జనసేన ఆవిర్భావసభ జరిగినప్పటి నుండి ఏపీలో పొత్తులపై విస్తృత చర్చ జరుగుతోంది. టీడీపీ – జనసేన కలిస్తే గేమ్ ఛేంజర్ అని అందరూ నమ్ముతున్నారు. అందుకే వైసీపీ నేతలు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అనే సవాల్ విసురుతున్నారు. ఎందుకంటే టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి కడితే ఈ సారి పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం వైసీపీ నేతలకు పెద్ద విషయం ఏమీ కాదు. సింహం సింగిల్‌గా వస్తుందని స్టేట్మెంట్లు ఇచ్చుకోవడానికి పనికి వస్తుంది. కానీ ఫలితం మాత్రం అనుభవించాలి. వైసీపీ ఇప్పటి వరకూ పైకి సింగిల్‌గానే కనిపించినా… ఎన్నో శక్తులు సహకరించబట్టే విజయం సాధించింది. అలా సహకరించిన వాటిలో బీజేపీ, టీఆర్ఎస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూంటే ఏ ఒక్కరూ సహకరించే పరిస్థితి లేదు. నిజంగా పొత్తులకు ప్రయత్నించినా ఆ పార్టీతో కలిసేందుకు ఏ పార్టీ కూడా లేదనేది కళ్ల ముందు కనిపిస్తున్న నిజం.
వైసీపీతో భావసారూప్యం ఉన్న పార్టీ ఏది !?
భావసారూప్యం ఉన్న పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ఆ భావసారూప్యం ఇప్పటికైతే ఏపీలో వైసీపీతో ఎవరికీ కనిపించడం లేదు. బీజేపీ – వైసీపీ మధ్య నిజంగా సంబంధం ఉంది. 2014లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన తర్వాత నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం కూడా చేయకముందే… వైఎస్ జగన్ … ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. అప్పట్నుంచి బీజేపీ ఏం చెబితే అదే వైసీపీకి వేదంగా మారింది. వైసీపీ వ్యవహారశైలి మొదటి నుంచి ఇంతే ఉంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా పని చేశారు. పెట్రో ధరల పెంపుపై దేశం మొత్తం గగ్గోలు పెడుతున్నా… మోడీని పల్లెత్తు మాట అనడానికి సాహసించడం లేదు. దేశ రాజకీయాల్లో అనేక మార్పులొస్తున్నా… బీజేపీకి దగ్గరయ్యేందుకే వైసీపీ ప్రయత్నిస్తోంది. కానీ అది పొత్తులు పెట్టుకునేంతగా కాదు.
బీజేపీతో వైసీపీకి భావసారూప్యం లేదు..!
మన్మధుడు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఆమె ప్రేమించింది.. నేను ప్రేమించాల్సి వచ్చింది.. అని ప్రస్తుతం… వైసీపీ పరిస్థితి అంతే. ప్రిపోల్ అలయెన్స్ ఉండాల్సిందేనని బీజేపీ అగ్రనాయకత్వం నుంచి వత్తిడి వస్తే.. వద్దు అనే పరిస్థితి వైసీపీకి లేదు. వారి భయాలు.. వారికి ఉన్నాయి. భారతీయ జనతా పార్టీతో నేరుగా.. వైసీపీ పొత్తులు మాత్రమే పెట్టుకోలేదు. అన్ని రకాల సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ విషయంలో ఎవరికీ అనుమానాల్లేవు. కొత్తగా పొత్తులు పెట్టుకుంటే.. నేరుగా.. కలిశారు అని మాత్రమే ప్రజలు అనుకుంటారు. ఈ విషయంలో.. కొత్త వచ్చే.. పోయే నష్టం ఏమీ ఉండదనే అంచనాలు.. వైసీపీలో ఇప్పుడిప్పుడే వినిపించడం ప్రారంభించాయి. కానీ వైసీపీ డీఎన్ఏ కాంగ్రెస్, బీజేపీతో ఎలాంటి భావసారూప్యం లేదు. కానీ రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయి. అయితే ఇప్పుడు బీజేపీ కూడా వైసీపీతో పొత్తు అనే మాట ఎక్కడా వినిపించడం లేదు. అదే ట్విస్ట్.
జనసేన రాదు.. కమ్యూనిస్టులు దూరం !
జగన్‌కు జనసేన పార్టీ దూరం. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించి ఆయన సామాజికవర్గాన్ని దారుణంగా వంచించి .. జగన్ పూర్తిగా దూరం చేసుకున్నారు. పొత్తులు కాదు కదా.. కనీసం పాజిటివ్ గా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. జగన్ ను దింపడమే లక్ష్యంగా పని చేస్తామని ఆయన చెబుతున్నారు. సీపీఎం జగన్ తో కాస్త చనువుగా ఉన్నా.. పొత్తు పెట్టుకోలేదు. ఇక సీపీఐ నారాయణ జగన్ ను రాజకీయశత్రువుగా ప్రకటించారు. రెండు కమ్యూనిస్టు పార్టీలు దూరమే.
వైసీపీకి పొత్తుల చాన్సుల్లేవ్ !
తెర వెనుక సంబంధాలే తప్ప.. తెర ముందు ఎలాంటి రాజకీయ సంబంధాలు పెట్టుకోవడానికి.. వైసీపీ కూడా సిద్ధంగా లేదు. చంద్రబాబు మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కాకుండా ఉండటం ఎవరికి అవసరమో.. వాళ్ల సాయాన్ని తెర వెనుక గరిష్టంగా తీసుకుని లాభపడుతోంది. వారు కూడా అందుకు సాయం చేస్తున్నారు కానీ.. వైసీపీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా లేరు. అందుకే వైసీపీ.. బలవంతంగా అయినా ఒంటరిగా ఉండాల్సి వస్తోందని చెప్పుకోవచ్చు.