ముహూర్తబలం చూసుకున్నారు. రాజశ్యామలయాగంతో ఢిల్లీలో తన మార్క్ రాజకీయానికి శ్రీకారం చుట్టారు. భారత్ రాష్ట్ర సమితి ఆఫీస్ తెరిచారు. పార్టీ కిసాన్‌సెల్ బాధ్యతలను రైతుసంఘ నాయకుడికి అప్పగించారు. యూపీ, కర్నాటక మాజీ సీఎంలు కేసీఆర్ జాతీయపార్టీకి తోడుగా నిలిచారు. బోణీ బానే ఉంది. కానీ జాతీయరాజకీయాల్లో కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ ఎంతవరకు నడుస్తాయన్నదే పెద్ద ప్రశ్న. భావసారూప్య పార్టీలు, సంఘాలను కలుపుకొని జాతీయస్థాయి ఉద్యమాలు నిర్మించాలన్న ఆలోచన భేష్. కానీ ఎవరు కలిసొస్తారు. ఏమేరకు ఉద్యమాలు నడపగలరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అబ్‌కీ బార్..కిసాన్ సర్కార్. కేసీఆర్ జాతీయపార్టీ నినాదం ఇది. వింటానికి బాగుంది. నినదించడానికి ఇంకా బాగుంటుంది. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాన్నే తొలి ఎజెండాగా ఎంచుకుంది భారత్ రాష్ట్ర సమితి. వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేలా ఉద్యమాన్ని నడపాలనుకుంటున్నారు కేసీఆర్. రైతు చట్టాల రద్దుకోసం ఏ రాజకీయపార్టీ తోడ్పాటు లేకుండా నెలలతరబడి పోరాడిన ఉత్తరాది రైతాంగానికి బీఆర్‌ఎస్‌లాంటి కొత్త పార్టీ నాయకత్వం అవసరమవుతుందా అన్న చర్చ మొదలైంది.
ఉద్యమాన్ని నిర్మించడానికి రైతు సెంటిమెంటు పనికొస్తుందేమోగానీ దాంతో బీఆర్‌ఎస్ రాజకీయంగా బలపడటం కష్టమే. గతంలో జనతా పార్టీ ఇదే సెంటిమెంటుతో రాజకీయాలు చేసినా తర్వాత పాలపొంగులా దాని ప్రభావం చల్లారిపోయింది. తర్వాత నేషనల్ ఫ్రంట్ కూడా ఈ ఎజెండానే ఎత్తుకున్నా ఎక్కువకాలం మనుగడ సాగించలేకపోయింది. దేశంలో భిన్నమైన సమస్యలున్నాయి. రైతుల సమస్యలు అందులో ఓ భాగం మాత్రమే. వ్యవసాయాధారిత దేశమైనా పారిశ్రామికంగా, వృత్తి ఉద్యోగాలపరంగా అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఆత్మగౌరవ సెంటిమెంట్ జనంలో భావోద్వేగాలు నింపింది. తెలంగాణలో అధికారంలోకి తెచ్చింది. కేవలం రైతుల ఎజెండాతో బీఆర్‌ఎస్ జెండా రెపరెపలాడుతుందనుకోవడం దింపుడుకళ్లెం ఆశేనేమో!