రాష్ట్రానికి ఇదేం ఖర్మ అంటూ చంద్రబాబు.. వారాహిని రెడీ చేసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. పాదయాత్ర కోసం లోకేశ్ ముస్తాబు. అంతేనా పొత్తులపై చర్చలు పార్టీల్లో చేరికలు. ఇలా గత కొంతకాలంగా ఏపీలో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తనదే విజయం అని చంద్రబాబు చాలాసార్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి వచ్చే మే లేదా నవంబర్‌లోనే ముందస్తు గ్యారెంటీ అని తేల్చిచెప్పేశారు. ప్రతిపక్షాల వ్యాఖ్యలకు బలం ఇచ్చినట్టే అన్నట్లు సీఎం జగన్ కూడా ఇప్పటికే సమీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను సమాయత్తం చేస్తున్నారు. పనితీరు మార్చుకోవాలని యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. రాజకీయ వాతావరణం చూస్తుంటే ముందస్తు ఖాయం అనే లెవెల్లోనే కనిపిస్తుంది. మరి ఏపీలో పొలిటికల్ సినారియో ముందస్తుకు అనుకూలంగానే ఉందా..? నిజంగానే జగన్ ఐదేళ్ల వరకు ఆగకుండా ముందే ఎన్నికలకు వెళ్తారా..? లేక పాలన పూర్తి చేసుకునే వెళ్తారా..?
ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్న మాట. ఇచ్చిన హామీలను నెరవేర్చాకే జనాలను ఓట్లు అడుగుతామని అంటున్నారు. ఇప్పటివరకూ ఏ పార్టీ చేయని విధంగా మేనిఫెస్టోలో చెప్పిన హామీలు 90 శాతానికి పైగా నెరవార్చామని అంటున్నారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన అరుదైన ముఖ్యమంత్రి జగన్ అని తమ అధినేతను ఆకాశానికెత్తుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను ఐదేళ్ల పాటు సేవ చేయాలని ప్రజలు ఎన్నుకున్నారని పూర్తి టర్మ్ పూర్తయ్యాకే ప్రజల్లోకి వెళ్తామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు. అధికారం లేకపోవడం వల్లే చంద్రబాబు ఎప్పుడూ ముందస్తు అంటున్నారని ఎద్దేవా చేశారు. కార్యకర్తల్లో ఉత్సాహం కోసం చంద్రబాబు మాయమాటలు చెప్తున్నారని సజ్జల పేర్కొన్నారు. పొత్తులు, ఎత్తులు వంటి చచ్చు ఆలోచనలు తమ ప్రభుత్వానికి ఏం లేవని సింగిల్‌గానే బరిలోకి దిగబోతున్నట్లు ఆయన తెలిపారు.
గడపగడపకు కార్యక్రమంపై తాజాగా చేసిన సమీక్షలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పనితీరు బాగోలేని 38మంది ప్రజాప్రతినిథులకు క్లాస్ పీకారు. తీరు మార్చుకోకుంటే ప్రత్యామ్నాయం తప్పదంటూ చివరి అవకాశం ఇచ్చారు. మార్చి వరకు సమయం ఇచ్చారు. మరోసారి మార్చి 17న పార్టీ వర్క్ షాపు జరుగుతుందని చెప్పారు. ఏప్రిల్ నుంచి అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని జగన్ ప్రకటించారు. ఈ లెక్కన చూసుకుంటే ఏఫ్రిల్ తర్వాత ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంటుంది. అప్పటివరకు జగన్ ఆగుతారా? ఐదేళ్ల పాలన పూర్తి చేసుకున్నాకే ఎన్నికలకు వెళ్తారా లేక ముందుగానే వెళ్తారా అనేది ఆయా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. జనవరి నుంచి లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అటు పవన్ కల్యాణ్ బస్సుయాత్ర కూడా వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. వారిని నిలువరించేందుకు జగన్ ముందుగానే ఎన్నికలకు వెళ్లే అవకాశముందనే విశ్లేషణలు సాగుతున్నాయి.