అందరి కళ్లు మెస్సీపైనే

By KTV Telugu On 18 December, 2022
image

 

మెస్సీకి కలగానే మిగిలిన ప్రపంచ కప్‌ టైటిల్
36ఏళ్ల తర్వాత ముంగిట కప్ ముద్దాడే అవకాశం
నేడే ఫ్రాన్స్‌తో అర్జెంటీనా ఫైనల్ ఫైట్
ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాలని ఆరాటం

ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. టైటిల్ ఫైట్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ తో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా తలపడనుంది. క్రీడాభిమానుల కళ్లన్నీ ఇప్పుడు స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీపైనే ఉన్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న మెస్సీ ఈ సారి అర్జెంటీనాను ఛాంపియన్‌గా నిలబెడతారని ఆ దేశాభిమానులు నమ్ముతున్నారు. 35 ఏళ్ల మెస్సీకి ఇదే లాస్ట్ మ్యాచ్ కూడా. అర్జెంటీనా టైటిల్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. మెస్సీతో కూడిన ఆ జట్టు ఎన్నో దశాబ్దాలుగా విశ్వవిజేత కావాలని కలలు కంటున్నా అది అందని ద్రాక్షగానే మిగిలింది. ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచకప్‌ అందినట్టే అంది చేజారింది. ఈసారి కప్‌ను ముద్దాడే అవకాశం మెస్సీ ముంగిట వచ్చింది. ఫిఫా ఫైనల్ మ్యాచే తన అంతర్జాతీయ కెరీర్‌లో అర్జెంటీనా తరఫున చివరి మ్యాచ్‌ అవుతుందని ఇప్పటికే మెస్సీ ప్రకటించాడు. ఈ తుది సమరాన్ని చిరస్మరణీయం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.

అర్జెంటీనా 1978, 1986లో రెండుసార్లు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. మాజీ వెటరన్ ఆటగాడు డిగో మారడోనా అర్జెంటీనాకు చివరిసారిగా టైటిల్‌ అందించాడు. ఆ తర్వాత చాలాసార్లు ఈ ట్రోఫీ దగ్గరికి వచ్చి దూరమైంది. 36 ఏళ్ల కలను నెరవేర్చుకునేందుకు మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా బరిలోకి దిగతోంది. తమ దేశానికి కప్ అందించి తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని తాపత్రయపడుతున్నారు మెస్సీ. అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిస్తే చరిత్రలో నమోదైన 5 రికార్డులు మారిపోతాయి. మెస్సీ తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తాడు. దీంతో అతను 2 ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా కెప్టెన్లు డేనియల్ పసరెల్లా, డిగో మారడోనా క్లబ్‌లో చేరిపోతాడు. అర్జెంటీనా ప్రపంచకప్‌ను మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు గెలుచుకున్న నాలుగో జట్టుగా అవతరిస్తుంది. బ్రెజిల్ అత్యధికంగా 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. జర్మనీ, ఇటలీ జట్లు 4-4 సార్లు చాంపియన్‌గా నిలిచాయి.

టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకటిగా ఖతర్‌కు వచ్చిన అర్జెంటీనాకు తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. దాంతో మెస్సీపైనే కాకుండా అర్జెంటీనా జట్టు సత్తాపై అందరికీ సందేహం కలిగింది. కానీ ఆ తర్వాత రాకెట్‌లా దూసుకెళ్లింది. కెప్టెన్‌గా మెస్సీ రెండో మ్యాచ్‌ నుంచి అంతా తానై జట్టును ముందుండి నడిపించాడు. మెరుపు కదలికలతో ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ఐదు గోల్స్‌ చేయడంతోపాటు సహచరులు గోల్స్‌ చేయడానికి తోడ్పడ్డాడు. క్వార్టర్ ఫైనల్‌లో నెదర్లాండ్‌ను పల్టీ కొట్టించి సెమీస్‌లో క్రొయేషియాను మట్టికరిపించి అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చాడు. ముఖ్యంగా క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో మెస్సీ మ్యాజిక్‌తోనే అర్జెంటీనా మూడో గోల్‌ చేయగలిగింది.

ఇప్పటి వరకు అర్జెంటీనా-ఫ్రాన్స్‌లు 12 సార్లు తలపడ్డాయి. ఈ మ్యాచుల్లో ఫ్రాన్స్ పై అర్జెంటీనా 6 సార్లు గెలుపొందగా మూడు మ్యాచులు డ్రాగా ముగిశాయి. ఫ్రాన్స్ 3 సార్లు మాత్రమే విజయం సాధించింది. రెండు జట్లు కూడా తమ మూడో ప్రపంచకప్ టైటిట్ ని గెలుచుకోవాలని చూస్తున్నాయి. పేరుకు అర్జెంటీనా–ఫ్రాన్స్‌ జట్ల మధ్య సాకర్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ అయినా దీనిని మెస్సీ, ఫ్రాన్స్‌ మధ్య పోరుగానే చూస్తున్నారంతా. అర్జెంటీనా విజయావకాశాలు మెస్సీ ఆటపైనే ఆధారపడి ఉండగా ఫ్రాన్స్‌ మాత్రం సమష్టి ఆటతో ఫైనల్‌కు చేరుకుంది. మొత్తంగా టైటిల్ అందుకునేందుకు అడుగుదూరంలో ఉన్న అర్జెంటీనా కప్‌ను ముద్దాడే మధుర క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.