ఆ బ్రహ్మ సృష్టికే ప్రతిసృష్టి. మానవ మేథస్సు కొత్త పుంతలు తొక్కుతోంది. అసాధ్యాలను కూడా ఆవిష్కరిస్తోంది. కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఓ ప్రాణం ఈ భూమ్మీద పడాలంటే అమ్మ కడుపులో నవమాసాలు పెరగాలి. రక్తమాంసాలు పంచుకోవాలి. ప్రసవవేదన తర్వాత ఓ కొత్త ప్రాణం ఈ ప్రపంచంలో కళ్లు తెరవాలి. కానీ ఇదంతా గతం కాబోతోంది. అమ్మలేదు, ప్రసవమూ ఉండదు. జస్ట్ ఫాంలో కోడిపిల్లల్లా బిడ్డలు కూడా పుట్టుకొస్తారు. కలికాలం. నిజంగా కలికాలమే. కానీ ఈ పోటీ ప్రపంచంలో నైతికత గురించి ప్రశ్నెక్కడ? కత్రిమ గర్భదారణలు, అద్దె గర్భాలే అబ్బురపరుస్తున్న రోజుల్లో మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు మేథస్సుకు ఆకాశమే హద్దంటున్న శాస్త్రవేత్తలు.
అమ్మ కడుపులో ఊపిరిపోసుకుని తొమ్మిది మాసాలు అంతులేని అనుభూతులు మిగిల్చి ఈ ప్రపంచాన్ని చూస్తుంది బిడ్డ. ఒకప్పుడు గర్భధారణ సహజంగా జరిగిపోయేది. కాన్పులు కూడా అలాగే ఉండేవి. కానీ కాలంమారింది. ఆధునికతతో పాటు ఆరోగ్యపరమైనసమస్యలూ పెరుగుతున్నాయి. గర్భసంచిలో సమస్యలు, ఇతర శారీరక లోపాలు, అనారోగ్యాలతో కొంతమందికి సంతానయోగం లేకుండా పోతోంది. అలాంటి వారికి వరంలా వచ్చింది ఐవీఎఫ్ పద్ధతి. సంతానయోగం లేదనుకున్నవారిని కూడా అమ్మానాన్నలను చేస్తోంది. అయితే ల్యాబ్‌లో అండం ఫలదీకరణతో ఏర్పడే పిండం ఏదో ఒక తల్లి గర్భంలో ప్రవేశపెడితేనే బిడ్డ ఎదుగుతుంది. కానీ భవిష్యత్తులో ప్రసవాలకు ఏ తల్లి గర్భం కూడా అవసరం ఉండదేమో! ఎందుకంటే కృత్రిమ గర్భాశయాలు పురుడు పోసుకుంటున్నాయి. పూర్తిగా ల్యాబ్‌లోనే పిండం శిశువుగా ఎదిగి యాంత్రికంగా ప్రసవించేలా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రయోగశాలల్లోనే కృత్రిమ గర్భాశయాలు సిద్ధమవుతున్నాయి.
సైన్స్ ఫిక్షన్ సిన్మా కాదు. ఇది నిజం. నూటికి నూరుపాళ్లు సమీప భవిష్యత్తుల్లో సాకారం కాబోతున్న నమ్మలేని నిజం. ఇప్పటికే పరిశోధనల్లో ముందంజ వేసిన శాస్త్రవేత్తలు కృత్రిమ గర్భాశయాలతో పిల్లల సృష్టికి సిద్ధమవుతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కృత్రిమ గర్భ కర్మాగారం సిద్ధమవుతోంది. ఈ విధానంలో ఫలదీకరణం నుంచి నవమాసాలు నిండేదాకా కృత్రిమ గర్భంలోనే బిడ్డ పెరుగుదల జరుగుతుంది. అంటే ఏ తల్లికీ పురిటినొప్పులు ఉండవన్నమాట! కృత్రిమ గర్భంలో బిడ్డ ఎదుగుదలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలోనే ఎప్పటికప్పుడు గమనిస్తూ పూర్తి ఆకారం సంతరించుకోగానే బయటికి తీస్తారు. ఆ తర్వాత అదే గర్భంలో మరో బిడ్డను పెంచడం మొదలుపెడతారు. ఇలా యాంత్రికంగా ఎంతమందిని కనేయచ్చో తెలుసా ఏడాదికి 30వేలమంది. అవును ఏడాదికి 30,000 మంది బిడ్డలను ఈ భూమ్మీదికి తెచ్చేందుకు అతి పెద్ద ల్యాబ్ సిద్ధమవుతోంది.
ఈ కృత్రిమ గర్భ కర్మాగారం పేరు ఎక్టో లైఫ్. బెర్లిన్ శాస్త్రవేత్త హషేమ్ అల్ ఘైలీ దీని సృష్టికర్త. సంతానం లేని తల్లిదండ్రుల కోసం ఈ ల్యాబ్‌ని నిర్మిస్తున్నట్లు ఆయన చెబుతున్నా సృష్టికి ఇదో పున:సృష్టే. యాక్టోలైఫ్ అని పిలిచే మొట్టమొదటి కృత్రిమ గర్భ సౌకర్య విధానాన్ని ప్రపంచమంతా అబ్బురంగా చూస్తోంది. దీనికి సంబంధించి విడుదలచేసిన యానిమేషన్ వీడియో సైన్స్ ఫిక్షన్ సినిమాని మరిపిస్తోంది. తల్లి లేకుండానే సంతానయోగమా ఈ వింత సాధ్యమా అంటూ ఇంటర్నెట్లో ఈ వీడియోని చూసి అంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతానికి ఈ అద్భుతం ఇంకా ప్రయోగదశలోనే ఉంది. అసాధ్యం కాదన్న విషయం నిరూపణైంది. జనాభా క్షీణతతో బాధపడుతున్న దక్షిణ కొరియా, బల్గేరియా, జపాన్ లాంటి దేశాలకు సహాయపడటమే ఈ పరిశోధన లక్ష్యమంటున్నారు శాస్త్రవేత్త హషీమ్.
యాక్టోలైఫ్ ప్రయోగశాలలో భారీసంఖ్యలో కృత్రిమ గర్భాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో శిశువులు పెరుగుతాయి. సంతానయోగంలేని దంపతులను తల్లిదండ్రులను చేయడానికి ఇదో గొప్ప పరిశోధనేనని చెప్పొచ్చు. కేన్సర్, ఇతర అనారోగ్య సమస్యలతో గర్భాశయాలు తొలగించిన మహిళల్లో ఈ పరిశోధన ఆశలునింపుతోంది. కృత్రిమ గర్భాశయాల సౌకర్యంలో 75 లేబొరేటరీలు ఉంటాయి. ఒక్కో ల్యాబ్‌కి 400 గ్రోత్ ప్యాడ్స్ (కృత్రిమ గర్భస్థ పిండాలు) పెంచే సామర్థ్యం ఉంటుంది. తల్లి గర్భంలో జరిగే ప్రక్రియంతా కృత్రిమ విధానంలో కూడా జరుగుతుంది. ఒక్క అమ్మ అనుభూతి తప్ప. గ్రోత్ పాడ్స్‌లో శిశువు హృదయ స్పందన, రక్తపోటు, శ్వాసరేటు, ఆక్సిజన్ స్థాయి వంటి ముఖ్యమైన సంకేతాలను పర్యవేక్షించే సెన్సర్లు కూడా ఉంటాయి. తల్లిదండ్రులు బిడ్డ పెరుగుదలను చూసేలా యాప్‌తో అనుసంధానిస్తారు. కావాలనుకొంటే బిడ్డకు మ్యూజిక్ వినిపించవచ్చు. ముచ్చట్లు చెప్పొచ్చు. బిడ్డకో పరిపూర్ణరూపం వచ్చాక సాధారణకాన్పునా, సిజేరియనా అన్న ప్రశ్నే తలెత్తదు. జస్ట్ బర్తింగ్ పాడ్ మీద ఉండే బటన్ నొక్కితే చాలు బిడ్డ చేతికొచ్చేస్తుంది.
కేవలం ఏదో రూపంలో బిడ్డ జన్మించడం కాదు. రంగెలా ఉండాలో, రూపం ఎలా ఉండాలో, జుట్టు ఎలా ఉండాలో కూడా ముందే నిర్ణయించేంత అసాధారణ, నమ్మశక్యంకాని సాంకేతికత కళ్లెదుట సాక్షాత్కరించబోతోంది. గ్రోత్ పాడ్ల నుంచి వీర్యం, అండాలను సృష్టించి తర్వాత జన్యుపరంగా మేలైన పిండాలను ఎంపికకి కృత్రిమ గర్భధారణ సాంకేతికతను వినియోగిస్తారు. పిల్లల జుట్టు రంగు, కంటి రంగు, ఎత్తు, తెలివితేటలు, స్కిన్‌టోన్, జన్యుపరమైన వ్యాధులను కూడా కృత్రిమ గర్భాశయ విధానంలో సరిచేయొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. సైన్స్‌పరంగా రొమ్ము విరుచుకుని చెప్పుకోగల అంశమే అయినా కార్యరూపం దాల్చడానికి కొన్ని నైతిక పరిమితులు శాస్త్రవేత్తలకు ఆటంకంగా మారొచ్చు. వినటానికి విడ్డూరంగా ఉన్నా, మింగుడు పడకపోయినా జరగబోయేది అదే. ఫారాల్లో కోళ్లలా పిల్లలను పెంచడమేంటన్న ప్రశ్న తలెత్తినా మానవ చరిత్రలో అద్భుత ఆవిష్కరణకు శాస్త్రవేతలు రూపం ఇచ్చారన్న వాస్తవాన్ని అంగీకరించక తప్పదు.