తమిళహీరోగా పాపులర్ అయినా మూలాలు మాత్రం ఆంధ్రావే. కోలీవుడ్ హీరో విశాల్ మన తెలుగోడే. పూర్తిపేరు విశాల్‌రెడ్డి. అలాంటి హీరోగారి నోట ఇప్పుడు రాజకీయాల మాట వచ్చింది. తన సిన్మా లాఠీ ప్రమోషన్లో భాగంగా తిరుపతి వచ్చిన హీరో విశాల్ నోటి వెంట ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కొంతకాలంగా కుప్పంనుంచి విశాల్ పోటీ చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. నగరినుంచి వాణీవిశ్వనాథ్ పేరులాగే విశాల్ కూడా బరిలో ఉండొచ్చనే ప్రచారం జరిగింది.
విశాల్‌కి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే చెప్పలేనంత అభిమానం. అదే విషయాన్ని బాహాటంగా చెప్పిన విశాల్ కుప్పంనుంచి పోటీచేసేది లేదన్నారు. ఏపీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని హీరో క్లారిటీ ఇచ్చేశారు. కుప్పం నియోజకవర్గంతో విశాల్‌కు అనుబంధం ఉంది. ఆయన తండ్రి కృష్ణారెడ్డి ఒకప్పుడు కుప్పంలో గ్రానైట్ వ్యాపారం చేసేవారు. ఆయనకు తోడుగా విశాల్ కుప్పంలో ఉండేవాడు. కుప్పంలో ప్రతి వీధీ తనకు చిరపరిచితమేనని చెప్పుకున్న విశాల్ తన పోటీపై జరుగుతున్న ప్రచారానికి తెరదించారు.
విశాల్ రాజకీయాల్లోకి రారా అంటే రావచ్చు. కానీ ఆయన దృష్టంతా తమిళనాడుపైనే ఉంది. అక్కడ ఇప్పటికే కొందరు హీరోలు, సెలబ్రిటీలు రాజకీయాల్లోకొచ్చారు. ఇంకొందరు అరంగేట్రం చేయాలని అనుకుంటున్నారు. విశాల్‌కి కూడా సేవా కార్యక్రమాలపై మక్కువ ఎక్కువే. అయితే సేవ చేయడానికి రాజకీయమే అవసరం లేదన్నది విశాల్ వాదన. అందుకే తనకు ఎమ్మెల్యే కన్నా ఎక్కువ సంపాదన ప్రజాప్రతినిధికి మించి ప్రజాభిమానం ఉందని చెప్పేశారు. కుప్పంలో చంద్రబాబుకు పోటీగా విశాల్‌ని దించాలని వైసీపీ ఆలోచన చేసింది. అయితే జగన్‌మీద ప్రత్యేకాభిమానాన్ని చాటుకుంటూనే ఆ ప్రతిపాదనని, ప్రచారాన్ని సున్నితంగా తిరస్కరించారు విశాల్. సో..రాబోయే రోజుల్లో చంద్రబాబుకి కుప్పం ప్రత్యర్థి విశాల్ అయితే కాదు.