ఏపీలో సంక్షేమపాలన నడుస్తోంది. వైసీపీ నేతలే కాదు రాజకీయాలతో సంబంధంలేని వాళ్లు కూడా ఒప్పుకునే విషయమే ఇది. ఇంటింటికీ సంక్షేమఫలాలు అందాలన్న కాన్సెప్ట్‌తోనే పథకాలు డిజైన్ చేసింది వైసీపీ ప్రభుత్వం. ఏదోరూపంలో లబ్ధిపొందిన ప్రతీ కుటుంబం మళ్లీ ఓటేస్తుందన్నది వైసీపీ లెక్క. ఈ సంక్షేమ ప్రవాహంలో రోడ్లపై గుంతలు పూడ్చకపోయినా, మౌలికవసతుల కల్పనలో వెనుకబడ్డా చలేగా అన్నట్లే ఉంది అధికారపార్టీ వరస.
ఏపీలో మళ్లీ అధికారంలోకి రావాలన్నది టార్గెట్‌గానే వైసీపీ పాలన నడుస్తోంది. మరోసారి అధికారంలోకొస్తే 30ఏళ్లు మనమే ఉంటామన్న ధీమా ఫ్యాన్ పార్టీలో కనిపిస్తోంది. టీడీపీకి వేలుదూర్చే అవకాశం కూడా ఇవ్వకూడదనుకుంటోంది. మరోవైపు జనసేన జోష్ పెంచటంతో వైసీపీ ముందే అలర్ట్ అవుతోంది. అందుకే నియోజకవర్గాలవారీ సమీక్షలు, పర్‌ఫామెన్స్ వీక్‌గా ఉన్న ఎమ్మెల్యేలకు అక్షింతలు. ఎన్నిలకు ఏడాదిముందే జనంలోనే ఉండేలా కేడర్‌ని సిద్ధంచేస్తోంది. తన ప్రచార వ్యూహం పక్కాగా ఉండేలా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
గడపగడపకు ప్రభుత్వం ఉద్దేశమే ఎన్నికల ప్రచారం. ప్రభుత్వ సంక్షేమపథకాలను ఏకరువుపెట్టడం, వారి కష్టసుఖాలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతోంది. మరోవైపు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థ కూడా ప్రచారబాధ్యతని భుజాన వేసుకుంది. పింఛనైనా, ఇంటి ముంగిట్లోకి రేషన్ అయినా జగన్ పేరు ప్రస్తావించకుండా, ప్రభుత్వం చేస్తున్న మేలుని గుర్తుచేయకుండా లబ్దిదారులకు అందటం లేదు. ఇప్పుడు ఇక ప్రతిరోజూ ప్రతీ వీధిలోకి, ప్రతి గడపలోకి గృహ సారథులు రాబోతున్నారు.
ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తోంది వైసీపీ ప్రభుత్వం. వారు నిత్యం రెండుపూటలా జనంలోనే ఉంటారు. ప్రభుత్వ సంక్షేమాన్ని ఏకరువుపెడుతూ, వారికి జరిగిన లబ్ధిని గుర్తుచేస్తూ వైసీపీని మళ్లీ అధికారంలోకి తేవడమే గృహసారధుల డ్యూటీ. ఎవరన్నా కాస్త వ్యతిరేకంగా ఉన్నా, వేరే అభిప్రాయంతో ఉన్నా రోజూ చెవుల్లో జోరీగల్లా వాళ్లకు మైండ్‌వాష్ చేస్తారన్నమాట. ఇప్పటికే వాలంటీర్లు పార్టీ కార్యకర్తల డ్యూటీ చేస్తున్నారు. ఇక 50 ఇళ్లకు ఇద్దరంటే వారి పర్‌ఫామెన్స్ పీక్‌కి వెళ్లిపోవడం ఖాయం. తలుపు తీయకపోయినా కిటికీల్లోంచి అయినా చెప్పాల్సింది చెప్పేస్తారన్నమాట. తప్పదుమరి. వాళ్ల ఉద్యోగాలు వాళ్లూ కాపాడుకోవాలిగా!