ఎన్నికల దాకా బీజేపీ యాత్రలే ?

By KTV Telugu On 16 December, 2022
image

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది. కరీంనగర్ కాషాయమయమైంది. బండి సంజయ్ నాయకత్వంపై బీజేపీ అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా వచ్చి సంజయ్ ను రాష్ట్ర శాఖను అభినందించారు. రాష్ట్రంలో పార్టీకి జనాదరణ పెరిగిందని చెప్పారు. అధికారం దిశగా అడుగులు వేస్తున్నామని అంటూ అందుకోసం ఏం చేయాలో పరోక్షంగా దిశానిర్దేశం చేశారు.

బండి సంజయ్ రోజురోజుకు మరింత ఫైర్ బ్రాండ్ గా మారుతున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం మీద ఒంటి కాలితో లేస్తున్నారు. ఐదు విడతల యాత్ర ముగిసిన నేపథ్యంలో ఆరో విడత యాత్రకు బండి సంజయ్ సిద్ధమవుతున్నారు. నడ్డా కూడా ఈ మేరకు సందేశమిచ్చారు. ఈ యాత్ర ఆగకూడదని కొనసాగాలని సూచించారు. ఇప్పటి వరకు 56 నియోజకవర్గాల్లో 1403 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. అంటే ఇంకా యాభైకి పైగా నియోజకవర్గాల్లో యాత్ర సాగాల్సి ఉందని నడ్డా గుర్తుచేశారు. యాత్ర ఎవరు ఆపినా ఆగదని అంటూ పరోక్షంగా బీఆర్ఎస్ ను హెచ్చరించారు.

ఆరో విడద యాత్ర షెడ్యూల్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి యాత్ర ఉద్దేశాలు కూడా వేరుగా ఉంటాయని చెబుతున్నారు. యాత్ర సందర్భంగా చేరికలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్తిపరులు వచ్చి చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు చేరకల కమిటీ అధ్యక్షుడైన ఈటల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, డాక్టర్ లక్ష్మణ్ టచ్ లో ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని చేర్చుకోవాలనే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నట్లు సమాచారం. మరో పక్క బీఆర్ఎస్ నాయకుల అవినీతి చిట్టాను బయటకు తీస్తున్నారు. వారు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలకు వెళ్లినప్పుడు చిట్టాను చదివి తూర్పాల పడితే స్థానిక ప్రజలకు పూర్తి అవగాహన వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. ఈ సారి బీఆర్ఎస్ మంత్రులే ప్రధాన టార్గెట్ అవుతారని చెబుతున్నారు.

బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గురువారం పార్లమెంటులో డాక్టర్ లక్ష్మణ్ ను పక్కకు పిలిచి ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడటం, సంజయ్ యాత్ర ఎలా సాగిందని అడగడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా నిధులు అందిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. నడ్డా తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఒక అంశంలో ఖచితమైన ఆదేశం ఇచ్చారని చెబుతున్నారు. ఇకపై కాంగ్రెస్ ను విమర్శించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతల విమర్శలకు సాధ్యమైనంత తక్కువ సమాధానం చెప్పాలని ఆదేశించారు. అప్పుడు ఫోకస్ అంతా బీఆర్ఎస్ పై పెట్టే ఛాన్సుంటుందని లెక్కగడుతున్నారు. బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కు వీఆర్ఎస్సే గతి అన్న నినాదాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని కూడా పార్టీ నేతలకు నడ్డా దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్ కుటుంబాన్ని అందులోనూ కవితనే టార్గెట్ చేస్తే ప్రయోజనం ఉంటుందని బీజేపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. లిక్కర్ స్కాములో ఆమె జైలుకు వెళ్లడం ఖాయమని ప్రచారం చేయాలనుకుంటున్నారు. కవిత లేడీ డాన్ లా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు అందుకు సంబంధించిన సాక్ష్యాలు సేకరించే పనిలో పడిపోయారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ కవితకే ఎక్కువ ప్రాధాన్యం లభించిందని గుర్తించిన బీజేపీ ఆమెను నిలువరించకపోతే తమకు కష్టమన్న నిర్ణయానికి వచ్చింది.