుణాలేనని రికార్డులు చెబుతున్నాయి. బ్యాంకులకు ఉన్న మొండి బాకీల్లో 25 శాతం 12 పెద్ద కార్పొరేట్ సంస్థల వద్దే ఉన్నాయి. ఈ పన్నెండు కంపెనీల దగ్గరగా గట్టిగా వసూలు చేసే ప్రయత్నం చేయరు. అయినప్పటికీ కార్పొరేట్లకు డబ్బులుండి కూడా కట్టని వాళ్లకే మళ్లీ మళ్లీ ఇస్తున్నారు. రుణాలు తీసుకుని దారి మళ్లించి వాటిని మొండి బకాయిల ఖాతాలో చేర్చేస్తున్నారు. వీరిని ఎవరూ పట్టించుకోరు. ఇలా డబ్బులు ఎగ్గొట్టిన పెద్ద మనుషుల పేర్లను ఎప్పుడూ బ్యాంకులు ప్రకటించలేదు. ప్రకటించవు కూడా.  సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రకటించలేదు.

బ్యాంకులలో డిపాజిట్లు భద్రంగా ఉన్నాయి కదా బ్యాంకులు ఎవరికి ఎంత ఇచ్చినా తమ సొమ్ము కాదని జనం అనుకుంటూ ఉంటారు. కానీ ఆ చార్జీలు ఈ చార్జీలు పేరుతో బ్యాంకులు బాదేసేది ఇలాంటి రుణాలను కవర్ చేసుకోవడానికే. ఏటీఎంలో డబ్బులు వేసినా తీసినా చార్జీలు వేసేది ఇందుకే. ఇంతా చేసినా బ్యాంకులు మునిగిపోతే పైసా కూడా వెనక్కి రాదు. అప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం దయతలిచి ఇచ్చే దాంతోనే సరి పెట్టుకోవాలి. అంటే తప్పు ఎవరో చేస్తారు భారం మాత్రం ప్రజలదన్నమాట.