పవన్‌కళ్యాణ్ ఫుల్‌టైమ్ పాలిటిక్స్‌కి రెడీ అయ్యారు. వారాహితో ట్రయిలర్ చూపించేసిన జనసేనాని జనంలోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. వైసీపీ నేతలు విమర్శిస్తున్నట్లు వీకెండ్‌లు కాదు కొత్త సంవత్సరంనుంచి జనంలోనే ఎక్కువగా ఉండబోతున్నారు. కచ్చారోడ్లమీదయినా పక్కాగా వెళ్లేలా ఆర్మీరేంజ్ వాహనం రెడీ అయింది. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఇప్పటికే పవన్‌కళ్యాణ్ కొన్ని జిల్లాల్ని చుట్టేశారు. పట్టణ ప్రాంతాల్లో జనవాణి పేరుతో జనంలో ఉంటున్నారు జనసైనికులు. జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరిట జనసేన భారీ సభ పెట్టబోతోంది. ఇలాంటి సభలనే అన్ని జిల్లాల్లో పెట్టేందుకు జనసైనికులు సిద్ధమవుతున్నారు.
పవన్‌కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నెక్ట్స్ ట్రిప్ కోసం సత్తెనపల్లిని ఎంచుకున్నారు. పవన్‌కళ్యాణ్‌ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేసే నేతల్లో మంత్రి అంబటి రాంబాబు ముందుంటారు. అందుకే వ్యూహాత్మకంగా అంబటి నియోజకవర్గాన్నే జనసేన ఎంచుకుంది. గంటా అరగంట అంటూ ఇదివరకే అంబటిని ఆడుకున్న పవన్‌కళ్యాణ్ సత్తెనపల్లి టూర్‌తో విమర్శలకు పదును పెట్టబోతున్నారు. అటు అంబటి కూడా రోజూ పవన్‌కళ్యాణ్‌ని ఏదో రూపంలో టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన కౌలు రైతు భరోసా యాత్రను ఈసారి సత్తెనపల్లిలో నిర్వహిస్తుండటం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
గత ఎన్నికల్లో అంబటి విజయానికి కాపు ఓట్లు కలిసొచ్చాయి. పవన్ అభిమానులు కూడా అంబటికి మద్దతిచ్చారు. తాము మనస్ఫూర్తిగా సహకరించినా పవన్‌కళ్యాణ్‌పై అంబటి తరచూ విమర్శలు చేయడంపై అభిమానులు గుర్రుమంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు దాదాపు 35వేలదాకా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అంబటి ఇలాకాలో పవన్ పర్యటన వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగానే ఉండబోతోంది. మరోవైపు సత్తెనపల్లి వేదికమీదే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వంటి ముఖ్యనేతలు జనసేనలో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. వైసీపీ ఓన్లీ తిక్కుందనుకుంటోందిగానీ పవన్‌కళ్యాణ్‌కి ఓ లెక్కున్నట్లే కనిపిస్తోంది.