సత్తెనపల్లిలో మంత్రి అంబటిపై లంచం ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విపక్షాలు మంత్రి టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. అంబటి రాంబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుమారుడు చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఓ కుటుంబానికి జగన్ ప్రభుత్వం నుంచి రూ.5లక్షల సాయం అందింది. అయితే దాంట్లో సగం ఇవ్వాలంటూ అంబటి అడిగాడని ఓ బాధిత మహిళ జనసేనను ఆశ్రయించడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని ట్వీట్ చేస్తూ ఛీ మీరు పాలకులా అంటూ చంద్రబాబు అంబటిపై వ్యాఖ్యానించారు. అలాగే జనసేన నేతలు కూడా బాధిత మహిళను తమ ఆఫీసుకు పిలిచి ఆమెతో మాట్లాడించి అంబటిని టార్గెట్ చేశారు. ధూళిపాళ్లలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంబటి రాంబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.
తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చిన మంత్రి అంబటి విపక్షాలపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. బాబు నీ బతుకంతా ఇంతే అంటూ ఈనాడు రాసిన వార్తను ట్యాగ్ చేసి చురకలు అంటించారు రాంబాబు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 12 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ఒక్కొక్క కుటుంబానికి రూ.7 లక్షలు చొప్పున మొత్తం రూ. 84 లక్షలను ప్రభుత్వం పరిహారంగా చెల్లించింది. ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేదని చేతనైతే నిరూపించాలని అంబటి పవన్‌కు సవాల్ విసిరారు. దానికి సమాధానం చెప్పలేక తనపై ఏవేవే ఆరోపణలు చేస్తున్నారని అంబటి అంటున్నారు. సత్తెనపల్లిలో ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ ఘటనలో మరణించిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన పంచాయితీని దీనికి ముడిపెట్టి ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. మృతుడు తండ్రి పరిహారం కోసం వస్తే గెంటేసిన పవన్ కళ్యాణ్ తనపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటని ఫైర్ అయ్యారు మంత్రి.
పవన్ కళ్యాణ్ తన పార్టీని చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టి ప్యాకేజీ తీసుకునే సన్నాసి రాజకీయాలు తాను జన్మలో చేయనంటూ అంబటి ఘాటుగా విమర్శించారు. శవాల మీద పేలాలు ఏరుకోవాల్సిన ఖర్మగానీ, రైతుల ఆత్మహత్యల పరిహారాన్ని తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిగానీ తనకు పట్టలేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల దగ్గర నుంచి తాను లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే పదవిని తృణప్రాయంగా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలిచిన అంబటి ఇటీవల కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఇరిగేషన్ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. అయితే అంబటిని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు టీడీపీ, జనసేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గతంలోనూ అంబటి ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో ఒకటి బయటకొచ్చింది. అప్పట్లో అది ప్రకంపనలే సృష్టించింది. తాజాగా మరో వివాదం చుట్టుముట్టింది.