ఏపీ రాజకీయ వాతావరణం విచిత్రంగా కనిపిస్తోంది. అటు చలికాలం కాదు.. ఇటు ఎండాకాలం కాదు.. అసలు వానాకాలం కూడా కాదు. ఇంతకీ రాజకీయంగా ఇదే కాలం అన్నట్లుగా కమలనాథులు తలపట్టుకు కూర్చుంటున్నారు. వైసీపీ అధినేత జగన్ ను దెబ్బకొట్టడం అంత సులభం కాదని అర్థం చేసుకున్న బీజేపీకి రెండో వైపు కూడా పెద్దగా అనుకూల వాతావరణం కనపించడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ దారికి వచ్చి పొత్తు పెట్టుకుంటారనుకున్న టీడీపీ, జనసేన కూడా దూరం జరగడంతో బీజేపీకి దిక్కుతోచడం లేదు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న రోడ్డు షోలు, బహిరంగ సభలకు భారీగా జనం హాజరవ్వడం, ఎన్నడూ లేని విధంగా రాయలసీమలో జనం కిక్కిరిసిపోవడంతో బీజేపీ ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తోంది. విశాఖకు వచ్చిన ప్రధాని మోదీ, ఆరేళ్ల తర్వాత జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు అపాయింట్మెంట్ ఇచ్చి భేటీ కావడంపైనా బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని కమలం పార్టీలోని నలుగురు నేతలు పదేపదే చెబుతున్నప్పటికీ జనసేనాని మాత్రం ఆ పార్టీని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకునేందుకు కేంద్ర నాయకత్వం చేస్తున్న ప్రయత్నాల్లో విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. సంస్థాగత వ్యవహారాల కీలక నేతలు రాష్ట్రంలోని కోర్ కమిటీ సభ్యులతో టచ్ లో ఉంటూ రోజూవారీ డెవలప్ మెంట్స్ తెలుసుకునే ప్రయత్నంలో ఉంటున్నారు. సమీకరణాలు లెక్క వేసుకుంటే బీజేపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తే వైసీపీకే ప్రయోజనం ఉంటుందన్న సమాధానం వస్తోంది. బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన పక్షంలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఆ పొత్తుకు విజయం ఖాయమని రాష్ట్ర నేతలు పార్టీ అధిష్టానానికి తెగేసి చెబుతున్నారు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని రాష్ట్ర నేతలు తాము చేసుకున్న సర్వేల ఆధారంగా లెక్కలు వివరిస్తున్నారు. వినడానికి ఆ మాట ఎంతో బావున్నా టీడీపీ, జనసేన వైపు నుంచి స్పందనలు కానీ, ప్రతిపాదనలు కానీ రావడం లేదని బీజేపీకి బెంగ పెరిగిపోతోంది.
ఏపీలో నలుగురు బీజేపీ కీలక నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కొంతమంది నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్టు టాక్ నడుస్తోంది. పొత్తుల విషయమై నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ హైకమాండ్ కాగా వాళ్లు మాత్రం అప్పుడే ప్రచారాలు మొదలు పెట్టారని అందుకే రాష్ట్ర బీజేపీపై టీడీపీ, జనసేన గుర్రుగా ఉన్నాయని అధిష్టానానికి వివరించారు. చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూస్తే వైసీపీ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థం చేసుకుని వ్యూహాలు రచించాల్సింది పోయి ఆ నలుగురు పెత్తందార్లు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం చెందుతున్నారు. దానితో విస్తుపోయిన ఢిల్లీ కీలక నేతలు ఇప్పటిప్పుడే బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు వద్దని రాష్ట్ర నేతలకు సూచిస్తున్నారు. మోదీ, అమిత్ షా, నడ్డా దృష్టికి తీసుకెళ్లి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, ఆ నలుగురి సంగతి అధిష్టానమే చూసుకుంటుందని హామి ఇస్తున్నారు.అయితే ఏ పనైనా వీలైనంత త్వరగా పరిష్కారాలు వెదికి మిత్రపక్షాలను కలుపుకుపోతేనే ఉపయోగం ఉంటుందని రాష్ట్ర నేతలు గుర్తుచేస్తున్నారు. లేని పక్షంలో 2019 ఎన్నికల్లాగే ఒక సీటు కూడా రాని పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. మరి బంతి ఇప్పుడు బీజేపీ అధిష్టానం కోర్టులోనే ఉంది కదా.