వైసీపీ రెండో ఆఫీస్‌గా శారదా పీఠం ?

By KTV Telugu On 19 May, 2022
image

ఏపీ అధికార పార్టీ వైసీపీ రెండో కార్యాలయంగా విశాఖలోని శారదా పీఠం మారింది. శారదాపీఠం ముందు వైసీపీ స్వాగత తోరణాలు ఎప్పుడూ ఉంటున్నాయి. ప్రతీ రోజూ ఏదో ఓ స్థాయి నేత వచ్చి స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. ఫల, పుష్పాలు సమర్పించుకుంటున్నారు. దీంతో అక్కడ సందడే సందడి నెలకొంటోంది. కొత్తగా కేబినెట్ మార్చిన తర్వాత ఇలా వచ్చే వారి సంఖ్య ఇంకా పెరిగింది. దీంతో ఏపీలో సరికొత్త రాజకీయ కేంద్రంగా విశాఖలోని శారదాపీఠం మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది.

సీఎంకు చెప్పుకోవడం కన్నా స్వరూపానందకు చెప్పుకోవడం బెటరనుకుంటున్న వైసీపీ నేతలు !

సాధారణంగా మంత్రులకే సీఎం దగ్గర అపాయింట్మెంట్ దొరకడం అంత సులభం కాదనే ప్రచారం ఉంది. దీంతో తమ కష్టాలూ, విజ్ఞప్తులూ విశాఖ వచ్చి స్వామీజీకి చెప్పుకుంటే ఆయనే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళతారని వైఎస్సార్‌సీపీ నేతలలో నమ్మకం ఏర్పడుతోంది. సిఫార్సులు కావొచ్చు. మరే పనైనా కావొచ్చు. ఒక్కసారి శారదా పీఠానికి వచ్చి స్వరూపానందేంద్ర స్వామీజీని కలిస్తే చాలు, పనైపోతుంది అనే నమ్మకం కలగడంతో అధికారులు, మంత్రులు, ఇతర నేతలు చలో శారదా పీఠం అంటున్నారు. చిన్న చిన్న పనుల దగ్గర్నుంచి మంత్రి పదవుల వరకూ స్వరూపానంద సిఫార్సుల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు.

మంత్రుల చలో శారదా పీఠం !

ఏపీ కొత్త మంత్రివర్గంలో సమాచారశాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, పౌర సరఫరాలశాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మత్స్యకారశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, పర్యాటక శాఖా మంత్రి రోజా, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి ముత్యాల నాయుడు, వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని… ఇప్పటివరకూ విశాఖ శారదా పీఠానికి చేరుకుని స్వరూపానందేంద్ర స్వామి కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకున్నవారిలో ఉన్నారు. ఒక మహిళా మంత్రికి స్వామీజీ ఆశీస్సులతోనే మంత్రి పదవి వచ్చిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి కేబినెట్లోనే మంత్రి పదవి ఖరారు అనుకున్నప్పటికీ రకరకాల సమీకరణాల నేపథ్యంలో అది కాస్తా రాలేదు. ఏపీ తాజా క్యాబినెట్‌లో ఆమెకు మంత్రి పదవి ఇవ్వడాన్ని ఆమె నియోజకవర్గ నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నారట. అయితే ఆమెకు స్వామీజీ ఆశీస్సులతో మంత్రి పదవి దక్కింది. అయితే తనకు అంత ప్రాధాన్యత ఉన్న శాఖ దక్కలేదని విశాఖ వచ్చి స్వామీజీకి మొర పెట్టుకోగా ఈ సారికి అలాగే కొనసాగాలని చెప్పినట్టు సమాచారం .

తగ్గిన చినజీయర్ ప్రాభవం.. పెరిగిన స్వరూపానంద వైభవం !

తెలంగాణలో చిన జీయర్ స్వామీ, పరిపూర్ణానంద స్వామీజీలు ప్రభావం చూపగల వ్యక్తులు. అయితే ఏపీలో మాత్రం స్వరూపానంద స్వామీజీ లెక్కే వేరు అన్నట్టు పరిస్థితి ఉంది. చినజీయర్ స్వామి కేసీఆర్ అభిమానాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఒంటరయ్యారు. రాజకీయంగానూ, ఆధ్యాత్మికంగానూ ఒక రాష్ట్ర ప్రభుత్వంపై స్వామీజీ ప్రభావం ఈ స్థాయిలో ఉండటం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అని విశాఖతో పాటు ఏపీలోని ఇతర జిల్లాల్లోనూ టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర పీఠాలతో పోలిస్తే శారదా పీఠం విభిన్నమనే చెప్పాలి. ఇక్కడి రాజ శ్యామల అమ్మవారు చాలా శక్తివంతమైనవారని ఆశ్రమ వర్గాలు చెబుతుంటాయి. అందుకే ఆమె దర్శనం కోసం ఇక్కడకు వస్తున్నామని మంత్రులు అంటున్నారు. దానికి తగ్గట్టుగానే స్వామీ స్వరూపానంద చెప్పిన పనులన్నీ ఏపీ ప్రభుత్వంలో జరిగిపోతున్నాయని వినికిడి.

భూ నజరానాను అందుకున్న స్వరూపానంద !

దేవాదాయ శాఖలో అయితే స్వామీజీ మాటే వేదం. సింహాచలం కావొచ్చు, రుషికొండ వద్ద గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయినా.. స్వామీజీ తెలిపిన తరువాతే ఏ కార్యక్రమం అయినా అన్నట్టు పరిస్థితి ఉందని విశాఖ ప్రజలు అనుకుంటున్నారు. స్వామీజీ అభిమతం మేరకు ఈ మధ్యే భీమిలిలో ప్రశాంత వాతావరణం మధ్య భూమిని కేటాయించింది ఏపీ ప్రభుత్వం. చినజీయర్ కన్నా ఇప్పుడు.. స్వరూపానందనే పవర్ ఫుల్ స్వామి. వైసీపీకి రెండో అధికార కేంద్రం.