వేద విద్యలో కాషాయ అజెండా ఆ ముసుగులో ఏముంది..

By KTV Telugu On 17 May, 2022
image

నిజానికి అది చాలా రోజులుగా వినిపిస్తున్నదే. ఇంగ్లీష్ విద్య మాటున వేదాలు, పురాణాలను మరిచిపోతున్నామని పెద్దలు నిత్యం వాపోతున్నదే. బ్యాక్ టు వేదాస్ అని బాల్ గంగాధర్ తిలక్ చెప్పి చాన్నాళ్లయినా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా పరిస్థితి కొనసాగుతోంది. దానితో ఇప్పుడు భారతీయ సంప్రదాయ విద్యావిధానాన్ని అమలు చేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. ఈ దిశగా పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాలను కూడా సిద్ధం చేస్తోంది. బీజేపీ ప్రయత్నాలు హర్షించదగినవే అయినా అసలు ఉద్దేశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…

భారతీయ సంప్రదాయాలు పిల్లలకు చేరడం లేదు. వేదం అంటే ఏమిటో వారికి తెలియదు. ఖగోళ శాస్త్రం అంటే నాసా అనుకునే రోజులు ఇవి. ఇంగ్లీష్ వాళ్లు నేర్పిన మెకాలే విద్యావిధానంలో మనం వేదాలు, పురాణాలు మరుగునపడిపోయాయి. దీనితో నూతన విద్యావిధానం పేరుతో బీజేపీ నేతృత్వం ఎన్డీయే వేదాలు, పురాణాలను నేర్పించబోతోంది. తొలుత ఇంజినీరింగ్ కలాశాలల్లో ఒక పాఠ్యాంశంగా దాన్ని చేర్చబోతున్నారు. ఇంజీనిరింగ్ కోర్టుల్లో వేదాలు, పురాణాలు, సంస్కృతం, ప్రాచీన విజ్ఞానం, టౌన్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్, ప్రాచీణ ఖగోళశాస్త్రాన్ని ప్రవేశ పెట్టబోతున్నారు. ప్రతీ విద్యార్థి ఈ పాఠ్యాశాలను విధిగా చదవాల్సి ఉంటుంది. అయితే విద్యార్థులకు ఒక వెసులుబాటు ఉంటుంది. మొదటి సారి ఈ పాఠ్యాంశాలు చదువుతున్నందున ఫెయిల్ అవుతామని భయపడాల్సిన అవసరం లేదు. పాస్ ఫెయిల్‌తో సంబంధం లేకుండా.. వేద విద్యను అందరికీ నేర్పేందుకు ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోంది. దీన్ని నాన్ క్రెడిట్ కోర్సు అంటారు. అంటే మార్కుల జాబితాలో ఈ మార్కులను చేర్చరు.

ఇంజినీరింగ్ విద్యార్థులు సనాయాసంగా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌కు అలవాటై పోయేందుకు ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. సిలబస్‌లోని అన్ని పాఠ్యాంశాలను చేరుస్తూ ఉన్న ఇంట్రొడెక్షన్ టు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనే 417 పేజీల పుస్తకాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు ప్రొఫెసర్ బీ మహాదేవన్ రాశారు. పుస్తకం విలువ 795 రూపాయలు. వేదాల నుంచి ఖగోళ శాస్త్రం వరకు అన్ని ఆంశాలు ఇందులో ఉంటాయి. కేంద్ర విద్యా శాఖామంత్రి దర్మేంద్ర ప్రధాన్.. స్వయంగా గ్రంధావిష్కరణ చేశారు. మన పూర్వీకులు అందించిన విలువైన విద్యా విధానాన్ని ఇకనైనా పునరుద్ధరించాలని ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు.

బీజేపీ దాని భావసారూప్య సంస్థలు నిత్యం సంప్రదాయ విద్యపై ప్రచారం చేస్తూనే ఉంటారు. ఆరెస్సెస్ శాఖలో వేదాలు చదువుతుంటారు. భారతీయ సంప్రదాయాలపై పెద్దలు ఉపన్యాసాలిస్తూ ఉంటారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ స్థిరపడిపోయిన తర్వాత తన అజెండాను బయటకు తీసింది. వేదాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతోంది. మన సంప్రదాయాన్ని కాపాడటమొక్కటే బీజేపీ ఉద్దేశమైతే ఇబ్బందేమీ ఉండదు. దాని వెనుక హిందూత్వాన్ని రుద్దాలన్న లక్ష్యమే ఇబ్బందికరంగా మారొచ్చు. ముస్లిం మదర్సాల్లో సైతం వేదాలు, పురాణాలు ప్రవేశ పెడతామని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. పైగా వేదాలు నేర్పేందుకు ఇప్పుడు ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఎక్కడి నుంచి వస్తారన్నది పెద్ద ప్రశ్న. బీజేపీ భావసారూప్య సంస్థల ప్రతినిధులను ఆ ఉద్యోగాల్లోకి చొప్పిస్తేనే అసలు సమస్య ప్రారంభమవుతుంది…