ఇవాళ ఉదయం నుంచి బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఈడీ కి మధ్య దాగుడుమూతలాట కొనసాగింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆయన ఈరోజు ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. విచారణకు వచ్చేటప్పుడు ఆస్థిపాస్తుల వివరాలు, ఆదాయపన్ను రిటర్న్‌లు, ఆధార్ కార్డు, పాస్పోర్టుతో సహా పది అంశాలతో కూడిన బయోడేటాను వివరాలతో విచారణకు హాజరు కావాలని రోహిత్‌రెడ్డికి ఈడీ సూచించింది. అలాగే 2015 ఏప్రిల్ నుంచి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అందించాలని రోహిత్‌రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న విద్యార్హతలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తన విద్యార్హతలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తీసుకురావాలని ఈడీ పేర్కొంది. తనకు నోటీసులు వచ్చిన మాట నిజమే అని, విచారణకు తప్పకుండా హాజరవుతానని రోహిత్‌రెడ్డి చెబుతూ వచ్చారు.
ఉదయం ఇంట్లో నుంచి బయటకొచ్చి ఈడీ ఆఫీసుకు బయలుదేరారు. అదే సమయంలో ఆయనకు ఫోన్ కాల్ రావడంతో ఈడీ ఆఫీసుకు వెళ్లకుండా నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు. సీఎం కేసీఆర్ తో సుమారు గంటన్నర సేపు సమాఏశమయ్యారు. ముఖ్యమంత్రితో భేటీ తర్వాత పరిణామాలు మారిపోయాయి. ఈ రోజు తాను విచారణకు హాజరుకాలేని ఈడీకి ట్విస్ట్ ఇచ్చారు. అధికారులు అడిగిన డాక్యుమెంట్లు సేకరించడం పూర్తికాలేదని అందువల్ల తనకు వారం రోజులు గడువు కావాలని ఈడీ అధికారులను కోరారు. గడువు కోరుతూ రాసిన లేఖను రోహిత్‌రెడ్డి పీఏ ఈడీ ఆఫీసులు ఇచ్చి వచ్చారు. అయితే గడువు ఇవ్వడం కుదరదని ఈడీ స్పష్టం చేసింది. వెంటనే విచారణకు హాజరు కావాల్సిందేనని రోహిత్‌రెడ్డిని ఆదేశించింది. దాంతో గత్యంతరం లేక మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఈడీ ఆఫీసుకు వెళ్లారు. చట్టంపై తనకు గౌరవం ఉందని విచారణకు విచారణకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు ఎమ్మెల్యే. తనకు ఏ కేసులో నోటీసులు ఇచ్చారో తెలియదన్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.