ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు. ఎన్నికల వ్యూహాల్లో కూడా సాయం అందించడం డౌటే. అయితే పీకే కంటే ముందే దక్షిణాది రాష్ట్రాల్లో సేవలు అందించేందుకు సునీల్ కనుగోలు అనే స్ట్రాటజిస్ట్‌ను కాంగ్రెస్ నియమించుకుంది. తమిళనాడులో అన్నాడీఎంకే మెరుగైన ఫలితాలు సాధించడంలో సునీల్ కణుగోలు కీలకంగా వ్యవహరించారు. సునీల్ తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ కోసం పని చేయాలని ఒప్పందం చేసుకున్నారు. సునీల్… ప్రశాంత్ కిషోర్‌తో కలిసి ఐప్యాక్‌లో పని చేశారు. చాలా కాలం పని చేసిన తర్వాత సొంత బాట పట్టారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌కు ఆయన సలహాలిస్తున్నారు. టీ కాంగ్రెస్ దూసుకెళ్లడానికి ఆయన చిట్కాలు బాగా ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు.
పార్టీ నేతల మధ్య సఖ్యతకు వ్యూహం !
కాంగ్రెస్ అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న పార్టీ. నేతల మధ్య ఆధిపత్య పోరాటం సహజం. ఇప్పుడు జిల్లాల వారీగా ఇలా పోరాడుతున్న నేతల గురించి ఆరా తీసి వారి మధ్య సఖ్యతను చూపించే ప్లాన్ ను సునీల్ హైకామండ్‌కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జిల్లాల వారీగా నేతల పేర్లతో విశ్లేషణ రెడీ చేసారు. వారికి ఎంత బలం ఉంది.. వారు పార్టీకి వ్యతిరేకంగా చేస్తే ఎంత నష్టం జరుగుతుంది.. వదిలించుకుంటే ఎంత మంచి జరుగుతుంది.. ఇలాంటి వివరాలతో ఓ రిపోర్ట్ రెడీ చేశారు. దానిప్రకారం.. నియోజకరవర్గాల్లో కీలక నేతలను ఖరారు చేసి.. ఉంటే ఉండండి.. మిగతా వాళ్లు పోతే పోవాలని సూచించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఈ బ్లూ ప్రింట్ ను అమలు చేయబోతున్నారు.
చేరికలకు ప్రత్యేక వ్యూహం !
ఇతర పార్టీల్లోని పలువురు సీనియర్లు కాంగ్రెస్ లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా.. చేర్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే డీఎస్ ఇప్పుడో.. అప్పుడో చేరుతారంటూ సాగుతూనే ఉంది. ఆయన చేరికను హస్తం నేతలు అడ్డుకుంటున్నారు. అటు మహబూబ్ నగర్ లోనూ ఎర్ర శేఖర్ చేరికకు అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. కొల్లాపూర్ కు చెందిన టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు రేపో, మాపో గులాబీ కండువా వీడుతారని అంటున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నేతే. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో చేరుతారని భావిస్తున్నా.. గ్రూపు రాజకీయాలు అడ్డు పడుతున్నాయి. ఈ చేరికల వ్యూహాలను కూడా సునీల్ ఖరారు చేశారు. వారి చేరిక లాభం అయితే.. కొంత మందిని గెంటేసి అయినా చేర్చుకోవాలని .. దానికి రూట్ మ్యాప్ రెడీ చేసినట్లుగా భావిస్తున్నారు.
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని భావన కల్పించే వ్యూహం !
ఇటీవల ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్.. పార్టీ రాష్ట్ర నేతలతో డిన్నర్ మీటింగ్ నిర్వహించింది. ఆ సమయంలోనే సమగ్ర నివేదికను అందించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అధికార పార్టీపై భారీగా వ్యతిరేకత ఉన్నా.. ప్రతిపక్ష పార్టీకి పూర్తి స్థాయిలో కలిసి రావడం లేదని, దాన్ని అందుకోవడంలో విఫలమవుతున్నారని, దీనికి ప్రధాన కారణం గ్రూపు రాజకీయాలేనని నివేదిక బట్టబయలు చేసింది. వాటిని సర్దుబాటు చేసుకుని ప్రత్యామ్నయాం తామేనని నిరూపించాలడానికిరూట్ మ్యాప్ కూడా అందులో ఉంది.
రేవంత్ రెడ్డి స్వయంగా మంచి వ్యూహకర్త. అయితే తటస్థంగా ఉండే వ్యక్తి అందించే సలహాలు, సూచనలు ఎప్పుడూ సత్ఫలితాలు ఇస్తాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ.. రేవంత్ కూడా సునీల్ సలహాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.