పౌరుషాల గడ్డ పల్నాడు మళ్లీ రణరంగంగా మారింది. మాచర్లలో రాజకీయ మంటలు ఎగసిపడుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయమున్నప్పటికీ నేతలంతా అప్పుడే నియోజకవర్గాల్లో సిగపట్లు పడుతున్నారు. ఓ వైపు వైసీపీ గడపగడపకు కార్యక్రమంతో మరోవైపు టీడీపీ ఇందేం ఖర్మ రాష్ట్రానికి అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. దీంతో తారసపడిన చోట నేతలు తన్నుకుంటున్నారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇంఛార్జ్‌ల మధ్య వార్ తీవ్రస్థాయికి చేరింది. వైసీపీ, టీడీపీ నేతల దాడులు, ప్రతిదాడులతో అగ్గి రాజుకుంది. వైసీపీ నేత తురకా కిషోర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డి ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే వార్డులో పిన్నెల్లి అనుచరులు గడపగడపకు కార్యక్రమంతో తిరుగుతున్నారు. ఇది ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటానికి కారణమైంది.
ఎదురుపడిన రెండు పార్టీల నాయకులు ఘర్షణలకు దిగారు. రాళ్లు రువుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. ఏకంగా టీడీపీ ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డి ఇంటికే దుండగులు నిప్పు పెట్టారు. మరో టీడీపీ కార్యకర్త ఇంటిని ధ్వంసం చేశారు. టీడీపీ ఆఫీస్, వాహనాలకు అల్లరిమూకలు నిప్పుపెట్టడంతో హై టెన్షన్ నెలకొంది. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఈ దాడుల పట్ల తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ నాయకులను రౌడీ మూకలుగా అభివర్ణించింది. వైసీపీ రౌడీలు, గూండాలను పెంచి పోషిస్తోందని ధ్వజమెత్తింది. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తోందంటూ మండిపడింది. మాచర్లలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. వైసీపీ గూండాలు విధ్వంసానికి పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఫైరవుతున్నారు.
ఇదిలా ఉంటే ఆ దాడి టీడీపీ పనేనని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతోందని ఎమ్మెల్యే పిన్నెళ్లి విమర్శలు గుప్పించారు. వైసీపీ నిర్వహించిన బీసీ గర్జన విజయవంతమైందన్న అక్కసుతోనే చంద్రబాబు, లోకేశ్ ఇలా కుట్రకు పాల్పడ్డారని అంటున్నారు. టీడీపీ అనుయాయులతోనే విధ్వంసం సృష్టించి, వాహనాలు తగలబెట్టించి, తమపై నెడుతున్నారని ఎదురుదాడి చేస్తున్నారు. తిరిగి అధికారంలోకి రావడం కోసం మాచర్లలో ఫ్యాక్షన్ రాజకీయాలను రెచ్చగొట్టి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకునేందుకు టీడీపీ కుయుక్తులు పన్నుతోందని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. రాత్రి జరిగిన అల్లర్ల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. ఎస్పీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.