ఫాంహౌస్‌ స్టింగ్‌లో కీలకమైన పైలెట్‌కి కొత్త కష్టం!

By KTV Telugu On 16 December, 2022
image

గంగుల, రవిచంద్రల బిజినెస్‌లపై ఐటీ, ఈడీ రెయిడ్స్‌. తర్వాత మంత్రి మల్లారెడ్డి టార్గెట్‌గా ఐటీ దాడులు. లిక్కర్‌స్కామ్‌ కేసులో ఈమధ్యే కేసీఆర్‌ కూతురు కవిత విచారణ. ఇప్పుడు తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి డ్రగ్స్‌ కేసులో ఈడీ నోటీసులు. ఫాంహౌస్‌ స్టింగ్‌ ఆపరేషన్‌కి బీజేపీనుంచి గట్టి కౌంటరే ఎదురవుతోంది. రెండేళ్ల క్రితం బెంగళూరులో కలకలం రేపిన డ్రగ్స్‌ కేసులో పార్టీ ఎమ్మెల్యేకి నోటీస్‌తో గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలైంది.

19న విచ్చేయండంటూ ఈడీనుంచి పైలెట్‌ రోహిత్‌రెడ్డికి శ్రీముఖం అందింది. అయితే ఏ కేసుకు సంబంధించిన పిలిచారన్నదానిపై నోటీస్‌లో క్లారిటీ లేదంటున్నారు ఎమ్మెల్యే. ఆయనతో పాటు హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌కి కూడా ఈడీ నోటీసులిచ్చింది. మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో బీజేపీ బేరసారాలను బట్టబయలు చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌ అంతా పైలెట్‌ రోహిత్‌రెడ్డి చుట్టే తిరిగింది. కేసులో దొరికిన ముగ్గురూ మొదట ఆయన్నే కాంటాక్ట్‌ చేశారు. తర్వాత మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తోడయ్యారు. ప్రస్తుతం చడీచప్పుడు లేని బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఇప్పుడు పనిగట్టుకుని విచారణకు పిలవడంతో ఫాంహౌస్‌ కేసుకి ప్రతీకారమేనంటోంది గులాబీ గ్యాంగ్‌. బెంగళూరు డ్రగ్స్‌ కేసును వదలబోమంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి హెచ్చరించిన వెంటనే ఈడీ నోటీసులు రావడంతో అంతా ప్లాన్‌ ప్రకారమే జరుగుతోందంటున్నారు.

బెంగళూరులో సినీ, రాజకీయప్రముఖులు హాజరైన పార్టీలో భారీగా డ్రగ్స్‌ దొరకటం అప్పట్లో కలకలంరేపింది. అప్పట్లోనే పైలెట్‌ సహా కొందరు నాయకులు ఆ పార్టీలో పాల్గొన్నారనే ప్రచారం జరిగింది. తెలంగాణ నేతలతో పాటు కొందరు టాలీవుడ్‌ ప్రముఖులకు బెంగళూరు డ్రగ్స్‌ కేసుతో సంబంధాలున్నట్లు వార్తలొచ్చాయి. గతంలోనే ఓ నటుడితో పాటు వ్యాపారవేత్తను విచారించిన పోలీసులు తర్వాత కొందరికి నోటీసులిచ్చారు. ఈ విచారణలోనే పైలెట్‌ రోహిత్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు వెల్లడైనట్లు ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్‌ కేసులో అప్రూవర్‌గా మారిన కీలక సూత్రధారి మస్తాన్‌చంద్ర కొందరు పేర్లు చెప్పినట్లు సమాచారం. బేరసారాలు బయటపెట్టి భేష్‌ అని అధినేతతో భుజం తట్టించుకున్న రోహిత్‌కి కొత్త కష్టం వచ్చిపడింది పాపం!