పేరరివలన్ సరే… నళిని మురుగన్ సంగతి ఏంటి?

By KTV Telugu On 20 May, 2022
image

పేరరివలన్ సరే…  నళిని మురుగన్ సంగతేంటి..?

 

రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష పడిన అసాధారణ ఖైదీ పేరరివలన్ ను  విడుదల చేస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. మూడు దశాబ్దాలపైగా జైల్లో ఉన్న పేరరివలన్ ను విడుదల చేసేందుకు రాజ్యాంగ అధికరణం 142లో ఉన్న ప్రత్యేక అధికారాలను సర్వోన్నత న్యాయస్థానంలోని లావు నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం వినియోగించుకుంది. తమిళనాడు ప్రభుత్వం చేసిన అప్పీలు విచారణ సందర్భంగా కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. దీనితో పేరరివలన్ రేపో మాపో రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది..

 

హత్య ఎలా జరిగింది…

 

1991 మే 21న శ్రీపెరంబుదూరులో ఎన్నికల ప్రచార సభకు వచ్చిన రాజీవ్ గాంధీని మానవబాంబుతో హతమర్చారు. అప్పట్లో శ్రీలంక తమిళ ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. శ్రీలంకలో తమను అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వానికి రాజీవ్ సహాయపడ్డారన్న అనుమానం, అక్కసు ఎల్టీటీఈ అధినేత వెలుపిళ్లే ప్రభాకరన్ లో ఉండేది. ఆయన ఆదేశాల మేరకు ఒక బృందం తమిళనాడులోకి ఎంటరై రాజీవ్ ను అత్యంత కిరాతకంగా హతమార్చింది. మానవ బాంబు ధాను తనను తాను పేల్చుకోగా… రాజీవ్ సహా 16 మంది తునాతునకలై పోయారు.. మరుసటి రోజే ఈ కేసుపై సిబీఐ విచారణ ప్రారంభమైంది…

 

కేసులో మొత్తం 41 మందిని నిందితులుగా చేర్చారు. విచారణలోనే 15 మంది చనిపోయారు. మిగతా 26 మందికి 1998 జనవరి 28న చెన్నైలోని పూనమల్లి టాడా కోర్టు మరణశిక్ష విధించింది. 1999 మే 11న ఇదే కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ 19 మందిని నిర్దోషులుగా ప్రకటించి వదిలేసింది. ముగ్గురికి యావజ్జీవ ఖైదు విధించగా.. మురుగన్ అతని భార్య నళిని, శాంథన్, పేరరివలన్ కు మరణశిక్ష ఖరారు చేసింది. అయితే నళినికి క్షమాభిక్ష పెట్టాలని  అప్పట్లో తమిళనాడు ప్రభుత్వమూ, సోనియాగాంధీ విజ్ఞప్తి చేయగా కేంద్రం అందుకు అంగీకరించింది. పేరరివలన్ సహా ముగ్గురి ఉరి శిక్ష అమలుపై 2011లో మద్రాసు హైకోర్టు స్టే విధించింది. 2014లో సుప్రీం కోర్టు వారి మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చింది. గతేడాది స్టాలిన్ ప్రభుత్వం పేరరివలన్ కు పెరోల్ ఇవ్వడంతో పాటు అతడ్ని విడుదల చేయాలని పిటిషన్ వేసింది. ఈ నెల మొదట్లో సుప్రీం కోర్టు పెరరివలన్ కు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు అతడ్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది…

 

నేరం చేశాడా.. ఇరికించారా.. ?

 

రాజీవ్ హత్యలో ఉగ్రవాది ధాను తన నడుముకు బెల్టు బాంబు చుట్టుకుని పేల్చేసింది. ఆ బెల్టు బాంబుకు అవసరమైన రెండు బ్యాటరీలను పెరరివలన్ సమకూర్చాడని అభియోగాలు నమోదయ్యాయి. తాను కొందరికి బ్యాటరీలు తెచ్చిచ్చిన మాట నిజమేనని, అయితే దాన్ని హత్యకు ఉపయోగించబోతున్నారనే సంగతి తెలియదని పెరరివలన్ కోర్టు ముందు చెప్పుకున్నాడు. ఒక కేసు విచారణ సందర్భంగా తనను నిర్బంధ పెట్టి తప్పుడు వాగ్మూలం ఇప్పించారని పెరరివలన్ తన ఆత్మకథలో రాసుకున్నాడు. నిజానికి తప్పుచేశాడో లేదో వేరే విషయం. అతను ఇప్పుడు మారిన మనిషిగా విడుదలవుతున్నారు. 19 ఏళ్ల వయసులో జైలుకు వెళ్లాడు. జులాయిగా తిరిగిన పేరరివలన్.. జైల్లోనే చదువుకున్నాడు. తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ డిప్లోమా కోర్సులో గోల్డ్ మెడల్ సాధించాడు. మాస్కర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తి చేశాడు. ఉరి శిక్ష ఖైదీగా అతడ్ని ఒక గదికే పరిమితం చేసి.. మానసిక వ్యథకు గురిచేసినా…అతను మాత్రం తన చదువును  ఆపలేదు. ఇప్పుడు ముసలి తల్లిదండ్రులను చూసుకునే అవకాశం వచ్చిందని పేరరివలన్ సంతోష పడుతున్నాడు…

 

ఆ తల్లి మూడు దశాబ్దాల పోరాటం

 

పేరరివలన్ తల్లి అర్బుతం అమ్మాళ్ చేసిన పోరాటమే అతని విడుదలకు కారణమని చెప్పక తప్పదు. రాజీవ్ హత్యజరిగిన వెంటనే  పోలీసులు తన ఇంటికి వస్తే.. విషయం తెలుసుకుని ఆమె స్వయంగా కొడుకుని అప్పగించింది. తన కుమారుడు నేరగాడు కాదని తెలుసుకున్న అర్బుతం అమ్మాల్… రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కిన గడపే ఎక్కి.. పెరరివలన్ విడుదలకు పోరాటం సాగించింది. స్తానిక ఎమ్మెల్యే మొదలుకుని, రాష్ట్రపతి వరకు ప్రతీ ఒక్కరినీ ఆమె కలిసింది. లాయర్ల వెంట తిరుగుతూ తను సేకరించిన సమాచారాన్ని వారికి అందించింది. చివరకు ఆర్టికిల్ 142ని  వినియోగించి సుప్రీం కోర్టు పేరరివలన్ ను విడుదల చేయడంతో ఆమె ప్రయత్నం విజయవంతమైంది…

 

నళిని, మురుగన్ కూడా..

 

రాజీవ్ గాంధీ హత్యలో కీలక పాత్ర పోషించి ఇప్పుడు జైల్లో ఉన్న నళిని, మురగన్ కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.. రాజీవ్ గాంధీ హత్యకు ప్లాన్  చేసినప్పుడు తెలిసే నళిని కుటుంబం అందులో భాగస్వామిగా మారిందన్న ఆరోపణలున్నాయి. నళిని తండ్రి ఒక ప్రెస్ ఫోటోగ్రాఫర్. అతడికి చెన్నైలో ఫోటో స్టూడియో కూడా ఉండేది. కొందరు ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థ సభ్యులు నళిని వాళ్ల ఇంట్లో ఉంటూ పథకరచన చేశారని చెబుతారు. అప్పుడు మురుగన్, నళిని బాగా దగ్గరయ్యారు. రాజీవ్ హత్య జరిగిన మరుసటి రోజే నళిని తండ్రి పోలీసులకు లొంగిపోగా..నళిని, మురుగన్ పారిపోయారు. నాలుగు రోజుల తర్వాత వాళ్లని చెన్నైలోనే అరెస్టు చేశారు.  పారిపోయినప్పుడు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. విచారణ క్రమంలో నళిని ప్రెగ్మెంట్ అని  తెలిసింది.. ఆమెకు సంతానం కూడా ఉంది. సోనియా సూచన మేరకు నళినికి క్షమాభిక్ష పెట్టగా… ఇప్పుడు పెరరివలన్ ను విడుదల చేసేందుకు ఏ ఆర్టికిల్ ను వర్తింపజేశారో.. దాని ఆధారంగానే నళిని, మురుగన్ ను విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు…