ఏపీ, తెలంగాణలో తడిసిమోపెడైన అప్పులు

By KTV Telugu On 20 December, 2022
image

అభివృద్ధిలో దూసుకుపోతున్నామని తెలుగు ప్రభుత్వాలు ఢంకా బజాయిస్తున్నాయి. సంక్షేమంలో దేశంలోనే తామే నంబర్ వన్ అని చెప్పుకుంటున్నాయి. తమ పరిపాలన బ్రహ్మాండం అని చంకలు గుద్దుకుంటున్నాయి. కానీ వెనకాల తడిసిమోపెడు అవుతున్న అప్పుల విషయాన్ని మాత్రం దాచిపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికేడాది రుణ భారం పెరిగిపోతోంది. అభివృద్ధి, సంక్షేమం పేరుతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నాయి.
ఈ విషయంలో ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా అది గత పాలకుల పుణ్యమేనంటూ అధికార పార్టీలు ఎదురుదాడి కొనసాగిస్తున్నాయి. మీ హయాంలోనే అప్పులెక్కువ అంటే మీ హయాంలోనే అప్పులెక్కువ అంటూ అధికార, ప్రతిపక్షాలు ఆరోపణలు, ప్రత్యాపరోపణలు చేసుకుంటున్న సందర్భంలో కేంద్రం దీనిపై స్పష్టత ఇచ్చింది. రాష్ట్రాల అప్పుల జాబితా చిట్టాను కేంద్రం బయటపెట్టింది. తెలుగు ప్రభుత్వాలకు షాకిచ్చే న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వెల్లడించింది. ఏటేట అప్పుల భారం, అప్పుల శాతం గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ఆర్థిక సహాయమంత్రి స్పష్టం చేశారు.

బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2018లో ఆంధ్రప్రదేశ్‌ అప్పు 2,29,333.8 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.3,98,903 కోట్లకు చేరినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వకంగా తెలిపారు. ఎదో ఒక రూపంలో ప్రభుత్వం ప్రతి ఏడాది అప్పులు పెంచుకుంటూ పోతోందని మంత్రి తెలిపారు. 2017-18లో 9.8 శాతం అప్పులు తగ్గితే 2020-21 నాటికి 17.1 శాతం పెరుగుదల నమోదైనట్లు తెలిపారు. ఏపీ స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూనే ఉంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చే నాటికి 2014లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 42.3 శాతం ఉండగా ఆ తరువాత భారీగా తగ్గింది. 2015లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ఉన్న అప్పులు 23.3 శాతం ఉండగా 2021 నాటికి ఏపీ స్థూల జాతీయోత్పత్తిలో 36.5 శాతానికి పెరిగినట్లు వెల్లడిరచారు. బడ్జెట్‌లో చూపించిన అప్పుల కంటే ఏపీ ప్రభుత్వం బడ్జెటేతర అప్పులను కూడా భారీగా చేస్తోందని మంత్రి తెలిపారు.

మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ అప్పుల భారం పెరుగుతోందని కేంద్రం తెలిపింది. 2018లో రూ.1.60లక్షల కోట్లుగా ఉన్న అప్పులు 2022 నాటికి రూ.3.12లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొంది. 2017-18లోనే 95.9 శాతం అప్పులు నమోదైనట్టు రాష్ట్ర అప్పుల వివరాలను బయటపెట్టింది. 2017-18 నాటికి గతంతో పోలిస్తే 18.7 శాతం అప్పులుంటే 2021-22 నాటికి 16.7 శాతంగా ఉన్నట్టు స్పష్టంచేసింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం తెలిపింది. 2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా ఆ తరువాత భారీగా పెరుగుదల నమోదైనట్టు వెల్లడిరచింది. 2022 నాటికి తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు నమోదైనట్లు తెలిపింది. ఈ విధంగా తెలుగు రాష్ట్రాలపై మోదీ సర్కారు అక్షింతలు వేసింది.