జనసేనలోకి కన్నా లక్ష్మీనారాయణ?

By KTV Telugu On 15 December, 2022
image

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గుంటూరులో కన్నా నివాసానికి వెళ్లిన మనోహర్ పలు అంశాలపై చర్చించారు. దాంతో కన్నా జనసేనలోకి వెళ్లనున్నారనే ప్రచారం ఊపందుకుంది. గతంలో ఏపీ బీజేపీ చీఫ్ గా వ్యవహరించిన కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇటీవల పవన్‌-చంద్రబాబు భేటీ సమయంలో వీర్రాజు తీరుపై కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు ఏకపక్ష పోకడల కారణంగానే పవన్ దూరమయ్యారని తప్పుబట్టారు. ఆ తర్వాత విశాఖలో మోడీ, పవన్ భేటీతో రాజకీయం మొత్తం మారిపోయింది. అయితే ప్రస్తుతం కన్నాతో మనోహర్ సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

గత కొంతకాలంగా కన్నా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల తన అనుచరులు, కార్యకర్తలతో భేటీ అయిన ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలు అని చెప్పుకుంటున్నప్పటికీ రెండు పార్టీలు కలిసి చేపట్టిన కార్యాచరణ ఒక్కటీ లేదు. ఇలాంటి సమయంలో కన్నాతో నాదెండ్ల మీట్ కావడం ఆసక్తిని రేపుతోంది. సాధారణ సమావేశమే అని చెబుతున్నా దీని వెనుక రాజకీయ మతలబు ఏంటనే చర్చకు తెరలేచింది. బీజేపీతో అలయన్స్‌లో భాగంగానే రాజకీయం సహా పలు అంశాలపై చర్చించినట్లు జనసేన నేతలు చెబుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జనసేనతో పొత్తు ఖరారైంది. జనసేనతో పొత్తు కొనసాగాలనేది కన్నా లక్ష్యం. అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరాణల నేపథ్యంలో కన్నా పార్టీ ఆలోచన మారిందని జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

ప్రభుత్వ వైఫల్యాలపై కలిసి పోరాటం చేస్తామని బీజేపీ, జనసేన నేతలు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో తమ భాగస్వామిగా ఉన్న పార్టీలోని నేతను జనసేన తమ పార్టీలో చేర్చుకునే సాహసం చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలను జనసేన తమ పార్టీలోకి తీసుకుంటే అది పొత్తు మీద ప్రభావం చూపటంతో పాటుగా ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీయటం ఖాయంగా కనిపిస్తోంది. మోడీ-పవన్‌ల భేటీ తర్వాత కూడా రెండు పార్టీలు కలిసే ఉన్నామని చెబుతున్నాయి తప్ప ఐక్యంగా పోరాటాలు చేయడం లేదు. జనసేన సొంతంగా తమ బలం పెంచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో చేరికలకు ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. కన్నా-నాదెండ్ల మనోహర్ ఇద్దరూ గతంలో కాంగ్రెస్‌లో కలిసి పనిచేశారు. ఒకే జిల్లా నేతలు కూడా. కన్నా- పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కూడా. కన్నాను పార్టీలో చేర్చుకుంటే గుంటూరు జిల్లాలో జనసేన బలపడడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కారణమవుతారని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది.