భారత్, చైనా బోర్డర్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
ఈశాన్య ప్రాంతంలో సరిహద్దుల వెంబడి చైనా భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. అత్యాధునిక డ్రోన్లు, యుద్ధ విమానాల కదలికలు పెరిగాయి. అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దులకు 150 కిమీ దూరంలోని బంగ్డా వైమానిక స్థావరంలో చైనా డబ్ల్యూజెడ్-7 డ్రోన్లను మోహరించింది. ఈ డ్రోన్లు నిఘా వేయడంతో పాటు మిస్సైళ్లను కూడా ప్రయోగించగలవు. ఏకధాటిగా 10 గంటల సేపు గాల్లో ఎగిరే సామర్థ్యం వీటి సొంతం. ఈ తరహా డ్రోన్లు భారత్ వద్ద లేవు. ఇటీవల లభ్యమైన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ డ్రోన్లు స్పష్టంగా కనిపించాయి. అంతేకాదు, రెండు ఫ్లాంకర్ శ్రేణి యుద్ధ విమానాలను కూడా చైనా బంగ్డా వైమానిక స్థావరంలో సిద్ధంగా ఉంచింది. ఇవి భారత్ ఉపయోగిస్తున్న రష్యా తయారీ సుఖోయ్ యుద్ధ విమానాలకు సాటి రాగల విమానాలు. 2017లో డోక్లాం వద్ద ప్రతిష్టంభన ఏర్పడినప్పటి నుంచి చైనా సరిహద్దుల సమీపంలో సైనిక కార్యకలాపాలు ముమ్మరం చేసింది. యుద్ధం వస్తే కొన్ని గంటల్లోనే సైన్యాన్ని సరిహద్దులకు తరలించేలా రోడ్డు, రైలు మార్గాలను అభివృద్ధి చేసింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖను దాటి వచ్చిన చైనా సైనికులను భారత్ జవాన్లు చితక్కొట్టి పంపించేశారు. ఆ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది.
చైనా అంటే గిట్టని తైవాన్ మీడియా కూడా ఈ వీడియోను తన టీవీ ఛానల్స్‌లో ప్రసారం చేసి చైనా సైనికుల సత్తా ఇదేనా అని పరువు తీసింది. మరో అంశం ఏమిటంటే ఇటీవల వాస్తవాధీనకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్‌లోని ఔలీలో ఇండో అమెరికన్ దళాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించాయి. అది చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంది చైనా. 1993, 1996లో భారత్ తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడింది. ఆ తరువాతనే తవాంగ్ సెక్టార్‌లో హద్దు మీరి భారత్ జవాన్ల ధాటికి తట్టుకోలేక తోక ముడిచింది. ఆ ఘర్షణ తర్వాత నుంచి సరిహద్దుల్లో యుద్ధ సన్నాహాలను ముమ్మరం చేసింది. చైనా కార్యకలాపాలు పెరిగినందున భారత వైమానిక దళం కూడా అరుణాచల్ ప్రదేశ్ గగనతలంలో యుద్ధ విమాన గస్తీని పెంచింది. చైనాలో కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలు భరించలేక చైనాలో చాలా చోట్ల ప్రజలు తిరగబడ్డారు. దాంతో ఇటీవలే అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ సడలించింది. ఫలితంగా కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. వారి దృష్టిని మరల్చడానికే డ్రాగన్ కంట్రీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే పన్నాగం పన్నిందంటున్నారు పరిశీలకులు.