పెనంమీంచి పొయ్యిలోకి.. టీకాంగ్రెస్‌ సర్వనాశ్‌!

By KTV Telugu On 17 December, 2022
image

యుద్ధభేరీ మోగింది. శత్రుసేనలు కదనరంగంలోకి కాలుమోపాయి. సైన్యాధ్యక్షుడు సైగచేస్తే చాలు విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ దేశంలోనే సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆ పార్టీ సేనలు మాత్రం అడుగుబయటపెట్టలేదు. పైగా సొంత సైన్యాధ్యక్షుడిమీదే కత్తిదూస్తున్నాయి. శత్రువులెవరూ చీల్చిచెండాల్సిన పన్లేదు. వీళ్లకు వీళ్లే తలలు తెగనరుక్కునేలా ఉన్నారు. నాటకీయంగా చెప్పినా తెలంగాణకాంగ్రెస్‌ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. గతంలో ఓ వీహెచ్‌ లేదంటే ఓ కోమటిరెడ్డి. అప్పుడప్పుడూ జగ్గారెడ్డి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో సీన్‌మారింది. పెద్దమనిషిలా వ్యవహరించే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తామరాకుమీద నీటిబిందువులా ఉండాలనుకునే మధుయాష్కీలాంటి వాళ్లు కూడా అసమ్మతితో గట్టిగానే గొంతుకలిపారు. ఒరిజనల్‌ కాంగ్రెస్‌ వలసనేతలతో కలుషితమవుతోందని సీనియర్లంతా ధ్వజమెత్తారు. ఒరిజనల్‌ మేమే రేవంత్‌రెడ్డి టీమంతా వలసలేనని తేల్చేశారు. ఎన్నికలకు ఏడాదిముందు పార్టీ పెట్టుకున్న ఆశలకు సామూహికంగా సమాధి తవ్వేస్తున్నారు నేతలంతా.

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లంతా ఒక్కటయ్యారు. కొన్నాళ్లక్రితం ప్రకటించిన టీపీసీసీ కొత్త కమిటీ పార్టీలో కాకరేపింది. కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, మహేశ్వర్‌రెడ్డి, బెల్లయ్య నాయక్ ఒక్కక్కరూ అసమ్మతి స్వరాన్ని వినిపించారు. చివరికి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇంట్లో మీటింగ్‌తో అసమ్మతినేతలంతా ఒక్కటయ్యారు. మునుగోడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా నేనూ మీ వెంటేనంటూ ఇంకాస్త పెట్రోల్‌ పోశారు. నాలుగు పార్టీలు మారిన వాళ్లతో కాంగ్రెస్ పార్టీ బాగుపడదంటున్నారు మొన్నటిదాకా టీపీసీసీ బాధ్యతలు చూసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. కీలకపదవుల్లో వలస నేతలు ఉండటం పార్టీ మనుగడకు ప్రమాదమని హెచ్చరించారు. 180 పోస్టుల్లో 50, 60 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లేనన్నారు. కాంగ్రెస్‌ను రక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే అంతా ఒక్కటయ్యాం అంటున్నారు భట్టి విక్రమార్క. క్యారెక్టర్‌ లేనివాళ్లు కాంగ్రెస్‌ని నడిపిస్తున్నారంటూ మధుయాష్కీ ఇంకాస్త ఘాటుగానే రియాక్ట్‌ అయ్యారు. పార్టీకోసం ఎన్నో కష్టాలు పడ్డవాళ్లమీద కోవర్టుల ముద్ర వేస్తున్నారంటూ జగ్గారెడ్డి ఆవేదనచెందారు. అందరినోటా ఇప్పుడు ఒకటే మాట. అదే సేవ్‌ కాంగ్రెస్‌. కానీ నేతలు ఇలా రోడ్డెక్కాక కాంగ్రెస్‌ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడని ఈ సీనియర్లకు ఎప్పుడు అర్ధమవుతుందో! రేవంత్‌రెడ్డి కార్యక్రమాలకు కూడా వెళ్లొద్దని నిర్ణయించుకున్నారంటే పోరాటానికి ముందే అస్త్రసన్యాసం చేస్తున్నారన్నమాట.