ర్యాగింగ్‌ ఆట కట్టించేందుకు పోలీసుల అండర్‌ కవర్‌ ఆపరేషన్‌

By KTV Telugu On 14 December, 2022
image

ఉన్నత విద్యా కళాశాలల్లో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్‌ పేరుతో వేధించడం సర్వసాధారణంగా మారింది. ఒక్కోసారి ఈ ర్యాగింగ్‌ శృతిమించి కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కూడా జరిగాయి. ఈ వికృత క్రీడను నిషేధించడానికి ప్రభుత్వాలు, కాలేజీల యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా అక్కడక్కడా ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్‌ పేరుతో వేధించడం సర్వసాధారణమైపోయింది. ర్యాగింగ్‌ పేరుతో జూనియర్లతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు కూడా జరిగాయి. అయితే తమను వేధిస్తున్న సీనియన్లపై కాలేజీ యాజమాన్యానికి కానీ, పోలీసులకు కానీ ఫిర్యాదు చేస్తే తమ చదువులకు ఇబ్బంది కలుగుతుందని భయపడి ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. ఈమధ్య సీనియర్ల చేతుల్లో ర్యాగింగ్‌ పేరుతో వేధించబడిన ఒక స్టూడెండ్‌ ధైర్యం చేసి యూనివర్సిటీ గ్రాంట్స్‌కమిషన్‌ హెల్ప్‌ లైన్‌కు ఫిర్యాదు చేశారు.

అయితే తన కంప్లయింట్‌లో ర్యాగింగ్‌ చేస్తున్న తీరును వివరించారు కానీ తన పేరు, ర్యాగింగ్‌ చేసిన సీనియర్ల పేర్లు పేర్కొనలేదు. విద్యార్థుల కంప్లయింట్‌ లేకుండా ఆధారాలు లేకుండా ఎవరి మీద చర్యలు తీసుకోవాలో పోలీసులకు అర్థం కాలేదు. దాంతో అటునుంచి నరుక్కురావాలని అనుకున్నారు పోలీసులు. పోకీరీలను అన్ని ఆధారాలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్‌ వేశారు. మామూలుగా అయితే పోలీసులు కాలేజీలోకి ఎంటర్‌ అయితే వాళ్లను చూసి ఎక్కడివాళ్లు అక్కడ సర్దుకుంటారు. అలా కాకుండా తమ పని మూడో కంటికి తెలియకుండా పూర్తి చేయాలనుకున్నారు. తమ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న రింకు, షాలిని, సంజయ్‌, చౌహాన్‌ అనే నలుగురు కానిస్టేబుల్స్‌ను ఎంపిక చేశారు. 24 ఏళ్ల షాలిని స్టూడెంట్‌ అవతారం ఎత్తింది. భుజానికి బ్యాగ్‌ తగిలించుకుని కొత్తగా చేరిన వైద్య విద్యార్థిలాగా కాలేజీలోకి క్యాంపస్‌లోకి అడుగుపెట్టింది. రింకు అనే కానిస్టేబుల్‌ను నర్సు వేషంలో అదే కాలేజీకి పంపించారు అధికారులు. వారిద్దరితో పాటు సంజయ్‌, చౌహాన్‌ లను ఆ కాలేజీ క్యాంటీన్‌ లో వర్కర్లుగా సెట్‌ చేశారు. ఈ నలుగురూ కలిసి తమకు అప్పజెప్పిన పనిని రహస్యంగా చేసుకుంటూ పోయారు. ఈ నలుగురిలోనూ షాలినిదే కీలకమైన పాత్ర.

అందుకే తాను పోలీసును అన్న విషయం ఎవరికీ అనుమానం రాకుండా స్టూడెంట్స్‌తో స్నేహం చేసింది. రోజుకు 6 గంటలు కాలేజీలో, క్యాంపస్ క్యాంటీన్‌లో గడుపుతూ ర్యాగింగ్ కు సంబంధించిన వివరాల్ని సేకరించింది. విచిత్రం ఏమిటంటే షాలిని పోలీస్ అని, తమ భరతం పట్టేందుకే వచ్చిందనే విషయం తెలియక ఆమెను కూడా సీనియర్లు ర్యాగింగ్‌ చేశారు. తనకు అప్పగించిన డ్యూటీ కోసం వారి ర్యాగింగ్‌ ను కూడా భరించింది షాలిని. మూడు నెలలు ఆ కాలేజీలో జూనియర్ల పట్ల వికృత చేష్టలకు పాల్పడుతున్న 11 మంది సీనియర్లను గుర్తించి అన్ని వివరాలను ఉన్నతాధికారులకు పంపించింది. దాంతో పోలీసుల పని సులవైంది. జూనియర్లను ర్యాగింగ్‌ పేరుతో వేధిస్తున్న ఆ 11 మంది విద్యార్థులను గుర్తించి కేసు నమోదు చేశారు. వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది కాలేజీ యాజమాన్యం. ఈ విషయం వెలుగుచూడగానే షాలినా పోలీసా అని మూడు నెలలపాటు ఆమెతో కలిసి తిరిగిన జూనియర్‌ స్టూడెంట్ష్‌ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇప్పుడు ఈ యంగ్‌ లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ సోషల్ మీడియాలో హీరో అయిపోయింది. ఆమె చూపించిన తెగువను శభాష్‌ అని కొనియాడుతున్నారు నెటిజన్లు.