ఉక్రెయిన్‌పై వింటర్వార్ మొదలు పెట్టింది రష్యా. విద్యుత్ సరఫరా వ్యవస్థని దెబ్బతీస్తూ ఉక్రెయిన్ ప్రజలు చలికి గడ్డకట్టిపోతుంటే రాక్షసానందం పొందుతోంది. కానీ అదే సమయంలో రష్యా వెచ్చగా పడుకోవడం లేదు. ఆ మాటకొస్తే రష్యా అధ్యక్షుడికి కంటినిండా నిద్ర కూడా పట్టటం లేదు. రష్యాకి ఇప్పుడో కొత్త సమస్య వచ్చిపడింది. ఫ్లూ రష్యాని వణికిస్తోంది. చివరికి అధ్యక్ష భవనంలోని చాలామంది అధికారులు కూడా ఫ్లూతో మంచం పడుతున్నారు. ఫిట్నెస్ మెయింటెన్ చేసే పుతిన్ కూడా ఫ్లూ దెబ్బకి బంకర్లో తలదాచుకుంటున్నాడు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే క్రెమ్లిన్‌లో ఫ్లూ వ్యాప్తిపై వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రష్యాలో చాలా మంది అధికారులు ఫ్లూ బారినపడటంతో పార్లమెంటు ఎగువసభలోనూ ప్రసంగానికి పుతిన్ దూరంగా ఉంటున్నారు. వేగంగా వ్యాప్తిచెందే అంటువ్యాధి విజృంభించటంతో రష్యా అధ్యక్షుడిని ముందు జాగ్రత్తగా అధికారులు బంకర్‌కి తరలించారు. న్యూ ఇయర్స్ సెలబ్రేషన్స్‌కి కూడా పుతిన్ బయట తిరిగే అవకాశం లేదంటున్నారు. పర్వతాల్లో ఉన్న ఓ బంకర్లోనే పుతిన్ న్యూ ఇయర్ గడిచిపోయేలా ఉంది.
అధ్యక్షుడు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బంకర్లో అందరికీ దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. మరి సాధారణ ప్రజల సంగతేంటి? దేశంలో భారీస్థాయిలో ఫ్లూ కేసులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. సీజనల్‌గా వచ్చిపోయే సాదాసీదా జబ్బు కాదిది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే A (H1N1) ఫ్లూ వేరియంట్ నిపుణులను కలవరపెడుతోంది. అందుకే ప్రజలను జాగ్రత్తగా ఉండాలని పదేపదే హెచ్చరికలు చేస్తోంది రష్యా ఆరోగ్యశాఖ. పుతిన్ పాలన ఘనతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఏటా మాస్కోలో వార్షిక మీడియా సమావేశం ఏర్పాటవుతుంది. ఉక్రెయిన్‌లో సైన్యం వైఫల్యం, ఆరోగ్యపరిస్థితిపై ప్రజలకు అన్ని వివరాలు చెప్పే అవకాశమున్న ఈ కీలక కార్యక్రమానికి ఫ్లూ సాకుతో పుతిన్ మొహం చాటేస్తున్నారు. వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చిందంటారే అలాగే ఉంది పుతిన్ పరిస్థితి కూడా!