ఢిల్లీలో బీఆర్ఎస్ ఓపెనింగ్ పనుల్లో కేసీఆర్ బిజీబిజీగా ఉన్న సమయంలోనే హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ని ఆ పార్టీ గిల్లింది. గిల్లికజ్జాలంటారు చూశారూ అలాంటిదేనన్నమాట! టీకాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ఆఫీస్‌ని పోలీసులు సీజ్ చేశారు. హార్డ్‌డిస్క్‌లు, సిస్టమ్స్ పట్టుకెళ్లారు. సైబర్‌క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ వార్‌రూమ్‌కి చేరుకున్నప్పుడు పెద్ద డ్రామానే జరిగింది. పోలీసులతో ముఖ్యనేతలు వాదనకు దిగారు. దీంతో వాళ్లు బలప్రయోగం చేసి వచ్చిన పని పూర్తిచేసుకున్నారు. కాంగ్రెస్ స్ట్రాటజీ ఆఫీస్‌పై పోలీసుల దాడితో ఆ పార్టీ భగ్గుమంటోంది. బీఆర్ఎస్ ఆఫీస్‌ని ముట్టడించేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. జిల్లాల్లోకూడా నిరసనలు దిగాయి. ఏఐసీసీ పెద్దలతో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు ప్రెస్‌మీట్ పెట్టారు. లోక్‌సభలోనూ దీనిపై వాయిదాతీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్‌నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలను కారెక్కించేసి ఆ పార్టీని రాజకీయంగా బీఆర్ఎస్ బలమైన దెబ్బకొట్టింది. కాంగ్రెస్ ఎంత బలహీనపడిందో దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో తెలిసిపోయింది. అందుకే కేసీఆర్ అండ్‌కో కాంగ్రెస్‌ని తేలిగ్గా తీసుకుంటోంది. బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. అలాంటిది సోషల్‌మీడియాలో అభ్యంతకర పోస్టుల సాకుతో కాంగ్రెస్‌ని టార్గెట్ చేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది.
రాజకీయవిమర్శలు చేసుకోవచ్చుగానీ, వ్యక్తుల్ని కించపరిచేలా వీడియోలు, పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు పోలీసులు. కాంగ్రెస్ సోషల్‌మీడియా సెంటర్‌పై ఐదు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయంటున్నారు. కారణాలేమయినా కుమ్ములాడుకుంటున్న కాంగ్రెస్ ఏకతాటిపై రోడ్డెక్కే అవకాశాన్ని కేసీఆర్ పార్టీ ఇచ్చింది. ఇప్పటికే బీజేపీని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసుకుంది. ఫాంహౌస్ కేసుతో ముఖ్యనేతల్ని బజారుకు లాగాలనుకుంటోంది. లిక్కర్‌స్కామ్‌లో కవితని ఇరికించి బీజేపీ కూడా రివెంజ్ తీర్చుకుంటోంది. మొన్నటిదాకా లైట్ తీసుకున్న వైఎస్ షర్మిలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కదలనివ్వడం లేదు. ఆమె నోరుజారితే దాడులు తప్పవన్నట్లు అధికారపార్టీ నేతలు హెచ్చరికలు చేస్తున్నారు. ఏ పార్టీనీ వదిలేది లేదన్నట్లుంది బీఆర్ఎస్ దూకుడు. వచ్చేది ఎన్నికల సంవత్సరం. తనపై బురద చల్లేందుకు, తన వైఫల్యాలను ఎత్తిచూపించేందుకు ఎవరికీ ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనుకుంటోంది. అందుకే కాంగ్రెస్ ఆఫీస్‌పై దాడి. బంతి ఎంత బలంగా కొడితే అంతే బలంగా పైకిలేస్తుంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో నిరసనలు, బలప్రదర్శనలు పెరగబోతున్నాయి.