సాత్వికుడిగా పేరున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు రెండు వైపులా సమస్యలు ఎదురవుతున్నాయి. కరవమంటే కప్పకు కోపం, వద్దంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైందీ పెద్దిరెడ్డి పరిస్థితి. జనాగ్రహాన్ని నియంత్రించలేని పరిస్థితుల్లో పెద్దిరెడ్డి ఉన్నారు. ప్రజల నుంచి వస్తున్న అసంతృప్తిని జగన్ దృష్టికి తీసుకెళ్తే ఏం జరుగుతుందో అర్థం కాక పెద్దిరెడ్డి తలపట్టుకు కూర్చుకుంటున్నారు.
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో పదవిని కాపాడుకున్న అతి కొద్ది మందిలో పెద్దిరెడ్డి ఒకరు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన కీలక నేత. వైఎస్ హయాం నుంచే ఆ కుటుంబానికి సన్నిహితుడు. వైసీపీ ప్రారంభించినప్పుటి నుంచి జగన్ ఫ్యామిలీ, పెద్దిరెడ్డి కుటుంబం క్లోజ్ అయ్యింది. ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఎక్కువ మందికి వైసీపీ టికెట్లు ఇప్పిచ్చిన ఘనత కూడా పెద్దిరెడ్డికే దక్కుతుంది. ఇప్పుడదే పెద్దిరెడ్డికి శాపంగా మారిందని చెప్పుకోవాలి. రెండు ఉమ్మడి జిల్లాలో 28 ఎమ్మెల్సే స్థానాలుంటే దాదాపు 15 చోట్ల పెద్దివర్గమే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారందరూ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. జనం నుంచి వారికి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. గడప గడపకు వెళితే జనం తిడుతున్నారు. ఎమ్మెల్యేలను వారి అనుచరులను అడ్డుకుంటున్నారు.
స్థానిక ఎమ్మెల్యేలకు, అసమ్మతి వర్గానికి మధ్య రచ్చ పెరిగిపోయింది.దానితో వైసీపీలోనే నిరసనలు పెరిగాయి. ఇటీవల పెద్దిరెడ్డి పెనుగొండ వెళితే అక్కడ అసమ్మతి వర్గం ఆయనకు కూడా చెప్పులు చూపించింది. అక్కడి ఎమ్మల్యే శంకర నారాయణ మంత్రిగా పనిచేయడమే కాకుండా పెద్దిరెడ్డికి కుడి భుజం లాంటి వారు దానితో పెద్దిరెడ్డి పరిస్తితి అడకత్తెరలో పడిన పోకచెక్కలా తయారైంది. పెద్దిరెడ్డి వ్యవహారం జగన్ దృష్టికి వెళ్లింది. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారని జగన్ తన పక్కనున్న వారిని అడిగారట. రెండో సారి పదవి ఇచ్చిందీ అసమ్మతిని అణచివేయాడానికి కదా అన్న జగన్ ప్రశ్నకు పక్కనున్న వారి నుంచి సమాధానం రాలేదు. పెద్దిరెడ్డి చెప్పారని అంతమందికి టికెట్లు కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు జనం ముందుకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారని జగన్ ఆగ్రహంగా ఉన్నారట. అధిష్టానం వైపు నుంచి చేయాల్సిందంతా చేస్తున్నామని, క్షేత్రస్థాయిలో తమ అనుచరులను సంసిద్ధం చేయాల్సిన బాధ్యత పెద్దిరెడ్డిపై ఉంది కదా అని జగన్ ప్రశ్నిస్తున్నారట. తన గ్రూపు ఎమ్మెల్యేలను దారికి తీసుకురాలేని పెద్దిరెడ్డి తీరుపై జగన్ అసంతృప్తి చెందుతున్నారు.
జగన్ వై నాట్ 175 అన్న నినాదాన్ని అందుకున్నారు. అంటే ఏపిలో ఉన్న 175 స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించాలన్నది ఆయన ఆలోచనా విధానం. చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో కూడా వేసీపీ గెలవాలని జగన్ ప్లాన్ వేశారు. అంత కాకపోయినా పార్టీ గెలవాలంటే కనీసం 88 స్థానాలు రావాలి. అందులో పెద్దిరెడ్డి వర్గం ప్రధాన భూమిక వహించాలి. ఈ సారి రాయలసీమ జిల్లాలపై జగన్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. సీమాంధ్రలో పార్టీ దెబ్బతిన్నా రాయలసీమలో క్లీన్ స్వీప్ చేస్తే అధికారానికి రావచ్చని జగన్ అనుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కనీసం 20 చోట్ల గెలవాలి. పెద్ది రెడ్డి తీరు చూస్తే మాత్రం పుట్టి మునిగే అవకాశం ఉందన్నదే జగన్ భయమట. మరి జగన్ ను నేరుగా కలిసినప్పుడు పెద్దిరెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.