దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం జరిగిన రాజశ్యామల యాగంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హాజరయ్యారు. ఇకపై వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటూ దేశమంతా విస్తరించాలనేది కేసీఆర్ వ్యూహం. అందుబో భాగంగా ఏపీలో సైతం సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం విజయవాడలో బీఆర్‌ఎస్ కార్యాలయం నిర్మాణం కోసం స్థలం కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలో అక్కడ కూడా బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతవరకు ఏపీలో బీఆర్ఎస్ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పగించినట్టు సమాచారం.
సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌లో భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బహిరంగసభ బాధ్యతలను కూడా తలసానికి కేసీఆర్ అప్పగించారు. తలసానికి ఏపీలో చాలామంది బంధుమిత్రులు ఉన్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి కోడి పందాల్లో పాల్గొనడానికి ఆయన ఏపీకి వెళ్తారనేది అందరికీ తెలుసు. అందుకే ఏపీలో బీఆర్ఎస్ బాధ్యతలను తలసానికి అప్పగించారని అనుకుంటున్నారు. మరోవైపు ఏపీ మూలాలు ఉండి హైదరాబాద్ లో ఉన్న ప్రముఖులతో కేసీఆర్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. గతంలో తనతో కలిసి పనిచేసి, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న పలువురు ఏపీకి చెందిన సీనియర్ నేతలతో కూడా కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. జాతీయ పార్టీ అధికారిక గుర్తింపు కోసం తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో పోటీ చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో ఎన్నికల బరిలోకి దిగాలని ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారు.