అయ్ బాబోయ్ హై బీపీ! తెలంగాణ వాసుల ఆరోగ్యానికి టోపీ

By KTV Telugu On 18 May, 2022
image

బీపీ.. బీపీ.. బీపీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే టాపిక్.. కాస్త కోపం తెచ్చుకున్నారంటే చాలు వాళ్లకి బీపీ వచ్చేసిందని సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించినా ఆ జబ్బు కిందే జమ కట్టేస్తారు. పచ్చళ్లు తినొద్దు.. కారం, ఉప్పు తగ్గించండి… ఈ కూరగాయలు పక్కకు పెట్టండి.. ఆ ఆకు పసర్లు తాగండి, కోపాన్ని తగ్గించుకొండి… అంటూ వందల కొద్దీ సలహాలు వస్తూనే ఉంటాయి.
తెలంగాణలో చేసిన ఒక తాజా సర్వే జనాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ముఖ్యంగా షుగర్, బీపీలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందంటూ ఈ సర్వే డేంజర్ బెల్ మోగిస్తోంది. నగరంలో కేవలం 19% మంది మాత్రమే బీపీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారని ఈ స్టడీలో తేలింది. కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, గ్లోబల్‌‌ హాస్పిటల్‌‌, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌‌ కలిసి చేసిన స్టడీ రిపోర్ట్‌ లో ఈ విషయాలు బయటకొచ్చాయి.
తెలంగాణను వణికిస్తున్న బీపీ రిపోర్ట్స్

తెలంగాణలో 90 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు.. అందులో 13 లక్షల మందికి బీపీ ఉందని తేలింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 26 నుంచి 50 ఏళ్ల వయసున్న 9 వేల మందికి బీపీ టెస్టులు చేశారు. ఇందులో నుంచి 5 వేల మంది వివరాలను విశ్లేషించి రిపోర్ట్‌‌ తయారు చేశారు. ఈ ఐదు వేల మందిలో 40.7 శాతం మందికి బీపీ… ఇంకో 39.8 శాతం మందికి ప్రీ హైపర్‌‌‌‌ టెన్షన్‌ ఉందని గుర్తించారు. ఇక 19.5 శాతం మందికి బీపీ నార్మల్‌‌గా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది.

కోవిడ్ తర్వాత పెరిగిన హై బీపీ కేసులు

కరోనాకు ముందు తమ స్టడీలో 25 శాతం మందికి మాత్రమే బీపీ ఉందని.. ఇప్పుడు అది ఏకంగా 40 శాతానికి చేరిందని కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం చెబుతోంది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం ప్రపంచంలో 20% మందికి బీపీ ఉండే అవకాశం ఉంది. ఇక ఇండియాలో 22 నుంచి 27% మంది హై బ్లడ్ ప్రెజర్ లిస్ట్ లో ఉండే చాన్స్ ఉంది. హైదరాబాద్ లో మాత్రం అంచనాలకు మించి బీపీ కేసులు పెరిగిపోవడం అందోళన కలిగిస్తోంది. ప్రస్తుత సర్వే ప్రకారం 40% మందికి బీపీ ఉందని సర్వే ద్వారా తెలుస్తోంది. అంటే ఈ సంఖ్య దేశంలో డబ్యూహెచ్ ఓ అంచనా కంటే దాదాపు 13 శాతం ఎక్కువ.

హై బీపీకి వెల్ కం చెబుతున్న అనారోగ్య అలవాట్లు
భాగ్య నగరంలోని 70% మందికి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ లేవని సర్వే తేల్చింది. కోవిడ్ మహమ్మారికి ముందు హైదరాబాద్‌‌లో కేవలం 25% మందికి డయాబెటిస్ ఉంటే, ఇప్పుడు అది 33 శాతానికి చేరింది. షుగర్, బీపీ లక్షణాలు బయటకి పెద్దగా కనపడకపోవడం వల్ల ప్రజలు వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ ప్రభావం ఇతర అవయవాలపై పడి, పరిస్థితి విషమించే వరకు హై బీపీని తెలుసుకోలేకపోతున్నారు. సడన్ హార్ట్ స్ట్రోక్ లకు బీపీయే ముఖ్య కారణంగా ఉంటోంది.

అసలు బీపీ అంటే ఏంటి?
గుండె ఎప్పుడూ సంకోచ, వ్యాకోచాలు చేస్తూ శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇలా సంకోచించినప్పుడు రక్తం గుండె నుండి రక్త నాళాల్లోకి వేగంగా ఒత్తిడితో ప్రవహిస్తుంది. ఈ ఒత్తిడిని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటారు.
గుండె మరల వ్యాకోచించి సాధారణ స్థితికి వచ్చినప్ఫుడు, రక్తనాళాలలో ఉన్న ఒత్తిడిని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తారు. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్త పోటు, సిస్టోలిక్ ప్రెషర్ 90 నుండి 120 మి.మీ గాను, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 60 నుండి 80 మి.మీ వరకు ఉంటుంది. 139/89 మి.మీ స్థాయిని అధిక రక్తపోటు ముందు స్థాయిగాను, 140/90 మి.మీ. స్థాయిని అధిక రక్త పోటుగాను భావిస్తారు.
అయితే ఈ బి.పి మనిషి నుండి మనిషికి వయస్సు పెరుగుతున్నకొద్దీ మార్పు చెందుతూ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రానికి కూడా శరీరంలోని బీపీలో మార్పులొస్తాయి. మానసిక ఒత్తిడి, అనారోగ్యం, టెన్షన్ బీపీని బాగా ప్రభావితం చేస్తాయి.

బీపీ అంటేనే అందరికీ హడల్

బీపీ పలికేందుకు ఈ పదం చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఒకసారి బాడీలోకి చేరిందంటే జీవితం దిన దిన గండంలా ఉంటుంది. హై బీపీ ఉన్నవాకి హార్ట్ అటాక్ వచ్చే చాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్, కంటి జబ్బులు, మెదడులో రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు, పక్షవాతం, విపరీతమైన తలనొప్పి కూడా వేధిస్తాయి. హై బీపీ ఉన్నవాళ్లు ప్రతిక్షణం అలర్ట్ గా ఉండాలి. లేకపోతే చెట్టంత మనిషి చూస్తూ ఉండగానే కుప్పకూలిపోతాడు. బీపీ ఉన్నవారిలో 60 శాతం మంది మూత్ర పిండాలకు సంబంధించిన జబ్బులతో బాధపడుతున్నారంటే ఇది ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు.

బీపీని తరిమేయాలంటే ఏం చేయాలి?

అన్ని జబ్బులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో బీపీకి కూడా అవే వర్తిస్తాయి. నగరంలో ఉరుకులు పరుగులతో జీవితం గడుపుతున్న వాళ్లు ఎక్కువగా బీపీ బారిన పడుతున్నారు. టైం పత్తాలేని ఫుడ్ హ్యాబిట్స్, నిద్ర సరిగా లేకపోవడం, ఒకే చోట కూర్చొని పని చేయడం, వ్యాయామం చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడటం బీపీకి కారణాలుగా చెప్పుకోవచ్చు. అధిక బరువు కూడా అన్ని రోగాలకు మూలకారణంగా ఉంటోంది. నగరంలో 70 శాతం మంది ఉబకాయంతో బాధపడుతున్నారని కూడా సర్వే తేల్చింది.

ఉదయం లేవగానే ఎక్స ర్ సైజ్, వేళకి తినడం, మంచి ఫుడ్ హ్యాబిట్స్, టైంకి నిద్రపోవడం వల్ల హై బీపీకి దూరంగా ఉండొచ్చు.
ఇవన్నీ వినేందుకు బోర్ గా అనిపిస్తాయి. కానీ పాటించకపోతే పర్మినెంట్ గా హాస్పిటల్ బెడ్ పై ఉంచేస్తాయి. ఒక్కోసారి క్యూర్ కాక అక్కడి నుంచే స్మశానానికీ వెళ్లేలా చేస్తాయి. అందుకే తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యకరమైన జీవనానికి వెల్ కం చెప్పండి. బీపీని తరిమి కొట్టండి.