ఏపీలో కీలకమైన కాపులు ఎవరివైపు? ఇప్పటికీ ఈ ప్రశ్న పజిల్‌గానే ఉంది. అన్నిపార్టీల్లో కాపు నేతలున్నారు. ఎవరి పార్టీని వారు సమర్థిస్తున్నారు. ఇన్నాళ్లూ కాపుల మాట ఎత్తని పవన్‌కల్యాణ్ కూడా ఈమధ్య తన సామాజికవర్గాన్ని దువ్వుతున్నారు. వంగవీటిరంగా హత్యను తెరపైకి తెస్తూ సెంటిమెంట్ రాజేస్తున్నారు. ఇలాంటి సమయంలో విశాఖపట్టణంలో ఏర్పాటవుతున్న కాపునాడు లక్ష్యమేంటి? ఆ వర్గం పయనం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి మొదలైంది.
విశాఖపట్టణంలో డిసెంబరు 26న జరగబోతున్న కాపునాడు రాజకీయంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేంలేదు. అన్నిపార్టీల్లోని నేతలు, ఏ పార్టీతో సంబంధంలేని ప్రముఖులు కూడా కాపునాడుకు రాబోతున్నారు. రాధా- రంగా రాయల్ అసోసియేషన్ కాపునాడు నిర్వహిస్తోంది.
దీనికి మిగతా కాపు సంఘాల మద్దతుందో లేదో మీటింగ్రోజు తేలబోతోంది. కాపునాడు పోస్టర్ని టీడీపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించడం ఆసక్తికర పరిణామం. చిరంజీవి అందుబాటులో లేకపోవటంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుంకర ఆదినారాయణతో కలిసి గంటా పోస్టర్ రిలీజ్ చేశారు. కాపునాడు నిర్వహణలో తన పాత్ర కీలకమని గంటా చెప్పకనే చెప్పారు. ఏపీలో గెలుపోటములను శాసించగల కాపు సామాజికవర్గంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి లాంటి ఉపతెగలతో చాలా అసోసియేషన్స్ చలామణిలో ఉన్నాయి. వంగవీటి రాధా పేరుతోనూ సంఘాలున్నాయి. రాధా-రంగా రాయల్ అసోసియేషన్ కూడా కీలకమైనదైనా ఎప్పుడూ రాజకీయంగా ఎక్స్పోజ్ కాలేదు.
ఇప్పుడు మాత్రం అనూహ్యంగా ఓ రాజకీయ నిర్ణయం తీసుకునేందుకు విశాఖలో కాపునాడుకు సిద్ధమైంది. 50 వేలమందితో నిర్వహిస్తున్న ఈ భారీ మీటింగ్‌కి పార్టీలకతీతంగా కాపునేతలందరినీ పిలిచింది. చైతన్యమున్నా, సామాజికంగా బలమున్నా ఏదో ఒక పార్టీ దయాదాక్షిణ్యాలమీద బతకాల్సి వస్తోందన్న అభిప్రాయం కొందరు కాపునేతల్లో ఉంది. విశాఖ కాపునాడులో రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికనల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మూకుమ్మడిగా మద్దతు తెలపాలన్నది కాపునాడు మీటింగ్ ప్రధాన ఎజెండాగా చెబుతున్నారు. ఒకవేళ టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే పవన్‌కళ్యాణ్‌ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలనే డిమాండ్ పెట్టాలనే ఆలోచన జరుగుతోంది. టీడీపీతో కాకుండా బీజేపీతోనే కలిసి సాగాలని పవన్‌కల్యాణ్ నిర్ణయించుకుంటే తమ వైఖరేంటో కూడా కాపునాడు సాక్షిగా ఆ సామాజికవర్గ నేతలు తేల్చబోతున్నారు.