2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. లోక్ సభ ఎన్నికల్లోనూ మూడంటే మూడు స్థానాల్లోనే గెలిచింది. ఓటమి తర్వాత పోస్ట్ మార్టం చేసుకున్న చంద్రబాబుకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.చాలా మంది నాయకులు ఎన్నికలను లైట్ తీసుకున్నారని వెల్లడైంది. కొందరి చర్యల కారణంగా పార్టీకి చెడ్డపేరు వచ్చి తటస్థ ఓటర్లు దూరమయ్యారని చంద్రబాబు గ్రహించారు. కులం పేరు చెప్పుకుని కొందరు పార్టీని దెబ్బతీశారని నిర్ధారణకు వచ్చారు. క్షేత్రస్థాయిలో అసలు పనిచేయకుండా పార్టీలో మాత్రం కలరింగ్ ఇచ్చిన వాళ్లు ఘోరంగా ఓడిపోయారని లెక్కగట్టుకున్నారు. సొంత డబ్బులు పైసా కూడా ఖర్చు పెట్టకుండా పార్టీ ఫండ్ తోనే గెలవాలనుకున్న వారితో కొత్త తలనొప్పులు వచ్చాయని గ్రహించారు. కేవలం పార్టీ పరపతితోనూ చంద్రబాబు ఇమేజ్ తోనూ గెలిచిపోతామని చాలా మంది నేతలు ఉదాసీనంగా ఉన్నారని తెలుసుకున్నారు. కార్యకర్తలను పట్టించుకోకుండా సామాన్య జానాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్లు కూడా ఉన్నారని చంద్రబాబుకు నివేదికలు అందాయి.
చంద్రబాబు మెతక వైఖరిని వదిలెయ్యాలనుకున్నారు. విజయవాకాశాలను బేరీజు వేసుకుంటున్న టీడీపీ అధినేత ఇకపై మొహమాటానికి పోకూడదని తీర్మానించుకున్నారు. అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినంత మాత్రన టికెట్ ఖాయమన్న ఆలోచన వద్దంటున్నారు. నియోజవర్గాల సమీక్షల్లోనూ తనతో వ్యక్తిగత చర్చల్లోనూ ఆయన ఇదే మాట తెగేసీ చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాల లెక్కన గత ఎన్నికల ఫలితాలను చూసుకుని టికెట్ ఇవ్వాలా వద్దా అని తీర్మానించుకుంటున్న చంద్రబాబు ఆ సంగతి నేరుగా ఆశావహులకే చెప్పేస్తున్నారు జిల్లాల టూర్ సందర్భంగా సమీక్షలు నిర్వహిస్తూ టికెట్ల పంచాయతీని కూడా తీర్చేస్తున్నారు. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబుకు టికెట్ ఇచ్చేది లేదని మొహం మీదనే చెప్పేశారట. మాగంటి బాబు గత ఎన్నికల్లో విజయం సాధించలేదు. నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నారు. జనంలో కూడా మాగంటి నాయకత్వంపై ఆసక్తి లేదని చంద్రబాబు చేయించిన సర్వేల్లో వెల్లడైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు మాజీలకు టికెట్లు లేవని చెప్పేశారు. మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు లాంటి నేతలకు ఇప్పటికే సారీ చెబుతూ సందేశం వెళ్లింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు తనయుడు కోడెల శివరాంకు కూడా టికెట్ ఇవ్వనని తెగేసి చెప్పేశారు. గతంలో ఆయన చేసిన అరాచకాలే ఇందుకు కారణమని చంద్రబాబు వివరించారట.
వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రజా చైతన్యం తీసుకురావడంలో విఫలమైన వారికి టికెట్టిచ్చేది లేదని సూత్రప్రాయంగా చంద్రబాబు డిసైడయ్యారు అందులో రాయలసీమ ప్రాంత నేతలు ఎక్కువగా ఉంటారని చెబుతున్నారు మొక్కుబడిగా ఒకటి రెండు ధర్నాలు చేయడం మినహా పార్టీ కార్యకర్తలను సంఘటితంగా ఉంచడంలో విఫలమైన మాజీలే ఎక్కువమంది ఉన్నారని టీడీపీ అధిష్టానం లెక్కగట్టింది. కోస్తా జిల్లాల్లో వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారిని కూడా పార్టీకే పరిమితం చేస్తామని చెబుతున్నారు. అయితే ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు చెబుతున్నారట. పార్టీ గెలిచిన వెంటనే వారందరినీ మరో రూపంలో అకామడేట్ చేస్తామని హామీ ఇస్తున్నారు. బాగా పనిచేసి పార్టీని గెలిపించిన మాజీలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని అంటున్నారు.
కొందరికి టికెట్ లేదని చెబుతున్న చంద్రబాబు మరికొందరికి మాత్రం టికెట్ ఖాయమని నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే సమర్థంగా పనిచేయాలని సూచిస్తున్నారు. అందులో బోండా ఉమ, దేవినేని ఉమ, యరపతినేని శ్రీనివాస్ లాంటి వాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. గెలిచే అవకాశం ఉన్న తటస్థులను తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెట్టేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దిశగా పార్టీ కీలక నేతలకు ఆదేశాలు అండటంతో వారు పనులు మొదలెట్టారు. మరి చంద్రబాబు ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి.