ఎన్నికలకు రెడీ ! కేసీఆర్‌కు అమిత్ షా బంపర్ ఆఫర్ !

By KTV Telugu On 16 May, 2022
image

ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని అమిత్ షా కేసీఆర్‌కు సవాల్ చేశారు. ఇలా చేయడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. తాను అసెంబ్లీని రద్దు చేస్తే కేంద్రం ఎన్నికలు పెడుతుందా.. రాష్ట్రపతి పాలన పెడుతుందా అన్న డౌట్ ఉంది. ఎందుకంటే కేంద్రంతో టీఆర్ఎస్ హోరాహోరీ తలపడుతున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందుకే ఆ డౌట్… కానీ అమిత్ షా మాత్రం ఎన్నికలకు సిద్ధమని నేరుగానే ప్రకటించారు. తాము రాష్ట్రపతి పాలన లాంటివి ఏమీ పెట్టబోమని.. ఎన్నికలకు సిద్ధమన్న సంకేతాలను అమిత్ షా, కేసీఆర్‌కు ఇచ్చారని చెప్పుకోవచ్చు.

ముందస్తు ఆలోచనల్లోనే కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని రాజకీయవర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే ఆయన జిల్లాల పర్యటనలు… శంకుస్థాపనలు చేస్తున్నారని విశ్లేషిస్తున్నయి. అదే సమయంలో బీజేపీని గురి పెట్టి రాజకీయాలు చేయాలనకుంటున్నారు, కాబట్టి జాతీయ అంశాలు టేకప్ చేస్తున్నారంటున్నారు. 2023లో ద్వితీయార్థంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. గట్టిగా ఏడాదిన్నర మాత్రమే ఉంది. కానీ మరోసారి ముందస్తుకు వెళ్లి … విపక్షాలు బలపడకముందే.. మరో ఐదేళ్లు టర్మ్ పెంచుకుంటే… ఆ తర్వాత ఎదురు ఉండదన్న ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

బీజేపీ వ్యూహంపైనే అనుమానం !

ఇక్కడ మరో మౌలికమైన అనుమానం అందరికీ ఉంది. కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలంటే.. ఖచ్చితంగా కేంద్రం, గవర్నర్ సహకారం ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. 2018లో కేసీఆర్ ముందస్తుకు వెళ్లినప్పుడు కేంద్రంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే గవర్నర్ నరసింహన్‌తో ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసెంబ్లీని రద్దు చేసే ముందు ఢిల్లీ వెళ్లి అందరి అనుమతి తీసుకుని.. తరవాత హైదరాబాద్ వచ్చి గవర్నర్‌ను కలిసి అసెంబ్లీని రద్దు చేశారు. ఇలా గవర్నర్ ను కలిసి అలా పార్టీ ఆఫీసుకు వచ్చేలోపు అసెంబ్లీ రద్దుపై రాజపత్రం విడుదలయింది. ఆ తర్వాత వెంటనే ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఇంత సహకారం ఇప్పుడు ఉంటుందా అన్నదే అసలైన డౌట్. కేసీఆర్‌కు కేంద్రంతో సన్నిహిత సంబంధాలు లేవు. గవర్నర్‌తో కోల్డ్ వార్ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ముందస్తుకెళ్లే ఆలోచన చేస్తే.. బీజేపీ ఎలా కావాలంటే అలా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే అసెంబ్లీని రద్దు చేస్తే గవర్నర్ ఆపడానికి అవకాశం లేదు. కొద్ది రోజులు ఆపగిలినా ఆమోదించాల్సిందే. ఆ తర్వాత ఆరు నెలల్లో రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించి తీరాలి. అంతకు మించి కేంద్రం… గవర్నర్ అయినా లేటు చేయడానికి లేదు. కానీ ఈ ఆరు నెలల కోసమే కదా కేసీఆర్ ముందస్తుకెళ్లేది అని మరో వాదన. అందుకే… బీజేపీ సహకారం లేకుండా కేసీఆర్ ముందస్తుకు వెళ్లలేరని ఈ కారణంగానే ఆగుతున్నారన్న బీజేపీకి సంకేతాలు వెళ్లాయేమో కానీ అమిత్ షా క్లారిటీ ఇచ్చేశారు.

ముందస్తుకు తెలంగాణ బీజేపీ సిద్ధంగా ఉందా ?

తెలంగాణ బీజేపీ సూపర్ స్పీడ్‌గా ఉంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని బలంగా నమ్ముతున్న ఆ పార్టీ ముందుగనే అభ్యర్థుల్ని కూడా ఖరారు చేసుకుంటోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయని అమిత్ షా గతంలోనే పార్టీ నేతలకు చెప్పి పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ జాతీయ నాయకత్వం ఇప్పటికే రాష్ట్ర నేతలకు కొన్ని సూచనలు చేసింది. అభ్యర్థులను ముందుగానే ఎంపిక చేసి పెట్టుకోవాలని సూచించింది. ఆ ప్రకారం రాష్ట్ర నాయకత్వం పోటీ లేని.. యాభై సీట్లలో అభ్యర్థులకు సంకేతాలు కూడా ఇచ్చారు. మరి కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేర్లను సిద్ధం చేశారు. ఒక్కరే అభ్యర్థుల స్థానాలతోపాటు ముఖ్య నేతలు, వివిధ నియోజకవర్గాల్లో పట్టున్న నేతలు, కచ్చితంగా గెలిచే అవకాశాలున్న సీట్లలో అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనున్నట్లు టీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

జగన్‌తో పాటే కేసీఆర్ ముందస్తుకు వెళతారా !?

బీజేపీ వ్యూహంలో ఇరుక్కోకుండా కేసీఆర్ జగన్ వైపు చూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ ముందస్తుకు వెళ్తే కేసీఆర్ కూడా వెళ్లాలని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకూ కేసీఆర్ ధైర్యంగా ముందస్తుకు వెళ్తారని.. ఆయనతో పాటు జగన్ కూడా వెళ్తారని చెప్పుకుంటున్నారు. కానీ కేసీఆర్ ముందస్తుకెళ్లాలంటే కేంద్రం సహకరించాలి. బీజేపీతో లడాయి పెట్టుకున్నందువల్ల ఆ పార్టీకి సహకరించదని ఆర్కే చెబుతున్నారు. జగన్ ముందస్తుకెళ్తే.. జగన్‌తో పాటు రాజీనామా చేస్తే రెండు రాష్ట్రాల్లోనూ ఒకే సారి ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ అంచనా అంటున్నారు. ఏమైనా ముందస్తుపై తెలగాణలో భిన్నమైన చర్చ మాత్రం జరుగుతోంది.