బాబు చెప్పింది నిజమేనంటూ వైసీపీ ట్రోల్స్

By KTV Telugu On 14 December, 2022
image

రాష్ట్రంలో టీడీపీ పనైపోయిందని ప్రత్యర్థులు విమర్శిస్తే దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ సొంత పార్టీ నేతలే అలాంటి వ్యాఖ్యలు చేస్తే. అందునా పార్టీని లీడ్ చేస్తున్న వారి నోటి నుంచి ఆ మాటలు వస్తే. ఇంకేముంది తమ వ్యతిరేకులు పండుగ చేసుకుంటారు. ఇప్పుడు అలాంటిదే చేసుకుంటున్నాయి వైసీపీ శ్రేణులు. మొన్న అచ్చెన్నాయుడు పార్టీపై చేసిన వ్యాఖ్యలను సందర్భానుసారం వాడుకుంటున్న వైసీపీకి ఇప్పుడు చంద్రబాబు కొత్త అస్త్రంగా దొరికారు. తాజాగా పార్టీ నేతలనుద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో ఎలాంటి చర్చ జరుగుతుందో గానీ వైసీపీ మాత్రం తెగ ఆడేసుకుంటోంది. రోజురోజుకు పార్టీ నిర్వీర్యమైపోతుంటే మీరు అక్కడ పోరాడకుండా చెప్పిన పని చేయకుండా ఇక్కడికి వచ్చి నాపై ప్రెషర్‌ చేస్తారా? అంటూ చంద్రబాబు పార్టీ నేతలనుద్దేశించిన మాట్లాడిన వీడియో ఒకటి బయటకొచ్చింది.

చంద్రబాబును అడుగడుగునా ఇరుకున పెడుతోన్న వైసీపీ ఛాన్స్ దొరికితే చాలు రెచ్చిపోతోంది. తాజా చంద్రబాబు వ్యాఖ్యలను తెగ ట్రోల్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. టీడీపీ అధినేత నిజం ఒప్పుకున్నారంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీలేదు బొక్కా లేదంటూ అచ్చెన్నాయుడు గతంలోనే చెప్పారని ఇప్పుడు చంద్రబాబు స్వయంగా రాష్ట్రంలో టీడీపీ బలహీనంగా ఉందని నిజం ఒప్పుకున్నారని అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును ఓ ఆటాడుకుంటున్నారు. టీడీపీ పని అయిపోయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ వీడియో సందర్భం ఏంటి, బాబు ఎవరితో అలా మాట్లాడారు అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడిన వీడియో బయటకు లీక్ చేసింది ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఇదే తనకు చివరి ఎన్నిక అంటూ వైసీపీకి ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు తన వ్యాఖ్యల్యపై వివరణ ఇచ్చినప్పటికీ అప్పటికే చేయాల్సిందంతా చేసేసింది అధికార పార్టీ. బాబు చెప్పినట్టు ఆయనకు ఇవే చివరి ఎన్నికలని అప్పుడప్పుడు విమర్శలు గుప్పిస్తోంది కూడా. ఇక అదే సమయంలో బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబును అదే టైటిల్స్‌తో వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. గత ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు బాదుడు బాదారని, మరోసారి బాదేందుకు సిద్ధంగా ఉన్నారని సెటైర్లు పేలుస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలనే ఉద్దేశంలో చంద్రబాబు తీసుకొచ్చిన ఇదేం ఖర్మ కార్యక్రమం ఆరంభానికి ముందే అభాసుపాలైంది. ముందే వైసీపీ క్లీన్ బౌల్డ్ చేసేసింది. ఓ బహిరంగసభలో జగన్ అదే టైటిల్‌తో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు గత టీడీపీ పాలనే ఓ ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారని ఆ టైటిల్ పెట్టడంపై టీడీపీ నేతలే ఇదేం ఖర్మ అనుకుంటున్నారంటూ జగన్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు చంద్రబాబు పార్టీ నిర్వీర్యం అవుతుందోంటూ మరోసారి వైసీపీకి బూస్టింగ్ ఇచ్చారు.