ఆదమరిచారో అంతే సంగతులు.. జగన్‌వార్నింగ్‌ !

By KTV Telugu On 16 December, 2022
image

ఎన్నికలకు మరో ఏడాదే టైముంది. అందుకే పార్టీనేతలను పరుగులు పెట్టిస్తున్నారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎప్పుడేం చేస్తున్నారో ఎక్కడుంటున్నారో ఎప్పటికప్పుడు ఆయనకు రిపోర్ట్‌ అందుతోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నేతల చొరవపై ఫీడ్‌బ్యాక్‌ వస్తోంది. పనితీరు బాగోకుంటే పక్కనపెడతానని ముందే వైసీపీ అధినేత నిష్కర్షగా చెప్పేశారు. అందుకే ఎవరి పనితీరు బాగాలేదో మొహంమీదే చెప్పేస్తున్నారు. మార్చుకోకపోతే ఇక మీ ఇష్టం అనేస్తున్నారు.

తాజా సమీక్షలో 32మంది ఎమ్మెల్యేలకు జగన్‌ ఓ రేంజ్‌లో క్లాసుపీకారు. కేవలం ఎమ్మెల్యేలు కాదు వారిలో కొందరు మంత్రులు కూడా ఉన్నారు. మీడియా సమావేశాలతో పార్టీ వాయిస్‌ గట్టిగా వినిపించే కొందరు అమాత్యులకు కూడా అధినేత అక్షింతలు వేశారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో 32 మంది ఎమ్మెల్యేలపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. మార్చి నెలాఖరుదాకా టైమిచ్చారు. ఈ మూడ్నెల్లలో పనితీరు మార్చుకోకపోతే కొత్త అభ్యర్థులు వస్తారని మొహంమీదే చెప్పేశారు.

వైనాట్‌ 175. ఇదే ఇప్పుడు వైసీపీ టార్గెట్‌. అంటే టీడీపీ అధినేతకు కూడా గెలిచే అవకాశం ఇవ్వకూడదన్నంత పట్టుదలతో ఉన్నారు వైఎస్ జగన్‌. అందుకే ప్రతీ ఎమ్మెల్యేని పరుగులు పెట్టిస్తున్నారు. అలుపుతోనో, అలసత్వంతోనో చెప్పిన పనిచేయనివారిని పిలిచి క్లాసు పీకుతున్నారు. సీఎం సీరియస్‌ అయిన 32మందిలో మంత్రులు బొత్స, అంబటి, గుడివాడ, జయరాం, అప్పలరాజు, విడదల రజినీ కూడా ఉన్నారు. అందరిపేర్లు చదివి లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. సీనియర్‌ అమాత్యులపైనా అధినేత ఆగ్రహంతో ఎవరికీ మినహాయింపు లేదన్న విషయం వైసీపీ ఎమ్మెల్యేలకు అర్ధమైంది. అందుకే ఇక జనం తలుపుతీసినా, తీయకపోయినా, పలకరించినా, ప్రశ్నించినా గడపగడపా తొక్కాల్సిందే!