ప్రపంచంలో ఎవరూ బాగు చేయలేని పార్టీ ఏదైనా ఉందంటే అదీ తెలంగాణ కాంగ్రెస్. నిజానికి ఇదీ కొత్తగా వినిపిస్తున్న కామెంటేమీ కాదు. పార్టీలో అంతర్గత పోరు బయట పడినప్పుడు మాత్రం ఈ సామెత గుర్తుకొస్తోంది. పార్టీలోకి వచ్చి పోయే వాళ్లు ఎక్కువగానే ఉన్నా అధిపత్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉంటోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఐకమత్యంగా ఉండి అధికారాన్ని చేజిక్కించుకోవాల్సిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకరినొకరు కిందకు లాక్కునేందుకు తహతహలాడుతున్నారు. రెండు పర్యాయాలు విపక్షంలో ఉండి డీలా పడిపోయామన్న సంగతిని వాళ్లు మరిచిపోతున్నారు.
కాంగ్రెస్ నేతలు కొట్టుకునేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వం ఒక సాకులా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి బయట నుంచి వచ్చిన నేత అని ఆయన్ను మనమెందుకు గౌరవించాలని ఒక వర్గం ప్రచారం ప్రారంభించి దాన్ని తారా స్థాయికి తీసుకెళ్లింది. పైగా రేవంత్ ఒంతెత్తు పోకడలు పోతున్నారని కూడా చెప్పుకొచ్చింది. ఈ లోపే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ అసంతృప్తి పరులకు పరిస్థితులు అర్థం కాలేదు. ఈ లోపే మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. రెండు రోజులు హడావుడి చేసిన శశిధర్ ఇప్పుడెక్కడ ఉన్నారో ఎవరికి తెలీదు.
రేవంత్ రెడ్డిని బహిరంగంగా విమర్శించేందుకు ఒక బ్యాచ్ తయారైంది. వారికి ఇప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తోడయ్యారు. ఆయన ఏకంగా పార్టీలో కోవర్టులున్నారంటూ తిట్ల దండకం అందుకున్నారు. హైకమాండ్ ప్రకటించిన కమిటీల పట్ల సంతృప్తి చెందని నేతల్లో రాజనర్సింహ కూడా ఒకరు. తొలుత కొండా సురేఖ అలిగితే రేవంత్ జోక్యం చేసుకుని అన్ని సంగతులు చూసుకుంటానని హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్ పట్ల తెలంగాణ జనం అసంతృప్తిగా ఉన్నారన్నది ఒక టాక్, బీజేపీకి సానుకూల వాతావరణం లేదన్నది కూడా మరో టాక్. దాన్ని క్యాష్ చేసుకుంటూ జనంలో మంచి పేరు తెచ్చుకోవాల్సిన కాంగ్రెస్ నేతలు అంతర్గత కీచులాటతో అభాసుపాలవుతున్నామన్న సంగతి గుర్తించలేకపోతున్నారు. మీడియా సాక్షిగా తిట్టుకుంటే జనంలో పలుచన అవుతామని తెలుసుకోలేకపోతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఎవరైనా అనుకుంటే వాళ్లు ఆలోచన మార్చుకునే పరిస్థితిలోకి నెడుతున్నారన్న సంగతిని నేతలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు ఈ అసంతృప్తి పరులైన నాయకులు ఎవరి మీద పోరాడుతున్నారో అర్థం కావడంలేదు. వ్యక్తుల మీద ఆరోపణలు కాస్త పార్టీ మీద పోరాటంగా మారే ప్రమాదం ఉంది కదా. అది ప్రత్యర్థులకు వరంగా మారుతుంది కదా. కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరని ఆ పార్టీని అందులోని నాయకులే ఓడిస్తారన్న సామెత నిజం కాకముందే జాగ్రత్త పడితే మంచిది. అప్పుడే కాస్తైనా విజయావకాశాలుంటాయి. పార్టీలో యువతరానికి దిశానిర్దేశం చేసినట్లు కూడా అవుతుంది.