బీజేపీలోకి ఆ ముగ్గురు నేతలు ?

By KTV Telugu On 20 December, 2022
image

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై అలిగిన కాంగ్రెస్ సీనియర్లు వేరు దారి చూసుకునేందుకే ఇష్టపడుతున్నారు. పార్టీ మారి తీరాల్సిందేనని నిర్ణయించుకున్నారు ఆ దిశగా అడుగులు వేస్తూ ముగ్గురు నేతలు టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తో భేటీ కావడం కూడా జరిగిపోయింది. వారి పేర్లు బయటకు రాకున్నా అందులో ఒక ఉమ్మడి నల్గొండ జిల్లా నేత ఉన్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ బలపడుతున్న తరుణంలో ఆ పార్టీలోకి వెళ్లేందుకు ఇష్టపడని ఒక కాంగ్రెస్ నేత కూడా సంజయ్ తో చర్చలు జరిపిన వారిలో ఉన్నారని చెబుతున్నారు. కరీంనగర్ పర్యటనలో ఉన్న బండి సంజయ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని ఆ ముగ్గురితో భేటీ అయ్యారని బీజేపీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ జీ-9లో భాగమైన మరి కొందరు నేతలు కూడా సంజయ్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఆ భేటీ ఉంటుందని చెబుతున్నారు.

బీజేపీలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నప్పటికీ ఎవరినీ కాదనకుండా చేర్చుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఆ ముగ్గురు నేతల ప్రయత్నం వెనుక కాంగ్రెస్ నుంచే వచ్చి బీజేపీలో చక్రం తిప్పుతున్న డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ప్రమేయం ఉందని చర్చ జరుగుతోంది. నిజానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసిన బీజేపీకి కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాట బాగా ఉపయోగపడుతోంది. చేరికల కోసం ఒక యాక్షన్ ప్లాన్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలతో బండి సంజయ్ టచ్ లో ఉంటూ వారి రాకకు మార్గం సుగమం చేస్తున్నారు. కాంగ్రెస్ బలహీనమైనదని సంకేతాలు వెళితే మరికొందరు నేతలు వస్తారని బీజేపీ ఎదురుచుస్తోంది. బీఆర్ఎస్ లీడర్స్ ను చేర్చుకునే కంటే కాంగ్రెస్ వారిని పిలవడమే మంచిదన్న అభిప్రాయం కమలం పార్టీలో కలుగుతోంది.

కాంగ్రెస్ వారి రాకపై ఢిల్లీలో పార్టీ పెద్దలు నడ్డా, అమిత్ షాతో సంజయ్ సంప్రదిస్తున్నారు. ఒకసారి ప్రధాని మోదీని కూడా కలుసుకుని చేరికలపై పరిస్థితిని ఆయనకు వివరించి ఆమోదముద్ర వేసుకునే పనిలో ఉన్నారు. వచ్చిన వారికి తక్షణమే సంస్థాగత పదవులు ఉండవని తెగేసి చెప్పబోతున్నారన్నది ప్రధాన సమాచారం. ఎన్నికల్లో టికెట్లిచ్చే విషయంపై మాత్రం ఉదారంగా వ్యవహరిస్తామని హామీ ఇస్తున్నారట. టికెట్ల విషయంలోనూ కొన్ని నియోజకవర్గాల్లో పాత, కొత్త అంటూ రాపిడి ఏర్పడినా పాత వారిని సమాధాన పరిచి కొత్త వారికి అవకాశమిస్తామని చెబుతున్నారు. అంతవరకు మాత్రం హామీ ఇవ్వగలమని ఇప్పుడే అందలం ఎక్కించడం మాత్రం కుదరదని తేల్చేశారట.

మునుగోడులో ఓటమి తర్వాత బీజేపీ కసిగా ఉంది. పార్టీకి సరైన క్యాంపైన్ మేనేజర్లు లేకపోవడమే మునుగోడు ఓటమికి కారణమన్న అభిప్రాయం కేంద్ర, రాష్ట్ర శాఖల్లో కలుగుతోంది. కాంగ్రెస్ వారు క్యాంపైనింగ్ లో సిద్ధహస్తులన్న నమ్మకం బీజేపీలో చాలా కాలంగా ఉన్నదే. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రావాలనుకున్న వారిని వద్దనకుండా ఆహ్వానిస్తే క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ తో తలపడేందుకు వ్యూహాలు కూడా సులభమవుతాయని బీజేపీ విశ్వసిస్తోంది. ఎపరిని ఎప్పుడు ఎలా చేర్చుకోవాలని నిర్ణయించి అధిష్టానం నుంచి అనుమతి పొందే బాధ్యత మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అప్పగించే అవకాశాలున్నాయి.